'సభలో లేకున్నా నన్ను సస్పెండ్ చేశారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రపాదరావు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ.. అధికార పక్షాన్ని వెనకేసుకొస్తున్నారని, ప్రభుత్వాన్ని కాపాడేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని, అందుకే సభాపతిపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్పీకర్ కోడెలపై పలు కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ పై వైఎస్ఆర్ సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తనను నాలుగుసార్లు సభాపతి సస్పెండ్ చేశారని, తాను సభలో లేకపోయినా ఇటీవల తనపై సస్పెన్షన్ వేటు వేశారని, ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే.. దానిని స్పీకర్ మూజువాణి ఓటుతో మమ అనిపించారని, స్పీకర్ ప్రతి సందర్భంలోనే ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన గౌరవాన్నిగానీ, ప్రాముఖ్యాన్నిగానీ ఇవ్వడం లేదని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సభలో అవకాశం ఇవ్వడం లేదని, ఇలా అన్ని విషయాల్లో అధికారపక్షాన్ని వెనకేసుకొస్తుండటంతోనే స్పీకర్‌పై తాము విశ్వాసం కోల్పాయమని చెప్పారు. అధికార పార్టీ సభ్యులపై ఏనాడూ క్రమశిక్షణ చర్యలు తీసుకోని స్పీకర్ తాను సభలో లేకున్నా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిసారి వెటకారంగా మాట్లాడుతున్నారని, ఈ విషయంలో అధికారపక్షానిది వెటకారమైతే.. తమది వివేకమని ఆయన పేర్కొన్నారు.
కాగా, పలు కేసుల్లో స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై పలు కేసులు నమోదైనప్పటికీ, వాటి నుంచి ఆయన కడిగిన ముత్యంలా బయటపడ్డారని, ఆయన క్లీన్ వ్యక్తి అని టీడీపీ సభ్యుడు పల్లె రఘునాథ్‌రెడ్డి చెప్పారు.