అలా చేస్తే... రొమ్ము క్యాన్సర్ రాదట..!
లండన్ః బిడ్డ పుట్టిన తర్వాత ఎక్కువకాలం తల్లిపాలు ఇవ్వడంవల్ల అటు తల్లికి, ఇటు బిడ్డకూ ఎంతో ఆరోగ్యం అంటూ ఇప్పటికే ఎంతో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలను కూడా జరుపుతూ తల్లుల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తారు. అయితే బిడ్డకు ఆర్నెల్లకంటే ఎక్కువగా తల్లిపాలను ఇవ్వడంవల్ల రొమ్ము క్యాన్సర్ కు దూరం కావొచ్చని తాజా అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు.
స్వీడన్ లోని లీంకోపింగ్ విశ్వవిద్యాలయం మరియు కౌంటీ హాస్సిటల్ పరిశోధకులు ప్రాథమిక రొమ్ము క్యాన్సర్ కు చికిత్స నిర్వహించిన 20 సంవత్సరాల తర్వాత మహిళలపై అధ్యయనం చేశారు. నార్వే ట్రోంసో విశ్వవిద్యాలయం సహా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాల్లో ఆర్నెల్లకంటే ఎక్కువ కాలం పాలిచ్చిన తల్లుల్లో రొమ్ము క్యాన్సర్ మరణాల ప్రమాదం భారీగా తగ్గినట్లు తెలుసుకున్నారు. బిడ్డలకు ఎక్కువకాలం పాలిచ్చిన తల్లులు, రొమ్ము క్యాన్సర్ సంక్రమించిన మహిళల మనుగడపై అధ్యయనాలు నిర్వహించిన పరిశోధకులు.. ఎక్కువకాలం పాలిచ్చే తల్లుల్లో రొమ్ముక్యాన్సర్ ప్రభావం తగ్గడంతోపాటు... వారి జీవితకాలం గణనీయంగా పెరిగేందుకు దోహద పడినట్లు పరిశోధకులు చెప్తున్నారు.
బిడ్డలకు ఎక్కువకాలం పాలివ్వడంతో తల్లికి దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలతోపాటు, రొమ్ము క్యాన్సర్ తీవ్రతను తగ్గించే సామర్థ్యం కూడా కలిగి ఉందని తమ అధ్యయనాల్లో నిర్థారించినట్లు.. అమెరికాలోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన ఆర్థర్ ఐ ఈడెల్మన్ తెలిపారు. వారి అధ్యయనాలను బ్రెస్ట్ ఫీడింగ్ మెడిసిన్ జర్నల్ లో నివేదించారు. .