తిరువనంతపురం: చెరగని చిరునవ్వుకు, నిండైన భారతీయతకు నిలువెత్తు నిదర్శనం సుష్మా స్వరాజ్. దేశ ప్రజలందరిని తన బిడ్డలుగా ప్రేమించగలిగిని అతి కొద్ది మందిలో సుష్మా స్వరాజ్ ఒకరు. ప్రపంచ నలుమూలల ఉన్న భారతీయులు ఎవరూ సాయం కోరినా తక్షణమే స్పందించేవారు సుష్మా స్వరాజ్. ప్రాంతాలకు, పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్న సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం చిన్నమ్మ జ్ఞాపకాల్లో తరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుష్మకు సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది.
వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా హెచ్‌ఐవీ రోగులంటే చిన్న చూపు ఇంకా పోలేదు. నేటికి ఆ వ్యాధి పట్ల ఎన్నో అపోహలు. 2020లోనే ఇలా ఉంటే.. 2003 కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్‌ఐవీ వ్యాధి బారిన పడిన ఇద్దరు చిన్నారులను దగ్గరకు తీసుకుని.. స్పర్శ, కౌగిలించుకోవడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించదని సమాజానికి ఓ సందేశం ఇచ్చారు సుష్మా స్వరాజ్. ట్విటర్ యూజర్ పియు నాయర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
‘తల్లిదండ్రుల కారణంగా ఈ చిన్నారులకు ఎయిడ్స్ వ్యాధి సోకింది. దాంతో వీరు చదువుతున్న పాఠశాల యాజమాన్యం.. ఈ చిన్నారులను స్కూల్ నుంచి తొలగించింది. ఇతర ఏ స్కూల్‌లో కూడా వీరిని చేర్చుకో లేదు. దాంతో చిన్నారుల తాత ఈ విషయాన్ని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన కలాం వారు చదువుకోవడానికి మార్గం చూపడమే కాక ఈ పిల్లల కోసం ఓ ప్రత్యేక ట్యూటర్‌ని కూడా ఏర్పాటు చేశారు. వీరి గురించి తెలిసిన సుష్మా స్వరాజ్ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా చిన్నారులను కలుసుకుని ప్రేమగా దగ్గరకు తీకున్నారు. స్పర్శ, కౌగిలించుకోవడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి చెందదని తెలిపారు’ అంటూ నాయర్ ఈ ఫోటోని ట్వీట్ చేశాడు.
నేడు సుష్మా స్వరాజ్ చనిపోయారనే వార్త తెలిసి ఈ పిల్లల తాత తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ‘ఆ రోజు సుష్మాజీ నా మనవల పట్ల చూపిన ప్రేమ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఈ పిల్లల చదువకు అవసరమైన సాయం అందేలా సుష్మాజీ ఏర్పాట్లు చేశారు. ఆమె చేసిన మేలును జీవితాంతం మరవలేం’ అన్నారు. ఈ ఇద్దరు పిల్లల్లో ఒకరు 2010లో మృతి చెందగా.. మరొకరికిప్పుడు 23 ఏళ్లు.
Comments
Please login to add a commentAdd a comment