Swaraj Kaushal
-
ఇంతకన్నా ఏం కావాలి?
న్యూఢిల్లీ: విలక్షణ నటుడు నసీరుద్దీన్ షాపై సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నసీరుద్దీన్‌కు దేశం ఎంతో పేరుప్రతిష్టలు ఇచ్చినా దేశం పట్ల ఆయనకు కృతజ్ఞత లేదని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా మాట్లాడిన సీనియర్ నటుడు, బీజేపీ నేత అనుమప్ ఖేర్‌ను నసీరుద్దీన్ విమర్శించిన నేపథ్యంలో స్వరాజ్ కౌశల్ ట్విటర్లో స్పందించారు. ‘మిస్టర్ నసీరుద్దీన్ షా మీరు కృతజ్ఞత లేని వ్యక్తి. ఈ దేశం మీకు పేరు, ప్రతిష్టలతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఇప్పటికీ అజ్ఞానంలోనే ఉన్నారు. మీ మతం కాని మహిళను మీరు పెళ్లి చేసుకున్నా ఎవరూ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. మీ సోదరుడు భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ అయ్యారు. సమాన అవకాశాలకు ఇంతకన్నా ఏం కావాలి. అయినప్పటీకి మీకు సంతృప్తి లేదు. పక్షపాతం, వివక్షపూరితంగా మాట్లాడుతున్నారు. మనస్సాక్షి ఉంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. స్వదేశంలో నిరాశ్రయులుగా మారి పడ్డ కష్టాల గురించి అనుపమ్ మాట్లాడారు. దేశం ఎన్ని ఇచ్చినా మీరు మాత్రం దేశానికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు. హుందా కలిగిన వ్యక్తిగా అనుపమ్ స్పందించారు. మీ మాటలను బట్టి చూస్తే మీరు అల్పంగా కనిపిస్తున్నారు. నిరాశ నుంచి మీ కోపం వ్యక్తమవుతున్నట్టు కనబడుతోంద’ని స్వరాజ్ కౌశల్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. కాగా, ఏబీవీపీ దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థులను పరామర్శించిన హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రశంసించిన నసీరుద్దీన్ బుధవారం అనుపమ్ ఖేర్‌పై విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ సర్కారుకు బాకా ఊదుతున్నారని, ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. (చదవండి: ఆమె ధైర్యాన్ని ప్రశంసించిన నటుడు) -
సెల్యూట్‌తో కడసారి వీడ్కోలు పలికారు!!
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌కు యావత్ దేశం కన్నీటితో తుది వీడ్కోలు పలికింది. తీవ్ర గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి హఠన్మరణం చెందిన సంగతి తెలిసిందే. నిండైన భారతీయ రూపంతో, తన వాక్పటిమతో ప్రజలను ప్రేమగా హత్తుకొనే నాయకత్వ శైలితో ప్రజలకు ఎంతో చేరువన ఈ చిన్నమ్మకు కన్నీటి నివాళులర్పించేందుకు జనం పోటెత్తారు. ఉదయం ఆమె నివాసంలో, అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుష్మా భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలు అనేకమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు నివాళులర్పించారు. ఆమె భౌతికకాయాన్ని అంతిమయాత్రకు తరలించే ముందు.. ఆమె తనయురాలు బాన్సూరి స్వరాజ్, భర్త స్వరాజ్ కౌశల్ తుదిసారి సెల్యూట్ చెప్తూ.. కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర అనంతరం లోధీ రోడ్డులోని శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు జరిగాయి. ఆమె పార్థివ దేహానికి వద్ద భద్రతా బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కుమార్తె బాన్సూరీ స్వరాజ్ చేతుల మీదుగా ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించారు. -
‘ఎన్నికల్లో పోటీ చేయను.. ధన్యవాదాలు సుష్మ’
న్యూఢిల్లీ: చిన్నమ్మగా యావత్ దేశ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న సుష్మా స్వరాజ్ మరిక లేరు. గుండెపోటు రూపంలో మృత్యువు ఆమెను దేశ ప్రజలకు దూరం చేసింది. చెరగని చిరునవ్వుతో భారతీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సుష్మా స్వరాజ్. 25 ఏళ్ల వయస్సులోనే రాజకీయాల్లో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రపంచంలోనే శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచారు సుష్మా స్వరాజ్. అయితే తన ఎదుగుదలలో భర్త స్వరాజ్ కౌశల్ తోడ్పాటు మరువలేనిది అంటారు సుష్మా స్వరాజ్. ఆయన ప్రోత్సాహంతోనే తాను ఇంత ఎదిగానని చెప్తారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది. వీరిది ప్రేమ వివాహం. సనాతన హరియాణ కుటుంబానికి చెందిన సుష్మా స్వరాజ్ ఎన్నో అడ్డంకులను దాటుకుని.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వరాజ్ కౌశల్‌ని వివాహం చేసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన తొలినాళ్లలోనే 1975 జూలై 13న వీరి వివాహం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుపాలైన సోషలిస్టు నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదిస్తున్నప్పుడు సుష్మ, స్వరాజ్ కౌశల్ దగ్గరయ్యారు. 44 ఏళ్ల వివాహ బంధంలో స్వరాజ్ కౌశల్, ప్రతి విషయంలో సుష్మకు వెన్నుదన్నుగా ఉన్నారు. వీరికొక కుమార్తె. ఆమె కూడా లాయరే. ఈ ఏడాది సుష్మా స్వరాజ్ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల దేశ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. సుష్మా స్వరాజ్ భర్త మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఎన్నికల్లో పాల్గొనని నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు మేడం. మిల్కా సింగ్ కూడా ఓ ఏదో రోజు పరుగు ఆపాల్సిందే. 25 ఏళ్ల వయసులో.. 1977లో మీ పరుగు ప్రారంభమయ్యింది. 41 ఏళ్లుగా సాగుతూనే ఉంది. మీతో పాటు నేను కూడా పరిగెడుతున్నాను. నేనేం 19 ఏళ్ల యువకుడిని కాదు. ఇక నాకు పరిగెత్తే ఓపిక లేదు. మీరు మీ పరుగును ఆపుతూ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఇక కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాను’ అంటూ స్వరాజ్ కౌశల్ చమత్కరించారు. సుష్మా స్వరాజ్ కుటుంబ జీవితానికి, వృత్తి బాధ్యతలకు సమాన ప్రధాన్యం ఇచ్చారు. ఈ విషయం గురించి స్వరాజ్ కౌశల్ గతంలో ఓ సారి మాట్లాడుతూ.. ‘మా అమ్మ గారు 1993లో క్యాన్సర్‌తో మరణించారు. ఆ సమయంలో సుష్మ ఎంపీగా ఉన్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నా తల్లికి సేవ చేయడానికి సహయకురాలిని నియమించుకోమని సుష్మకు చాలా మంది సలహ ఇచ్చారు. కానీ ఆమె అంగీకరించలేదు. ఏడాది పాటు నా తల్లికి అన్ని సేవలు చేసింది. కుటుంబం పట్ల ఆమె ప్రేమ అలాంటిది. నా తండ్రికి నాకన్నా, సుష్మ అంటేనే అభిమానం. నా తండ్రి చివరి కోరిక మేరకు ఆయనకు సుష్మనే తలకొరివి పెట్టింద’ని తెలిపారు స్వరాజ్ కౌశల్. -
మోదీకి సుష్మా ప్రత్యామ్నాయమా?
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించడం పట్ల పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. యూరప్ లేదా అమెరికా పార్లమెంటేరియన్లు తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే వారు రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నారని అర్థం. కానీ భారత్‌లో అలా కాదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే అందులో ఓ పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్లు లెక్క. 2019లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పిన సుష్మా, తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. అంటే రాజ్యసభకు ఎన్నికవడం ద్వారా రాజకీయాల్లో కొనసాగుతారని అర్థం. పార్టీ కోరితే మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు. అంటే ఏమిటీ? అలర్జీ కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదంటూ ఆమె చెప్పడం సహేతుకంగా కనిపించడం లేదు. 2016లో ఆమెకు జరిగిన కిడ్నీ మార్పిడి కారణంగా అలర్జీ వచ్చి ఉండవచ్చు. అంతమాత్రాన ఎన్నికల్లో పోటీ చేయలేక పోవడం ఉండదు. అలర్జీ కారణమే నిజమనుకుంటే ఆమె ఢిల్లీలోనే ప్రకటించి ఉండాల్సింది! మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లి అక్కడ ప్రకటించడం ఏమిటీ? డిసెంబర్ 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి గనుక అప్పటి వరకు ఆగనూ వచ్చు, అలా ఎందుకు చేయలేదు? ఈ ప్రకటన వెనక కచ్చితమైన టైమింగ్ ఉందని ఆమె భర్త స్వరాజ్ కౌశల్ ట్వీట్ చేయడంలో అర్థం ఏమిటీ? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అప్రకటిత నియమం ప్రకారం 75 ఏళ్ల వరకు మంత్రి పదవిలో కొనసాగవచ్చు. ప్రస్తుతం సుష్మకు 66 సంవత్సరాలే. ఇంకా ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉంది. ఆమె నరేంద్ర మోదీ కేబినెట్లో పేరుకే విదేశాంగ మంత్రన్న విషయం తెల్సిందే. ప్రతి విదేశీ పర్యటనకు మోదీనే వెళుతున్నారు. కనీసం ఆమె వెంట కూడా తీసుకుపోవడం లేదు. ఈ విషయంలో ఆమె అసంతృప్తితో ఉన్నట్లు ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి సురక్షితంగా రప్పించడం కోసం ఆమె కృషి చేయడం ద్వారా ఆమె వార్తల్లో ఉంటున్నారు తప్ప, విదేశాల్లో పర్యటించడమో, విదేశాంగ విధానాల గురించి మాట్లాడడం ద్వారా ఉండడం లేదన్నది సుస్పష్టమే. మొదటి నుంచి ఆమెది బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ శిబిరమన్నది రాజకీయ వర్గాలకు తెల్సిందే. అందుకని మోదీ ఆమెను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారా? అదే నిజమనుకుంటే వచ్చే ఎన్నికల అనంతరం వేటు తప్పదని భావిస్తున్న రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీల సరసన ఆమె కూడా చేరిపోతారు. అది ఊహించే ఆమె కొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపారా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో వ్యూహ, ప్రతివ్యూహాలు మారవచ్చని, అప్పుడు వాటికి అనుగుణంగా పావులు కదపచ్చనే ఉద్దేశంతో అనుమానం రాకుండా ఎన్నికల ఫలితాలను ముందుగానే ఈ ప్రకటన చేశారా? 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభావం తగ్గి ఎన్డీయే పక్షాల బలం పెరిగినట్లయితే నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకురాలిగా ముందుకు రావాలన్నది ఆమె వ్యూహమా? మోదీ ఏకఛత్రాధిపత్యం పట్ల పార్టీ నాయకుల్లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. అలాంటి పరిస్థితుల్లో తెరమాటుకు వెళ్లిపోయిన అద్వానీ మళ్లీ తెర ముందుకు వస్తే.....? ప్రస్తుతానికి సమాధానాలకన్నా ప్రశ్నలపరంపరే ఎక్కువ! -
మీడియా కథనాలపై సుష్మాస్వరాజ్ భర్త ఆగ్రహం
న్యూఢిల్లీ: విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్యంపై వస్తున్న కథనాలపై ఆమె భర్త కౌశల్ స్వరాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఎన్నో వివరాలు ఇచ్చేశారు.. ఇక తర్వాత ఏముందీ.. సుష్మా వివరాలతో పాటు త్వరలో జరగనున్న కిడ్నీ ఆపరేషన్ కూడా లైవ్ టెలికాస్ట్ చేయించాలా అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గత నెలలో తనకు కిడ్నీ ఫెయిల్ అయిందని ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నానని కేంద్ర మంత్రి సుష్మా ట్వీట్ చేశారు. ఇక అప్పటినుంచీ అప్పటినుంచీ ఆమెకు ఆపరేషన్ ఎప్పుడు నిర్వహిస్తారు, అందుకు సంబంధించి కిడ్నీ దాత ఎవరవుతారని భిన్న కథనాలు వచ్చాయి. ఈ వారాంతంలో సుష్మాకు కిడ్నీ మార్పిడి చేయనున్నారు. 'తన భార్యకు కిడ్నీ ఇచ్చే దాతలు బంధువులు, రక్త సంబంధీకులు అయి ఉండరాదని.. ఆమెకు ఇతర వ్యక్తులు ఎవరైనా కిడ్నీ ఇవ్వొచ్చునని ప్రచారం జరిగింది. ప్రముఖులకు కూడా కాస్త వ్యక్తిగత జీవితం ఉంటుంది. కొన్ని విషయాలను మాత్రమే తెలపాలి. ప్రతి ఒక్క విషయాన్ని బయటకు వెల్లడించడం మంచిది కాదు' అని సుష్మాస్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ వరుస ట్వీట్లు చేశారు. తన భార్య డయాబెటిక్ పేషెంట్ కనుక డయాలిసిస్ కూడా చేయిస్తున్నట్లు కౌశల్ స్వరాజ్ తన ట్వీట్లలో పేర్కొన్నారు. -
సుష్మ భర్తకు డెరైక్టర్ పదవి!
-
సుష్మ భర్తకు డైరెక్టర్ పదవి!
సొంత కంపెనీలో స్వరాజ్ కౌశల్‌కు డైరెక్టర్ షిప్ ఆఫర్ చేసిన లలిత్ మోదీ సోనియా ద్వారా నా ఇష్యూస్‌ని వరుణ్ గాంధీ సెటిల్ చేస్తానన్నారు మోదీ సంచలన ట్వీట్; ఖండించిన బీజేపీ నేత వరుణ్ న్యూఢిల్లీ: ‘లలిత్‌గేట్’లో మరో మలుపు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుటుంబంతో ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకున్న సంబంధాలకు సంబంధించిన అంశమొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్ తండ్రి కేకే మోదీ చైర్మన్, ఎండీగా ఉన్న ఇండోఫిల్ ఇండస్ట్రీస్ సంస్థలో డైరెక్టర్ పదవి ఇస్తామని సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌కు లలిత్ ప్రతిపాదించారన్న వార్త తాజా వివాదాన్ని మరింత పెంచింది. ఆ వార్త నిజమేనని, అయితే, తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్వరాజ్ కౌశల్ వివరణ ఇచ్చారు. అలాగే, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పరిశీలనకు రాకముందే ఆ ప్రతిపాదనను లలిత్ వెనక్కి తీసుకున్నారని కేకే మోదీ వివరణ ఇచ్చారు. మోదీ, సుష్మ కుటుంబాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను ఇది వెల్లడి చేస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. పోర్చుగల్ వెళ్లేందుకు లలిత్‌కు బ్రిటన్ నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లు లభించేలా సుష్మ సహకరించిన కొన్ని నెలలకే ఆమె భర్త స్వరాజ్ కౌశల్‌కు డెరైక్టర్ పదవి ఆఫర్ చేశారని, ఇదంతా ఇద్దరికీ లబ్ధి చేకూరే డీల్‌లో భాగమేనని ఆరోపించింది. దీనిపై సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వాలని, ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికైన మౌనం వీడాలని డిమాండ్ చేసింది. విదేశాంగ మంత్రులుగా ఉండగా మాధవ్ సింగ్ సోలంకీ, నట్వర్ సింగ్‌లపై ఆరోపణలు వచ్చినప్పుడు.. తక్షణమే రాజీనామా చేయాలని వారిని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిన విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా గుర్తు చేశారు. యూకే హైకమిషనర్ జేమ్స్ బేవన్తో సుష్మా స్వరాజ్ లలిత్ మోదీ ట్రావెల్ డాక్యుమెంట్స్ గురించి చర్చించినప్పటి సమావేశం పూర్తి వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఎవరైనా కేంద్ర మంత్రి బంధువుకు లలిత్ మోదీ ఇటీవల ఉద్యోగం ఆఫర్ చేశారా?, ఒకవేళ అదే నిజమైతే, అది ఎలాంటి జాబ్?’ అనే విషయంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ శాశ్వత మౌన యోగాలో ఉన్నారని పార్టీ మరో అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఎద్దేవా చేశారు. ‘ఎంతమంది బీజేపీ నేతలకు, ముఖ్యమంత్రులకు లలిత్ మోదీతో స్నేహపూర్వక, మానవతావాద, కుటుంబ సంబంధాలున్నాయో ప్రధాని చెప్పాలి’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘సుష్మ, రాజేలను తొలగించండి’ పరారీలో ఉన్న నిందితుడు లలిత్ మోదీకి సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజేలను తక్షణమే పదవుల్లోనుంచి తొలగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. విద్యార్హతల విషయంలో పరస్పర విరుద్ధ విషయాలను వెల్లడించిన ఇరానీపై చర్యలు తీసుకోవాలంది. చండీగఢ్‌లో జరుగుతున్న పార్టీ జాతీయ మండలి సమావేశాల్లో ఆమోదించిన 4 తీర్మానాల్లో సుష్మ, రాజేల తొలగింపునకు సంబంధించిన తీర్మానమూ ఒకటి. రోజుకో కొత్త వార్త బయటపడుతున్న నేపథ్యంలో.. మొత్తం లలిత్ వ్యవహారంపై కోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆరు కోట్ల డాలర్లు అడిగారు..! ‘లలిత్‌గేట్’లోకి తాజాగా వరుణ్‌గాంధీని లలిత్ మోదీ లాగారు. కొన్నేళ్ల క్రితం వరుణ్ లండన్‌లోని తన ఇంటికి వచ్చి, సోనియాగాంధీ ద్వారా తన సమస్యలను పరిష్కరిస్తానని ప్రతిపాదించారంటూ లలిత్ బుధవారం వరుస ట్వీట్లు వదలడంతో కొత్త వివాదానికి తెర లేచింది. ఆ వార్తలు నిరాధారమని, ఆ మతిలేని ఆరోపణలకు స్పందించడం తన స్థాయికి తగనిదంటూ వరుణ్ తీవ్రంగా స్పందించారు. ‘వరుణ్ కొన్నేళ్ల క్రితం లండన్‌లోని మా ఇంటికొచ్చారు. కాంగ్రెస్‌తో, తన ఆంటీ(పెద్దమ్మ) సోనియాగాంధీతో నా వ్యవహారాలను సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. తన పెద్దమ్మ(సోనియా) సోదరిని కలవమని నాకు సూచించారు’ అని లలిత్ ట్వీట్ చేశారు. ‘ఆ తర్వాత ఆ ఇటలీ ఆంటీ 6 కోట్ల డాలర్లు(రూ. 381 కోట్లు) కావాలంటున్నారని మా కామన్ ఫ్రెండ్ నాకు చెప్పాడు. తర్వాత వరుణ్ నాకు ఫోన్ చేశారు. నేను కోపంగా ‘మీకు పిచ్చా? మీ పని మీరు చూసుకోండి’ అని చెప్పా. ఈ విషయాల్ని వరుణ్ ఖండించగలరా?’ అంటూ మరో ట్వీట్లో ఆరోపించారు. ‘మీ ఆంటీ(సోనియా గాంధీ) ఏం అడిగారో దయచేసి ప్రపంచానికి చెప్పండి. ప్రఖ్యాత జ్యోతిష్యుడైన, మనిద్దరికీ బాగా స్నేహితుడైన వ్యక్తే దీనంతటికి సాక్ష్యం. నిజం చెప్పండి. కొన్నేళ్ల క్రితం లండన్‌లోని రిట్జ్ హోటల్లో మీరున్నప్పుడు ఓసారి మా ఇంటికొచ్చారా, లేదా?’ అని వరుణ్‌ను ఉద్దేశించి మరో ట్వీట్ వదిలారు. ఈ ఆరోపణలను వరుణ్‌తో పాటు బీజేపీ కూడా ఖండించింది. ‘సోనియా, వరుణ్ వేర్వేరు పార్టీల వారు. వారిద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలుసు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. లలిత్ ఆరోపణలపై సోనియా గాంధీ జవాబివ్వాలని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు.