అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాలుగా గుర్తించాలి
- స్వచ్ఛభారత్ ఏపీ అంబాసిడర్ గజల్ శ్రీనివాస్
పుట్టపర్తి టౌన్ : తిరుపతి, పుట్టపర్తికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని స్వచ్చభారత్ అంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ అన్నారు. పుట్టపర్తికి విచ్చేసిన ఆయన పట్టణంలోని పలు ఆలయాలతోపాటు, చిత్రావతి నది, చిత్రావతి హారతి ఘాట్, స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం స్థానిక సాయిఆరామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చిత్రావతి నదిపై బ్రిడ్జి నిర్మిస్తోందని, అనుబంధంగా సమీపంలోని చిత్రావతి నదిలో 40 అడుగుల సత్యసాయి విగ్రహం నిర్మించాలన్నారు. అందుకు ప్రభుత్వం నిధులు వెచ్చించలేక పోతే తాను విగ్రహం నిర్మించేందుకు నిధులు సమకూరుస్తానన్నారు. ఈనెల 25 నుంచి రెండు రోజుల పాటు ద్వారకా తిరుమలలో సేవ్ టెంపుల్స్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంగీత కళాకారుడు గిరిధర్, పట్టణ యువకులు ఊట్ల సోము, తిరుపతేంద్ర తదితరులు పాల్గొన్నారు.