న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలల ప్రాజెక్టు అయిన 'స్వచ్ఛభారత్ మిషన్'లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 'స్వచ్ఛభారత్ కోశ్(నిధి)'లో ప్రజలు, సంస్థల విస్తృత భాగస్వామ్యానికి కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలు, వ్యక్తులు, విదేశీయులు కూడా స్వచ్ఛభారత్ కోశ్‌కు నిధులు అందించవచ్చు. ఈ నిధికి అందించే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థల నుంచి స్వచ్ఛభారత్ కోశ్‌కు భారీ ఎత్తున నిధులను కేంద్రం ఆశిస్తోంది.
దీనికి వచ్చిన నిధుల్లో అత్యధిక భాగం మరుగుదొడ్ల నిర్మాణానికి వినియోగిస్తారు. వీటిలో బాలికల మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాడైపోయిన, పనిచేయని మరుగుదొడ్లను బాగుచేయటం, అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చిస్తారు. 2019నాటికి దేశం పరిశుభ్రంగా మారాలని ఆగస్టు 15, 2014న ప్రధాని ప్రకటించిన లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ నిధి ఏర్పాటు ఉద్దేశమని కేబినెట్ భేటీ తర్వాత కేంద్రమంత్రి ఒకరు అన్నారు. స్వచ్ఛభారత్ కోశ్‌ను నవంబర్‌లోనే కేంద్రం ఏర్పాటు చేసింది.
3పీ ఇండియా సంస్థ ఏర్పాటు వాయిదా!
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు(పీపీపీ)లను ప్రోత్సహించటానికి రూ. 500 కోట్లతో మంత్రి జైట్లీ 2014 జూలై బడ్జెట్‌లో ప్రతిపాదించిన ‘3పీ ఇండియా ఇన్‌స్టిట్యూషన్’ ఏర్పాటును కేబినెట్ వాయిదా వేసింది. జైట్లీ అమెరికాకు వెళ్లటం వల్ల కేబినెట్ భేటీకి రాలేకపోయారు. మౌలిక సదుపాయాల ఏర్పాటును ప్రోత్సహించటానికి ఉద్దేశించిన పీపీపీ ప్రాజెక్టులకు ఊతమిచ్చేందుకు 3పీని ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన అన్ని సమస్యలపై దృష్టి సారిస్తుందని జైట్లీ ప్రతిపాదించారు.
స్వచ్ఛభారత్‌లో అందరికీ భాగస్వామ్యం
Published Thu, Mar 5 2015 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement
Advertisement