suspenssion
-
తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సీఎం ప్రసంగానికి అడ్డు తగిలినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై శనివారం సస్పెన్షన్ వేటు పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా కాంగ్రెస్ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆయన ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌కి చెందిన పీఏసీఎస్ చైర్మన్‌ను టీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారం టూ ఆరోపించారు. దీంతో రాజగోపాల్‌రెడ్డితోపాటు మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, పోడెం వీరయ్య, సీతక్కను ఒక రోజు సస్పెండ్ చేయాలంటూ సభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఆ వెంటనే వారు సస్పెండ్ అయినట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు నల్లగొండ జిల్లాకు చెందిన పీఏసీఎస్ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా నామినేషన్ వేయడానికి ప్రయత్నించినప్పుడు టీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన విఫలయత్నం చేశారు. తనకు మైక్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరగా తోసిపుచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇవ్వాలని సీఎంని కోరారు. ముఖ్యమంత్రి లేచి మాట్లాడుతుండగా రాజగోపాల్‌రెడ్డి నల్లగొండ జిల్లా పీఏసీఎస్ చైర్మన్ వ్యవహారంపై గట్టిగా అరుస్తూ చెప్పే ప్రయత్నం చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా రాజగోపాల్‌రెడ్డికి తోడుగా లేచి నిలబడ్డారు. అత్యవసర అంశాన్ని ప్రస్తావించేందుకు ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పదేపదే కోరారు. సీఎం ప్రసంగంపై వివరణలకు సమయం ఇస్తామని స్పీకర్ చెప్పినా కాంగ్రెస్ సభ్యులు పట్టువీడలేదు. ఈ సమయంలో కోమటిరెడ్డి బిగ్గరగా అరుస్తూ ఏదో చెప్పబోతుంటే సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా నిబంధనలు తెలియవా..?: సీఎం ‘అటు నలుగురే. ఇటు ఎంతమంది ఉన్నారో చూడండి. మీకంటే రెట్టింపు అరవగలం. సభా సంప్రదాయానికి కట్టుబడి ఉన్నాం. ప్రజాతీర్పును గౌరవించరు. వెళ్లాలంటే వెళ్లిపోండి. ఈ రాద్ధాంతం ఎందుకు? సభలో సభా నాయకుడు ప్రసంగిస్తున్నారనే సంస్కారం కూడా మీకు లేదు. సీఎం ప్రసంగం వినే ఓపిక కూడా మీకు లేదు.’’అని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. సభలో సీఎం మాట్లాడేందుకు లేచినప్పుడు అడ్డుకోరాదనే సభా నిబంధనలు కూడా తెలియదా? లేక తెలిసే అడ్డుకోవాలని అనుకుంటున్నారా? ఇదేం పద్ధతి? సస్పెండ్ చేయాలంటూ సీఎం అనడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి లేచి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
భూపాల్‌రెడ్డిని ఇబ్బంది పెట్టినందుకే..
సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని ఇబ్బందులకు గురి చేసినందుకే ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను సస్పెం డ్ చేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్ వెల్లడించారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదనే అక్కసుతోనే రాములు నాయక్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులంతా తన వెంట ఉన్నారని ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయనకు అంత స్థాయి లేదని విమర్శించారు. -
కోమటిరెడ్డిపై వేటు!
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు దాదాపుగా ఖాయ మైంది. మంగళవారం సభ ప్రారంభంకాగానే కోమటిరెడ్డిని సస్పెండ్ చేయాలంటూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. బడ్జెట్ సమావేశాల వరకే సస్పెన్షన్‌ను పరిమితం చేస్తారా, పూర్తి పదవీకాలం వరకు సస్పెండ్ చేస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. వివిధ రాష్ట్రాల్లో ఏం చర్యలు తీసుకున్నారన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాల నిబంధనలతోపాటు పొరుగు రాష్ట్రాల ఉదాహరణలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని హరీశ్ వెల్లడించారు. వీడియో క్లిప్పింగులను ప్రభుత్వం పరిశీలించింది. నిరసన తెలియజేసే క్రమంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరెవరు దూకుడుగా వ్యవహరించారు, చైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయం కావడానికి దారితీసిన పరిస్థితులేంటి అన్న అంశాలను పరిశీలించారు. అసెంబ్లీలో నిరసన సందర్భంగా ఎవరు దూకు డుగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ గతంలోనే హెచ్చరించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పేపర్లు విసిరినా, ఇతర పద్ధతుల్లో ఆటంకం కలిగించినా బడ్జెట్ సెషన్ పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ముందుగా హెచ్చరించినా పట్టించుకోకుండా గవర్నర్‌పై దాడికి యత్నించిన కాంగ్రెస్ సభ్యులపై కఠినంగా వ్యవహరించాలని సీఎం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ పలువురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంతకుముందు సమావేశాల్లో టీడీపీ సభ్యుడిగా ఉన్న ఎ.రేవంత్‌రెడ్డి తన టేబుల్ దగ్గర నిలబడి నిరసన తెలిపారు. అందుకు ఆయన్ను సమావేశాలు జరిగిన పూర్తికాలం సస్పెండ్ చేశారు. కేవలం తన టేబుల్ దగ్గర నిలబడి, నిరసన తెలియజేసినందుకే సస్పెండ్ చేసిన అధికారపక్షం.. తాజా ఘటనపై మరింత కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే కాంగ్రెస్ సభ్యులు దాడికి ప్రయత్నించలేదని ప్రతిపక్షనేత జానారెడ్డి వాదిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా నిరసన వ్యక్తం చేసే సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను, భౌతికదాడి కోణంలో చూడొద్దని అంటున్నారు. సభలో ప్రజల వాణిని వినిపించే బాధ్యత ఉన్న సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని, ఇలాంటివి జరిగితే చర్చించి, మరోసారి చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే సస్పెన్షన్ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని అధికారపక్షం గట్టిగా భావిస్తోంది. -
'సభలో లేకున్నా నన్ను సస్పెండ్ చేశారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రపాదరావు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ.. అధికార పక్షాన్ని వెనకేసుకొస్తున్నారని, ప్రభుత్వాన్ని కాపాడేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని, అందుకే సభాపతిపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్పీకర్ కోడెలపై పలు కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ పై వైఎస్ఆర్ సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తనను నాలుగుసార్లు సభాపతి సస్పెండ్ చేశారని, తాను సభలో లేకపోయినా ఇటీవల తనపై సస్పెన్షన్ వేటు వేశారని, ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే.. దానిని స్పీకర్ మూజువాణి ఓటుతో మమ అనిపించారని, స్పీకర్ ప్రతి సందర్భంలోనే ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన గౌరవాన్నిగానీ, ప్రాముఖ్యాన్నిగానీ ఇవ్వడం లేదని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సభలో అవకాశం ఇవ్వడం లేదని, ఇలా అన్ని విషయాల్లో అధికారపక్షాన్ని వెనకేసుకొస్తుండటంతోనే స్పీకర్‌పై తాము విశ్వాసం కోల్పాయమని చెప్పారు. అధికార పార్టీ సభ్యులపై ఏనాడూ క్రమశిక్షణ చర్యలు తీసుకోని స్పీకర్ తాను సభలో లేకున్నా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిసారి వెటకారంగా మాట్లాడుతున్నారని, ఈ విషయంలో అధికారపక్షానిది వెటకారమైతే.. తమది వివేకమని ఆయన పేర్కొన్నారు. కాగా, పలు కేసుల్లో స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై పలు కేసులు నమోదైనప్పటికీ, వాటి నుంచి ఆయన కడిగిన ముత్యంలా బయటపడ్డారని, ఆయన క్లీన్ వ్యక్తి అని టీడీపీ సభ్యుడు పల్లె రఘునాథ్‌రెడ్డి చెప్పారు.