అవిశ్వాసం చర్చ ప్రారంభంపై అసెంబ్లీలో వివాదం | ruccus in ap assembly over issue of initiating discussion on no confidence motion | Sakshi
Sakshi News home page

అవిశ్వాసం చర్చ ప్రారంభంపై అసెంబ్లీలో వివాదం

Published Mon, Mar 14 2016 1:00 PM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

అవిశ్వాసం చర్చ ప్రారంభంపై అసెంబ్లీలో వివాదం - Sakshi

అవిశ్వాసం చర్చ ప్రారంభంపై అసెంబ్లీలో వివాదం

అవిశ్వాస తీర్మానంపై చర్చను సోమవారమే చేపట్టాలన్న అంశంలోనే కుట్ర దాగి ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ చర్చను ఎవరు ప్రారంభించాలన్న విషయంపై సోమవారం ఏపీ అసెంబ్లీలో వివాదం చెలరేగింది. తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు సంతకం పెట్టలేదు కాబట్టి, చర్చను ఆయన ప్రారంభించే అవకాశం లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తీర్మానాన్ని ప్రతిపాదించినవాళ్లు మాత్రమే చర్చను ప్రారంభించాలని, ఆ తర్వాత ఎవరైనా మాట్లాడుకోవచ్చని ఆయన తెలిపారు. దీనికి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ''అవిశ్వాస తీర్మానాన్ని ఒకే ఒక్క సభ్యుడైనా సంతకం పెట్టి ఇవ్వచ్చు. మొత్తం సభ్యులలో 10 శాతం మంది, అంటే 18 మంది దీనికి ఆమోదం తెలిపితే చర్చ చేపట్టేందుకు ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాత బీఏసీలో నిర్ణయించిన దాని ప్రకారం చర్చ మొదలవుతుంది. ఒక్కరే సంతకం పెట్టారు కాబట్టి ఆ ఒక్కరే చర్చ సాగించాలంటే కుదరదు. రూల్స్ తెలుసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వాజ్‌పేయి ఓడిపోయినప్పుడు అవిశ్వాసం మూవ్ చేశారు. అక్కడేమైనా సోనియాగాంధీ సంతకం పెట్టారా? ఎవరో ఒకరిద్దరు సంతకం పెట్టొచ్చు. ఎవరో ఒకరిద్దరు సంతకాలు పెడతారు. తీర్మానం మూవ్ చేసిన రోజు సంఖ్యాబలం ఉందా లేదా అని చూస్తారు. తర్వాత 10 రోజుల్లోగా ఆమోదయోగ్యమైన రోజును నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయాలు జరుగుతున్నాయి. మూవ్ చేసిన ఐదారు గంటలకే ఈరోజే ఎందుకు చర్చ మొదలుపెట్టారంటే.. 8 మంది మా సభ్యులను మీరు ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. వాళ్లు కనీసం సభలో కూడా కనిపించడం లేదు. వాళ్లను అనర్హులను చేయడానికి మనసు లేదు'' అని ఆయన చెప్పారు.

అంతకుముందు పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చర్చను ప్రారంభించారు. ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం వైఎస్ఆర్‌ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తరఫున ప్రవేశపెట్టిన నేపథ్యంలో చర్చకు అనుమతించినందుకు ధన్యావాదాలు తెలుపుకొంటున్నామని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాహితాన్ని, ప్రజాభివృద్ధిని గాలికి వదిలి, బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఇది ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని, సభ్యుల విశ్వాసాన్ని కూడా కోల్పోయిందని సభలో చెప్పడం కోసం ఈ తీర్మానాన్ని తాము ప్రవేశపెట్టామన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాల్సిందిగా అందరినీ కోరుతున్నట్లు చెప్పారు.

అనంతరం మళ్లీ మంత్రి యనమల రామకృష్ణుడు కల్పించుకుని, ప్రతిపక్షం నుంచి ఒక సభ్యుడు మాట్లాడిన తర్వాత ఇద్దరు అధికార పక్ష సభ్యులు మాట్లాడాల్సి ఉందని, అందువల్ల స్పీకర్ ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement