స్పీకర్‌పై అవిశ్వాసానికి వైఎస్సార్సీపీ నిర్ణయం | opposition ysrcp decided to move no confidence motion on speaker | Sakshi
Sakshi News home page

స్పీకర్‌పై అవిశ్వాసానికి వైఎస్సార్సీపీ నిర్ణయం

Published Mon, Mar 14 2016 11:31 PM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

స్పీకర్‌పై అవిశ్వాసానికి వైఎస్సార్సీపీ నిర్ణయం - Sakshi

స్పీకర్‌పై అవిశ్వాసానికి వైఎస్సార్సీపీ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసతీర్మానం పెడతామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత ఆయన బయటకు వెళుతూండగా లాబీల్లో విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయం తెలిపారు.

 

సభ జరిగిన తీరుపై వ్యాఖ్యానించమని కోరగా ‘చూశారుగా... ఇది కౌరవ సభలాగా సాగింది...’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ అర్థాంతరంగా వాయిదా పడిన తీరువాత పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియా పాయింట్ వద్ద  మాట్లాడుతూ.. స్పీకర్ సోమవారం సభలో వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ తీరులో మార్పు వస్తుందని తాము చాలా కాలంగా ఎదురు చూశామని అయితే ఆయన మరింత ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండటం తమకు బాధ కలిగిస్తోందన్నారు. అవిశ్వాసతీర్మానంపై తాము డివిజన్ కోరినా స్పీకర్ మాత్రం తిరస్కరించారని, మూజువాణీ ఓటుతో వీగిపోయినట్లు ప్రకటించారని ఆయన విమర్శించారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు స్పీకరుపై అవిశ్వాస తీర్మానం నోటీసివ్వనున్నట్లు స్పష్టంచేశారు.

వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికే ఇలా జరిగిందన్న శ్రీకాంత్ రెడ్డి.. ఒక్క నిమిషం జగన్ మాట్లాడితే చాలు వెంటనే ఐదారు మంది అధికారపక్షం వారికి అవకాశం ఇచ్చి 20 నుంచి 30 నిమిషాల వరకూ మాట్లాడిస్తున్నారన్నారని, అధికారపక్షం వారు చెయ్యెత్తకున్నా కూడా లేపి మాట్లాడిస్తున్నారన్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పై అవిశ్వాసతీర్మానం పెట్టక తప్పడం లేదని వివరించారు.

 

అన్నా హజారేకు సోదరుడనని డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు తనపై వస్తున్న ఆరోపణలకు సీబీఐ దర్యాప్తునకు ఎందుకు అంగీకరించడం లేదని గడికోట సూటిగా ప్రశ్నించారు. విచారణలకు ఆదేశిస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి చంద్రబాబు తప్పించుకుంటున్నారన్నారు. ధైర్యం ఉంటే చంద్రబాబు విచారణకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement