ఏఎఫ్ఆర్సీ చైర్మన్‌గా స్వరూప్‌రెడ్డి
ఏడుగురు సభ్యులను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ప్రవేశాల క్రమబద్ధీకరణ, ఫీజుల నియంత్రణ నిమిత్తం ‘అడ్మిషన్స్ అండ్ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ’ (ఏఎఫ్ఆర్సీ)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎఫ్ఆర్సీ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి పి.స్వరూప్‌రెడ్డి, కమిటీ సభ్యులుగా జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య, గాంధీ బోధనాస్పత్రి ప్రొఫెసర్ పీవీ చలం, చార్టెడ్ అకౌంటెంట్ జీవీ లక్ష్మణ్‌రావు, అడ్వొకేట్ కె.రవీందర్‌రెడ్డిలను ప్రభుత్వం నియమించింది.
వీరితో పాటు ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి జేఎన్టీయూహెచ్, మెడికల్ కోర్సులకు సంబంధించి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, బీఈడీ కోర్సులకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లను ఏఎఫ్ఆర్సీ కమిటీలో సభ్యులుగా తీసుకోవాలని సర్కారు సూచించింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆర్థిక శాఖ నుంచి ఒక అధికారిని ఏఎఫ్ఆర్సీలో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.