‘స్వచ్ఛ భారత్’లో ఏపీ ముందుంది
‘స్వచ్ఛ భారత్ సమ్మేళనం’లో సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ భారత్’లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్ని బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చగలిగినట్టు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ‘స్వచ్ఛభారత్ సమ్మేళనం’లో పాల్గొన్న అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను చాలా తక్కువ సమయంలో బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చగలిగామని, త్వరలోనే గ్రామాల్లోనూ సాధిస్తామని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చిన రాష్ట్రాలు ఏపీ, గుజరాత్ మాత్రమేనన్నారు. స్వచ్ఛ భారత్‌లో మొట్టమొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా సెంట్రలైజ్డ్ ఏసీ నుంచి పెద్ద శబ్దం రావడంతో సీఎం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే భద్రతాధికారులు ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. సెంట్రలైజ్డ్ ఏసీ గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో శబ్దం వచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
సంస్కరణ ప్రోత్సాహకాలు..
ఇదిలా ఉండగా అమృత్ పథకం కింద పట్టణ సంస్కరణలను ప్రోత్సహిస్తున్న 20 రాష్ట్రాలకు 2015-16 సంవత్సరానికిగాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రోత్సాహకాలు అందించారు. అందులో భాగంగా ఏపీకి రూ.13.62 కోట్లు, తెలంగాణకు రూ.10.73 కోట్లు లభించాయి.
వాజ్‌పేయికి నేనే చెప్పా
సాక్షి, అమరావతి: గతంలో బ్యాండ్ విడ్త్ (నిర్దిష్ట సమయంలో డేటా బదిలీ రేటు) వేగం సమస్య దేశంలో తీవ్రంగా ఉండేదని దాని గురించి అప్పటి ప్రధాని వాజ్‌పేయికి తానే చెప్పానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దీంతో ఆయన జశ్వంత్‌సింగ్ అధ్యక్షునిగా, తనను ఉపాధ్యక్షుడుగా నియమించి ఒక కమిటీ వేశారని చెప్పారు. ఆ తర్వాతే టెలికమ్ కంపెనీలకు సంబంధించిన డి-రెగ్యులరైజేషన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఒక హోటల్లో ఇండియా టుడే, హెచ్‌పీ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించిన డిజిటల్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడారు.
వారం రోజుల్లో 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతోపాటు కేబుల్ ద్వారా అన్ లిమిటెడ్ ఛానల్స్, మూడు ఫోన్లను కేవలం రూ.149కే ఇస్తుండడం దేశంలోనే ప్రథమం అని అన్నారు. ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల నుంచి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ సమన్వయకర్తగా డిజిటల్ టెక్నాలజీ వినియోగంపై చర్చా వేదిక నిర్వహించారు.