సుష్మ భర్తకు డైరెక్టర్ పదవి! | 'Lalit offered Swaraj Kaushal job on Indofil Board' | Sakshi
Sakshi News home page

సుష్మ భర్తకు డైరెక్టర్ పదవి!

Published Thu, Jul 2 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

సుష్మ భర్తకు  డైరెక్టర్ పదవి!

సుష్మ భర్తకు డైరెక్టర్ పదవి!

సొంత కంపెనీలో స్వరాజ్ కౌశల్‌కు
 డైరెక్టర్ షిప్ ఆఫర్ చేసిన లలిత్ మోదీ
 సోనియా ద్వారా నా ఇష్యూస్‌ని వరుణ్ గాంధీ సెటిల్ చేస్తానన్నారు
 మోదీ సంచలన ట్వీట్; ఖండించిన బీజేపీ నేత వరుణ్
 
 న్యూఢిల్లీ: ‘లలిత్‌గేట్’లో మరో మలుపు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుటుంబంతో ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకున్న సంబంధాలకు సంబంధించిన అంశమొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్ తండ్రి కేకే మోదీ చైర్మన్, ఎండీగా ఉన్న ఇండోఫిల్ ఇండస్ట్రీస్ సంస్థలో డైరెక్టర్ పదవి ఇస్తామని సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌కు లలిత్ ప్రతిపాదించారన్న వార్త తాజా వివాదాన్ని మరింత పెంచింది. ఆ వార్త నిజమేనని, అయితే, తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్వరాజ్ కౌశల్ వివరణ ఇచ్చారు.
 
  అలాగే, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పరిశీలనకు రాకముందే ఆ ప్రతిపాదనను లలిత్ వెనక్కి తీసుకున్నారని కేకే మోదీ వివరణ ఇచ్చారు. మోదీ, సుష్మ కుటుంబాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను ఇది వెల్లడి చేస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. పోర్చుగల్ వెళ్లేందుకు లలిత్‌కు బ్రిటన్ నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లు లభించేలా సుష్మ సహకరించిన కొన్ని నెలలకే ఆమె భర్త స్వరాజ్ కౌశల్‌కు డెరైక్టర్ పదవి ఆఫర్ చేశారని, ఇదంతా ఇద్దరికీ లబ్ధి చేకూరే డీల్‌లో భాగమేనని ఆరోపించింది. దీనిపై సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వాలని, ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికైన మౌనం వీడాలని డిమాండ్ చేసింది.
 
విదేశాంగ మంత్రులుగా ఉండగా మాధవ్ సింగ్ సోలంకీ, నట్వర్ సింగ్‌లపై ఆరోపణలు వచ్చినప్పుడు.. తక్షణమే రాజీనామా చేయాలని వారిని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిన విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా గుర్తు చేశారు. యూకే హైకమిషనర్ జేమ్స్ బేవన్‌తో సుష్మా స్వరాజ్ లలిత్ మోదీ ట్రావెల్ డాక్యుమెంట్స్ గురించి చర్చించినప్పటి సమావేశం పూర్తి వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఎవరైనా కేంద్ర మంత్రి బంధువుకు లలిత్ మోదీ ఇటీవల ఉద్యోగం ఆఫర్ చేశారా?, ఒకవేళ అదే నిజమైతే, అది ఎలాంటి జాబ్?’ అనే విషయంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ శాశ్వత మౌన యోగాలో ఉన్నారని పార్టీ మరో అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఎద్దేవా చేశారు. ‘ఎంతమంది బీజేపీ నేతలకు, ముఖ్యమంత్రులకు లలిత్ మోదీతో స్నేహపూర్వక, మానవతావాద, కుటుంబ సంబంధాలున్నాయో ప్రధాని చెప్పాలి’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
 
 ‘సుష్మ, రాజేలను తొలగించండి’
 పరారీలో ఉన్న నిందితుడు లలిత్ మోదీకి సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న  కేంద్ర మంత్రి సుష్మ,  రాజస్తాన్ సీఎం వసుంధర రాజేలను తక్షణమే పదవుల్లోనుంచి తొలగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. విద్యార్హతల విషయంలో పరస్పర విరుద్ధ విషయాలను వెల్లడించిన ఇరానీపై చర్యలు తీసుకోవాలంది. చండీగఢ్‌లో జరుగుతున్న పార్టీ జాతీయ మండలి సమావేశాల్లో ఆమోదించిన 4 తీర్మానాల్లో సుష్మ, రాజేల తొలగింపునకు సంబంధించిన తీర్మానమూ ఒకటి. రోజుకో కొత్త వార్త బయటపడుతున్న నేపథ్యంలో.. మొత్తం లలిత్  వ్యవహారంపై కోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది.
 
 ఆరు కోట్ల డాలర్లు అడిగారు..!
 ‘లలిత్‌గేట్’లోకి తాజాగా వరుణ్‌గాంధీని లలిత్ మోదీ లాగారు. కొన్నేళ్ల క్రితం వరుణ్ లండన్‌లోని తన ఇంటికి వచ్చి, సోనియాగాంధీ ద్వారా తన సమస్యలను పరిష్కరిస్తానని ప్రతిపాదించారంటూ లలిత్ బుధవారం వరుస ట్వీట్లు వదలడంతో కొత్త వివాదానికి తెర లేచింది. ఆ వార్తలు నిరాధారమని, ఆ మతిలేని ఆరోపణలకు స్పందించడం తన స్థాయికి తగనిదంటూ వరుణ్ తీవ్రంగా స్పందించారు. ‘వరుణ్ కొన్నేళ్ల క్రితం లండన్‌లోని మా ఇంటికొచ్చారు.  కాంగ్రెస్‌తో, తన ఆంటీ(పెద్దమ్మ) సోనియాగాంధీతో నా వ్యవహారాలను సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. తన పెద్దమ్మ(సోనియా) సోదరిని కలవమని నాకు సూచించారు’ అని లలిత్ ట్వీట్ చేశారు. ‘ఆ తర్వాత ఆ ఇటలీ ఆంటీ 6 కోట్ల డాలర్లు(రూ. 381 కోట్లు) కావాలంటున్నారని మా కామన్ ఫ్రెండ్ నాకు చెప్పాడు. తర్వాత వరుణ్ నాకు ఫోన్ చేశారు. నేను కోపంగా ‘మీకు పిచ్చా? మీ పని మీరు చూసుకోండి’ అని చెప్పా.
 
ఈ విషయాల్ని వరుణ్ ఖండించగలరా?’ అంటూ మరో ట్వీట్లో ఆరోపించారు. ‘మీ ఆంటీ(సోనియా గాంధీ) ఏం అడిగారో దయచేసి ప్రపంచానికి చెప్పండి. ప్రఖ్యాత జ్యోతిష్యుడైన, మనిద్దరికీ బాగా స్నేహితుడైన వ్యక్తే దీనంతటికి సాక్ష్యం. నిజం చెప్పండి. కొన్నేళ్ల క్రితం లండన్‌లోని రిట్జ్ హోటల్‌లో మీరున్నప్పుడు ఓసారి మా ఇంటికొచ్చారా, లేదా?’ అని వరుణ్‌ను ఉద్దేశించి మరో ట్వీట్ వదిలారు. ఈ ఆరోపణలను వరుణ్‌తో పాటు బీజేపీ కూడా ఖండించింది. ‘సోనియా, వరుణ్ వేర్వేరు పార్టీల వారు. వారిద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలుసు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. లలిత్ ఆరోపణలపై సోనియా గాంధీ జవాబివ్వాలని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement