సర్వే పనులు చకచకా..!
రాష్ట్రంలోనే అత్యంతఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు. ఈ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో డిండి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ సంకల్పించింది. అందుకుగాను రూ.6500 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించారు. జూన్ 12న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలోని మర్రిగూడ మండలంలోని శివన్నగూడలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను శంకుస్థాపనగా ఆవిష్కరించారు.
మర్రిగూడ : డిండి రిజర్వాయర్ శ్రీశైలం ఆనకట్ట నుండి లిఫ్ట్‌ద్వారా నీటిని చారకొండకు తీసుకవచ్చిన ఆనంతరం డిండి నుండి నీటిని కాల్వల ద్వార పంపిణీ చేస్తారు.దీని ద్వారా మహుబూబ్‌నగర్ జిల్లాలో 50 వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో డిండి నుండి మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం వరకు సుమారు 3.లక్షల ఎకరాల పైగా బీడు భూములకు సాగు నీరందనుంది.
4 రిజర్వాయర్ల ఏర్పాటు
ఈ పథకంలో భాగంగా మొత్తం ఐదు రిజర్వాయర్ల్ ఏర్పాటు చేయాలకున్నారు.అయితే మహుబుబ్నగర్ జిల్లాలోని చారకొండలో రిజ్వాయర్ వద్దని అక్కడి రైతులు వ్యతిరేకించారు. దీంతో మన జిల్లాలోనే సింగరాజుపల్లిలో 1.5 టీఎం సీలు, గోట్టిముక్కల-ఇద్దంపల్లి వద్ద 2 టీఎంసీలు, కిష్టారాయినపల్లి వద్ద 13 టీఎంసీలు, చెర్లగూడె ంలో 15 టీఎంసీలు సామర్థ్యం గల రిజర్వాయర్ల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రిజర్వాయర్ సింగరాజుపల్లి వద్ద ఈరబోయనపల్లి, తుమ్మలపూర్ తో పాటు 750. ఎకరాల భూమి, ఇద్దంపల్లి వద్ద గొటిముక్కల, ఇద్దంపల్లి 1500, ఎకరాలు, క్రిష్టారాయినపల్లి వద్ద 5500 ఎకరాలు, చెర్లగూడె వద్ద చెర్లగూడెం, వెంకపల్లి, వెంకపల్లితండా, నర్సిరెడ్డిగూడెం పరిధిలో 4500 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది.
మొదలైన సర్వే పనులు
ఈ పథకం సర్వే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదట చార కొండలో గత నెల 22 నుండి ప్రారంభంమై సర్వే పనులు ప్రస్తుతం అంతటా కొనసాగుతున్నాయి. సర్వేకోసం ప్రభుత్వం మొదటి విడుతగా రూ.75 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ సర్వే పనులు హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
అడ్డుకుంటున్న రైతులు
సర్వే పనుల పట్ల రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తే తమ వ్యవసాయ భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆ ప్రాంతాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చెర్లగూడెంలో రిజర్వాయర్ ఏర్పాటుకు నిర్వహిస్తున్న సర్వే పనులను కూడా వారు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో దేవవరకొండ ఆర్డీఓ గంగాధర్, జేసీ సత్యనారాయణ ఇద్దరు నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడినా ప్రయోజనం లేకుండాపోయింది. తమకు ఎకరాకు రూ.15 లక్షల వరకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
పరిహారం ఎలా చెల్లిస్తారంటే..
గతంలో భూములను కోల్పోయిన వారికి 1854 బ్రిటిష్ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేవారు, కానీ ప్రస్తుతం అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జూలై 30న విడుదల చేసిన జీఓ 123 ప్రకారం పరిహారం చెల్లించనున్నారు. మూడేళ్ల నుంచి ఆ ప్రాంతంలో రైతులు జరిపినా క్రయవిక్ర యాల రేటు ఆధారంగా పరిహారం నిర్ణయిస్తారు. ఇప్పడు భూములకు ఉన్న విలువకు 1.5 శాతం అదనంగా ఇతర ఇన్‌సెంట్‌ను ఇవ్వనున్నారు. అయినా రైతులు అంగీకరించకపోతే మరో 25 శాతం వరకు పెంచే ప్రత్యేక అధికారం జిల్లా కలెక్టర్‌కు ఈ చట్టం ప్రకారం ఉంది. రైతుల భూములను నేరుగా నీటిపారుదల శాఖకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పదిహేను రోజుల లోపు రైతుల ఖాతాల్లో ఆల్‌లైన్ ద్వారా పరిహారం నగదు చెల్లిస్తారు. ఇళ్లు కోల్పోయే వారికి ఆర్ఆర్ చట్టం ప్రకారం ఇంటి భూమి, 5 లక్షల వరకు నూతన గృహం, కొత్త గ్రామ ఏర్పాటు, గ్రామంలో ఉండాల్సిన మౌలిక వసతులు కల్పిస్తారు.