swachabharat
-
అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాలుగా గుర్తించాలి
స్వచ్ఛభారత్ ఏపీ అంబాసిడర్ గజల్ శ్రీనివాస్ పుట్టపర్తి టౌన్ : తిరుపతి, పుట్టపర్తికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని స్వచ్చభారత్ అంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ అన్నారు. పుట్టపర్తికి విచ్చేసిన ఆయన పట్టణంలోని పలు ఆలయాలతోపాటు, చిత్రావతి నది, చిత్రావతి హారతి ఘాట్, స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం స్థానిక సాయిఆరామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చిత్రావతి నదిపై బ్రిడ్జి నిర్మిస్తోందని, అనుబంధంగా సమీపంలోని చిత్రావతి నదిలో 40 అడుగుల సత్యసాయి విగ్రహం నిర్మించాలన్నారు. అందుకు ప్రభుత్వం నిధులు వెచ్చించలేక పోతే తాను విగ్రహం నిర్మించేందుకు నిధులు సమకూరుస్తానన్నారు. ఈనెల 25 నుంచి రెండు రోజుల పాటు ద్వారకా తిరుమలలో సేవ్ టెంపుల్స్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంగీత కళాకారుడు గిరిధర్, పట్టణ యువకులు ఊట్ల సోము, తిరుపతేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో స్వచ్ఛభారత్
– అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో దోమలపై దండయాత్ర – చీపురు పట్టి చెత్త ఊడ్చిన జేసీ కర్నూలు(అగ్రికల్చర్): దోమలపై దండయాత్రలో భాగంగా శనివారం కలెక్టరేట్లో స్వచ్ఛ కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయి. జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు జేసీ స్వచ్ఛ కార్యక్రమాలను పర్యవేక్షించడంతోపాటు స్వయంగా చీపురు పట్టి చెత్త ఊడ్చారు. కలెక్టరేట్లో ఎటుచూసినా చెత్త చెదారం పేరుకుపోయాయి. నిరంతరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ కర్నూలు అంటున్నా కలెక్టరేట్లో ఇప్పటి వరకు స్వచ్ఛత అనేదే లేకుండా పోయింది. దీనిని గుర్తించిన జేసీ అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో పెద్దఎత్తున స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టారు. కలñ క్టరేట్లోని అన్ని వైపులా కలియదిరిగి చెత్త చెదారాన్ని తొలగించారు. ఇక నుంచి ప్రతి శనివారం స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తామని జేసీ తెలిపారు. జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్లు రామాంజనమ్మ, ఈరన్న, ప్రియదర్శిని, భాగ్యలక్ష్మి, వ్యవసాయ శాఖాధికారులు మల్లికార్జునరావు, అనురాధరెడ్డి, శారద, గిరీష్, పణిశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ఇంటి మురుగు పొలాల్లోకి..
► ట్యాంకర్ల ద్వారా మురుగు తరలింపు ► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ఉండవల్లి (తాడేపల్లి రూరల్): ఒక వైపు స్వచ్ఛభారత్ అంటూ ఊదరగొడుతూనే రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి గ్రామాన్ని మాత్రం ముఖ్యమంత్రి మురికి కూపంలోకి నెడుతున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసం సమీపంలో పంట పొలాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సీఎం తన ఇంట్లో వాడిన నీటిని ట్యాంకర్లలో లోడు చేసి నేరుగా పచ్చని పంట పొలాల్లోకి వదులుతున్నారు. మురుగు నీరు కారణంగా ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోందని, పొలం పనులు చేయలేకపోతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మురుగు నీటితో పంటలు వేసుకోవడానికి ఇబ్బంది మారిందని చెబుతున్నారు. ప్రతి ఇంటిలో చెత్తా చెదారం, మురుగునీటిని అందుబాటులో ఉన్న సైడు డ్రెయిన్‌లోకి మళ్లించుకోవాలి. కానీ ముఖ్యమంత్రి నివాస గృహానికి కరకట్ట పక్కన ఎటువంటి సైడు డ్రెయిన్ లేకపోవడంతో మురుగు నీటిని ట్యాంకర్ల ద్వారా కరకట్టపై నుంచి పొలాల్లోకి వదులుతున్నారు. దీనిని స్వయంగా సీఆర్డీఏ అధికారులు పర్యవేక్షిస్తుండడం గమనార్హం. -
స్వచ్ఛభారత్‌లో అందరికీ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలల ప్రాజెక్టు అయిన 'స్వచ్ఛభారత్ మిషన్'లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 'స్వచ్ఛభారత్ కోశ్(నిధి)'లో ప్రజలు, సంస్థల విస్తృత భాగస్వామ్యానికి కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలు, వ్యక్తులు, విదేశీయులు కూడా స్వచ్ఛభారత్ కోశ్‌కు నిధులు అందించవచ్చు. ఈ నిధికి అందించే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థల నుంచి స్వచ్ఛభారత్ కోశ్‌కు భారీ ఎత్తున నిధులను కేంద్రం ఆశిస్తోంది. దీనికి వచ్చిన నిధుల్లో అత్యధిక భాగం మరుగుదొడ్ల నిర్మాణానికి వినియోగిస్తారు. వీటిలో బాలికల మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాడైపోయిన, పనిచేయని మరుగుదొడ్లను బాగుచేయటం, అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చిస్తారు. 2019నాటికి దేశం పరిశుభ్రంగా మారాలని ఆగస్టు 15, 2014న ప్రధాని ప్రకటించిన లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ నిధి ఏర్పాటు ఉద్దేశమని కేబినెట్ భేటీ తర్వాత కేంద్రమంత్రి ఒకరు అన్నారు. స్వచ్ఛభారత్ కోశ్ను నవంబర్లోనే కేంద్రం ఏర్పాటు చేసింది. 3పీ ఇండియా సంస్థ ఏర్పాటు వాయిదా! ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు(పీపీపీ)లను ప్రోత్సహించటానికి రూ. 500 కోట్లతో మంత్రి జైట్లీ 2014 జూలై బడ్జెట్లో ప్రతిపాదించిన ‘3పీ ఇండియా ఇన్స్టిట్యూషన్’ ఏర్పాటును కేబినెట్ వాయిదా వేసింది. జైట్లీ అమెరికాకు వెళ్లటం వల్ల కేబినెట్ భేటీకి రాలేకపోయారు. మౌలిక సదుపాయాల ఏర్పాటును ప్రోత్సహించటానికి ఉద్దేశించిన పీపీపీ ప్రాజెక్టులకు ఊతమిచ్చేందుకు 3పీని ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన అన్ని సమస్యలపై దృష్టి సారిస్తుందని జైట్లీ ప్రతిపాదించారు.