మీడియా కథనాలపై సుష్మాస్వరాజ్ భర్త ఆగ్రహం
న్యూఢిల్లీ: విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్యంపై వస్తున్న కథనాలపై ఆమె భర్త కౌశల్ స్వరాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఎన్నో వివరాలు ఇచ్చేశారు.. ఇక తర్వాత ఏముందీ.. సుష్మా వివరాలతో పాటు త్వరలో జరగనున్న కిడ్నీ ఆపరేషన్ కూడా లైవ్ టెలికాస్ట్ చేయించాలా అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గత నెలలో తనకు కిడ్నీ ఫెయిల్ అయిందని ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నానని కేంద్ర మంత్రి సుష్మా ట్వీట్ చేశారు. ఇక అప్పటినుంచీ అప్పటినుంచీ ఆమెకు ఆపరేషన్ ఎప్పుడు నిర్వహిస్తారు, అందుకు సంబంధించి కిడ్నీ దాత ఎవరవుతారని భిన్న కథనాలు వచ్చాయి. ఈ వారాంతంలో సుష్మాకు కిడ్నీ మార్పిడి చేయనున్నారు.
'తన భార్యకు కిడ్నీ ఇచ్చే దాతలు బంధువులు, రక్త సంబంధీకులు అయి ఉండరాదని.. ఆమెకు ఇతర వ్యక్తులు ఎవరైనా కిడ్నీ ఇవ్వొచ్చునని ప్రచారం జరిగింది. ప్రముఖులకు కూడా కాస్త వ్యక్తిగత జీవితం ఉంటుంది. కొన్ని విషయాలను మాత్రమే తెలపాలి. ప్రతి ఒక్క విషయాన్ని బయటకు వెల్లడించడం మంచిది కాదు' అని సుష్మాస్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ వరుస ట్వీట్లు చేశారు. తన భార్య డయాబెటిక్ పేషెంట్ కనుక డయాలిసిస్ కూడా చేయిస్తున్నట్లు కౌశల్ స్వరాజ్ తన ట్వీట్లలో పేర్కొన్నారు.