సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు దాదాపుగా ఖాయ మైంది. మంగళవారం సభ ప్రారంభంకాగానే కోమటిరెడ్డిని సస్పెండ్ చేయాలంటూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. బడ్జెట్ సమావేశాల వరకే సస్పెన్షన్‌ను పరిమితం చేస్తారా, పూర్తి పదవీకాలం వరకు సస్పెండ్ చేస్తారా అన్న దానిపై స్పష్టత లేదు.
గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. వివిధ రాష్ట్రాల్లో ఏం చర్యలు తీసుకున్నారన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాల నిబంధనలతోపాటు పొరుగు రాష్ట్రాల ఉదాహరణలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని హరీశ్ వెల్లడించారు. వీడియో క్లిప్పింగులను ప్రభుత్వం పరిశీలించింది. నిరసన తెలియజేసే క్రమంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరెవరు దూకుడుగా వ్యవహరించారు, చైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయం కావడానికి దారితీసిన పరిస్థితులేంటి అన్న అంశాలను పరిశీలించారు.
అసెంబ్లీలో నిరసన సందర్భంగా ఎవరు దూకు డుగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ గతంలోనే హెచ్చరించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పేపర్లు విసిరినా, ఇతర పద్ధతుల్లో ఆటంకం కలిగించినా బడ్జెట్ సెషన్ పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ముందుగా హెచ్చరించినా పట్టించుకోకుండా గవర్నర్‌పై దాడికి యత్నించిన కాంగ్రెస్ సభ్యులపై కఠినంగా వ్యవహరించాలని సీఎం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ పలువురిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఇంతకుముందు సమావేశాల్లో టీడీపీ సభ్యుడిగా ఉన్న ఎ.రేవంత్‌రెడ్డి తన టేబుల్ దగ్గర నిలబడి నిరసన తెలిపారు. అందుకు ఆయన్ను సమావేశాలు జరిగిన పూర్తికాలం సస్పెండ్ చేశారు. కేవలం తన టేబుల్ దగ్గర నిలబడి, నిరసన తెలియజేసినందుకే సస్పెండ్ చేసిన అధికారపక్షం.. తాజా ఘటనపై మరింత కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే కాంగ్రెస్ సభ్యులు దాడికి ప్రయత్నించలేదని ప్రతిపక్షనేత జానారెడ్డి వాదిస్తున్నారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా నిరసన వ్యక్తం చేసే సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను, భౌతికదాడి కోణంలో చూడొద్దని అంటున్నారు. సభలో ప్రజల వాణిని వినిపించే బాధ్యత ఉన్న సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని, ఇలాంటివి జరిగితే చర్చించి, మరోసారి చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే సస్పెన్షన్ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని అధికారపక్షం గట్టిగా భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment