సాక్షి ముంబై: తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వస్తోంది. రాష్ట్రంలో భ్రూణహత్యలు తగ్గుముఖం పట్టాయి. ఇన్నాళ్లూ ఆడపిల్లా? అని పెదవి విరిచినవాళ్లే ఇప్పుడు వారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎవరైతే ఏంటి.. బాగా వృద్ధిలోకి వస్తే చాలని భావిస్తున్నారు. నిషిద్ధమే అయినప్పటికీ ఇదివరకు రహస్యంగా లింగ నిర్థారణ పరీక్షలు చేయించి, పుట్టబోయేది ఆడ పిల్ల అని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అబార్షన్ చేయించుకునేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రెండేళ్లుగా జనాభాలో ఆడపిల్లల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
2011లో వెయ్యి మంది పురుషులకు గాను 894 మంది ఆడపిల్లలు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య ప్రతి వెయ్యికీ 920కి పెరిగింది. ఈ పెరుగుదల మంచి పరిణామమని, ఇది సామాజిక సమతుల్యతకు దోహదపడుతుందని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు సర్కారు గట్టిగానే కృషి చేసింది. గత మూడళ్లుగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం మంచి ఫలితాలనిచ్చిందని ఆరోగ్య శాఖా మంత్రి సురేష్ శెట్టి అన్నారు. నిబంధనలు అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలకు పాల్పడిన 66 మంది డాక్టర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నామన్నారు.
అయితే జిల్లాల వారీగా పూర్తి వివరాలు రావాల్సి ఉందని అన్నారు. మొత్తానికి ఈ నిష్పత్తి 30 పాయింట్ల పెరుగుదల నమోదైందన్నారు. బీడ్, బుల్‌దానా, సతారాల్లో ఈ పెరుగుదల మరింత అధికంగా ఉందని సామాజిక కార్యకర్త వర్షాదేశ్ పాండే చెప్పారు. పోలీసు, న్యాయవ్యవస్థతోబాటు ఆరోగ్య శాఖ సైతం చేతులు కలిపి ఈ కార్యక్రమాన్ని, చట్టాలను పక్కాగా అమలు చేయడం వల్లే ఈ పెరుగుదల సాధ్యమయ్యిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
దీనికి సంబంధించిన కేసుల విచారణకు సర్కారు ఏకంగా 68 మంది న్యాయవాదులను ఏర్పాటు చేసింది. వాస్తవానికి పట్టణాల్లో ఈ చట్టాలను ఉల్లంఘించిన వారిని పట్టుకోవడం కష్టమని, అయినా సర్కారు పట్టువదలకుండా జోన్ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి చట్టాన్ని పక్కాగా అమలు చేయడం వల్లే మంచి ఫలితాలు సాధిస్తున్నామని మంత్రి సురేష్ శెట్టి అన్నారు.
బంగారు తల్లి..!
Published Wed, Jul 23 2014 10:38 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement