swati mutyam
-
ఇయర్ రౌండప్ 2022: హిట్ బొమ్మలివే...
దాదాపు 275 (స్ట్రెయిట్, డబ్బింగ్) చిత్రాలు... 20 శాతం హిట్స్‌తో 2022 ముగియనుంది. గత ఏడాది కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. ఈ ఏడాది థియేటర్స్‌కి లాక్ పడలేదు. అయితే కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనే సందేహం నడుమ సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ప్రేక్షకులు సినిమా పట్ల తమకు ఉన్న ప్రేమను నిరూపించుకున్నారు. కానీ విజయాల శాతం మాత్రం ఇరవైకి అటూ ఇటూగానే ఉంది. కాగా స్ట్రెయిట్ చిత్రాలే కాదు.. అనువాద చిత్రాలూ మంచి వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 2022 ‘హిట్ బొమ్మ’ (చిత్రాలు)లను చూద్దాం. బంగార్రాజుల సందడి వాసివాడి తస్సాదియ్యా... అంటూ సంక్రాంతికి పెద్ద బంగార్రాజు (నాగార్జున), చిన్న బంగార్రాజు (నాగచైతన్య) జనవరి 14న ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చారు. కల్యాణŠ కృష్ణ దర్శకత్వంలో దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ నెల దాదాపు 17 చిత్రాలు వచ్చాయి. టిల్లుగాడు.. దంచి కొట్టాడు ఫిబ్రవరిలో ఇరవై చిత్రాలు విడుదలైతే విజయం శాతం రెండు అనే చెప్పాలి. దాదాపు రూ. 5 కోట్లతో రూపొంది, 30 కోట్ల వరకూ వసూళ్లను దంచి కొట్టాడు ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్‌కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇదే నిర్మాత దాదాపు రూ. 80 కోట్లతో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ Mð.. చంద్ర దర్శకత్వంలో నిర్మించిన ‘భీమ్లా నాయక్’ 150 కోట్లకు పైగా రాబట్టింది. ఇంకా రవితేజ ‘కిలాడి’, మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’తో పాటు మరికొన్ని చిత్రాలొచ్చాయి. ఆర్ఆర్ఆర్... రికార్డ్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న వచ్చింది. దాదాపు రూ. 550 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సుమారు 1150 కోట్ల వసూళ్ల రికార్డుని సాధించింది. ఇదే నెలలో ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’తో పాటు మరో పది చిత్రాల వరకూ రిలీజయ్యాయి. నిరాశతో ఆరంభమైన వేసవి ఏప్రిల్‌లో దాదాపు 15 సినిమాలు విడుదలైతే ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రాలు పెద్దగా లేవు. అలా వేసవి నిరాశతో ఆరంభమైంది. వరుణ్ తేజ్ ‘గని’, తండ్రీకొడుకులు చిరంజీవి– రామ్‌చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. సర్కారుకీ.. ఫన్‌కీ విజయం మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారువారి పాట’ మే 12న విడుదలైంది. దాదాపు రూ. 60 కోట్లతో మహేశ్‌బాబు, అనిల్ సుంకర, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సుమారు 200 కోట్లు వసూ లు చేసింది. ఇక వినోద ప్రధానంగా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ‘ఎఫ్ 3’ మే 27న రిలీజైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దాదాపు రూ. 70 కోట్లతో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా సుమారు 130 కోట్లు రాబట్టింది. మేలో మరో 7 చిత్రాలు రిలీజయ్యాయి. ‘మేజర్’ హిట్‌తో.. ఒక్క ‘మేజర్’ హిట్‌తో జూన్ సరిపెట్టుకుంది. హీరో అడివి శేష్ టైటిల్ రోల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో మహేశ్‌బాబు ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొంది, 65 కోట్ల వసూళ్లు రాబట్టింది. జూన్‌లో దాదాపు 20 చిత్రాలు రిలీజయ్యాయి. హిట్ లేని నెల జూలైలో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, రామ్ ‘వారియర్’, రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’... ఇలా దాదాపు 20 సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు హిట్ చేసిన సినిమాలు ఏవీ లేకుండా పోయాయి. . అదిరింది ఆగస్ట్ ఆగస్టులో వచ్చిన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ బంపర్హిట్స్గా నిలిచాయి. కల్యాణ్‌రామ్ హీరోగా నటించగా, ‘బింబిసార’తో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నందమూరి కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం 70 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొందిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘సీతారామం’ 100 కోట్ల వసూళ్లకు చేరువలో నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘కార్తికేయ 2’ 120 కోట్లు రాబట్టింది. ఒక్క హిందీ భాషలోనే ఈ చిత్రం సుమారు 50 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఇదే నెలలో విడుదలైన నితిన్ ‘మాచర్ల నియోజకగర్గం’, విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రాల వసూళ్లు తడబడ్డాయి. ఒకే ఒక్క విజయం... ఇక సెప్టెంబరులో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో దాదాపు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో ఎస్ఆర్. ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇంకా ఈ నెలలో దాదాపు పాతిక చిత్రాలు రిలీజయ్యాయి. స్వాతిముత్యానికి విజయం అక్టోబర్ నెలలో వచ్చిన ‘స్వాతిముత్యం’ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ. 8 కోట్లతో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బెల్లంకొండ గణేష్ హీరోగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అక్టోబరు 5న విడుదలైంది. ఇదే నెలలో రిలీజైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫర్వాలేదనిపించింది. నాగార్జున ‘ది ఘోస్ట్’ కూడా ఇదే నెల వచ్చింది. ఇదే నెల 21న విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’, విశ్వక్సేన్ ‘ఓరి..దేవుడా..’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ లెక్కల్లో తడబడ్డాయి. చిన్న సినిమాకి పెద్ద విజయం సమంత టైటిల్ రోల్ చేసిన ‘యశోద’ నవంబరు 11న విడుదలైంది. హరి–హరీష్ దర్శకత్వంలో దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 35 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక చిన్న సినిమా ‘మసూద’ రూ. 10 కోట్ల బడ్జెట్లోపు రూపొంది, 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంగీత, తిరువీర్ ముఖ్య తారలుగా సాయికిరణ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబరులో విడుదలైన దాదాపు 20 సినిమాల్లో అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో..’, అల్లరి నరేశ్ చేసిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీ కం’లకు ప్రేక్షకులు పాస్ మార్కులు వేశారు. ‘హిట్’కి హిట్ జూన్‌లో ‘మేజర్’ హిట్ అందుకున్న అడివి శేష్‌కు డిసెంబరులో ‘హిట్ 2’ రూపంలో మరో హిట్ లభించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో దాదాపు రూ. 12 కోట్లతో నాని నిర్మించిన ఈ చిత్రం 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘ఖిలాడి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ ఈ నెల 23న విడుదలైంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే ‘కార్తికేయ 2’తో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ డిసెంబరు 23నే విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం వసూళ్ల లెక్క రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇంకా నెలాఖరున ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అనువాదం అదిరింది ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాల జోరు కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఆ చిత్రాల విశేషాల్లోకి వెళితే... వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ముఖ్య తారలుగా సుమారు రూ. 20 కోట్లతో రూపొందిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ అన్ని భాషల్లో దాదాపు 350 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిందని టాక్. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కేజీఎఫ్ 2’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 కోట్లు సాధించిందని టాక్. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సీనియర్ నటుడు కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ సుమారు 100 కోట్లతో రూపొంది, దాదాపు 450 కోట్లు వసూలు చేసిందని భోగట్టా. అలాగే కె. కిరణ్ రాజ్ దర్శకత్వంలో రూ. 20 కోట్లతో రూపొంది, 100 కోట్లకుౖ పెగా వసూళ్లు సాధించింది ‘777 చార్లి’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ రూ. 16 కోట్లతో రూపొంది, 450 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇవన్నీ ప్రపంచవ్యాప్త లెక్కలు కాగా తెలుగులో లాభాలిచ్చిన చిత్రాలుగా నిలిచాయి. (వసూళ్ల వివరాలన్నీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం) -
అది నిర్మాతల నిర్ణయం.. కాస్త భయంగా ఉంది: ‘స్వాతిముత్యం’డైరెక్టర్
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘స్వాతిముత్యం’. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో లక్ష్మణ్ చెప్పిన విశేషాలు. ► సినిమాలంటే ఆసక్తితో ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే ఇండస్ట్రీకి వచ్చేశాను. ‘లాస్ట్ విష్’, ‘కృష్ణమూర్తిగారింట్లో..’ అనే షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ‘కృష్ణమూర్తిగారింట్లో..’కి మంచి ఆదరణ లభించింది. దీంతో ఓ సినిమా అవకాశం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ నెక్ట్స్ నేను ‘సదా నీ ప్రేమలో..’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. ఆ తర్వాత ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేయాలనుకుని ‘స్వాతిముత్యం’ కథ రాశాను. ► ‘స్వాతిముత్యం’లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలమురళీ కృష్ణగా బెల్లంకొండ గణేష్ నటించారు. బాలమురళీ కృష్ణ ప్రభుత్వోద్యోగం సంపాదిస్తాడు. ఆ తర్వాత కుటుంబసభ్యులు అతనికి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నదే కథ. మా చుట్టుపక్కల గ్రామాల్లోని ఘటనలను కూడా పొందుపరిచాను. ► ఈ సినిమాకు ‘స్వాతిముత్యం’ టైటిల్‌ను నిర్మాత చినబాబుగారు సూచించారు. ఎక్కువగా అమాయక పాత్రలు ఉన్నాయి కాబట్టి ఈ టైటిల్ అయితే బాగుంటుందని భావించారాయన. ► చిరంజీవిగారికి నేను వీరాభిమానిని. ఆయన ‘గాడ్ ఫాదర్’ విడుదలవుతున్న రోజునే నా దర్శకత్వంలోని సినిమా రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. చిరంజీవి, నాగార్జున గార్లు వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సమయంలో మా సినిమాను రిలీజ్ చేయడం అనేది నిర్మాతల నిర్ణయం. కానీ నాకు కాస్త భయంగానే ఉంది. మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో.. ఫెస్టివల్‌కు రిలీజ్ అయితే బాగుంటుందని మేం భావించాం. -
డుం డుం డుం.. మోగింది మేళం.. ఆకట్టుకుంటున్న పెళ్లి పాట
గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగాప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వెడ్డింగ్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘డుం డుం డుం డుం డుం మోగింది మేళం’ ....అంటూ మొదలయ్యే ఈ పాటకి సాహిత్యాన్ని కె కె అందించగా, మహతి స్వర సాగర్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చాడు. దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ..‘చిత్ర కథాంశం ప్రకారం నాయక, నాయికల పెళ్లి గీతం ఇది. వీరి నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకూ జరిగే వివిధ వ్యవహారాలు,సందర్భాలు, సన్నివేశాల సమాహారం ఈ పాట. పట్టణం నేపథ్యంలో చిత్రీకరించిన దీనిని రచయిత కె కె ఎంతో చక్కగా రచించారు. ప్రేక్షకుడు కూడా సహజంగా అనుభూతి చెందేలా చిత్రీకరించడం జరిగింది’ అన్నారు. దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు "స్వాతిముత్యం" ను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. -
కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ఆత్మీయ సత్కారం..
K Viswanath Honoured For Swati Mutyam Movie Completing 36 Years: కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ‘స్వాతిముత్యం’ విడుదలై నేటికి (ఆదివారం) 36 ఏళ్లు. కమల్‌హాసన్, రాధిక, సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు ముఖ్య తారలుగా ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో అమాయకుడు శివయ్య పాత్రలో కమల్, లలిత పాత్రలో రాధిక కనబర్చిన అభినయాన్ని అంత సులువుగా మరచిపోలేం. ఈ చిత్రానికి తోటపల్లి సాయినాథ్ అందించిన మాటలు, ఇళయరాజా సంగీతం, ఆత్రేయ, సినారె, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిల సాహిత్యం అదనపు ఆకర్షణలు. అంతేకాకుండా ‘స్వాతిముత్యం’ ఆస్కార్ ఎంట్రీ సైతం దక్కించుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాలకు నంది అవార్డులు వచ్చాయి. ఈ చిత్రానికి 36 ఏళ్లవుతున్న సందర్భంగా కె. విశ్వనాథ్ నివాసంలో శుభోదయం మీడియా శనివారం ఆత్మీయ వేడుకను నిర్వహించి, ఆయన్ను సత్కరించింది. తోటపల్లి సాయినాథ్, శుభోదయం గ్రూప్ అధినేత కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్, నృత్యకళాకారిణి స్వర్ణ శ్రీ పాల్గొన్నారు. -
'స్వాతిముత్యం'లో అమ్మ పోయిన సీన్ చూస్తే కన్నీళ్లాగవు
‘అది మా పుట్టింటివాళ్లు ఇచ్చిన మరచెంబురా, బుజ్జిముండకి ఎన్ని సొట్టలు పడ్డాయో ఏంటో... అంటూ మనింటి బామ్మగా తెలుగువారికి చేరువయ్యారు. వేసేయండ్రా తలుపులు అంటూ... రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్‌గా విలనిజమూ చేశారు.. తల్లి లేని పిల్లలకు బామ్మగా నటిస్తూ, మనవలకు చేరికయ్యారు... సినిమాలలో ఎంత సింపుల్‌గా ఉంటారో, నిజ జీవితంలోనూ అంతే సింపుల్‌గా ఉంటుంది అమ్మ అంటున్నారు జి. నిర్మలమ్మ (రాజమణి) ఏకైక కుమార్తె కవిత. 1927, నవంబరు నెల, దీపావళి వెళ్లిన ఏడో రోజున అంటే సప్తమి తిథి నాడు తొమ్మిదో సంతానంగా బందరులో పుట్టింది అమ్మ. తాతయ్య కోటయ్య, అమ్మమ్మ గంగమ్మ. అమ్మను వాళ్ల పెద్దక్కయ్యే పెంచి పెద్ద చేశారు. అమ్మ మూడో తరగతి వరకే చదువుకుంది. చిన్నప్పటి నుంచి ఆటపాటలలో చాలా చలాకీగా ఉండేదట. అమ్మకి డాన్స్, నాటకాలంటే ప్రాణమని చెప్పేది. వేదాంతం రాఘవయ్య గారితో కలిసి డాన్స్ చేసిందట అమ్మ. అమ్మకి ఏడు సంవత్సరాల వయసులో ‘మార్కండేయ’ సినిమాలో, చిత్రపురి నారాయణమూర్తి గారి ద్వారా నాటకాలలో నటించడానికి అవకాశం వచ్చింది. నాటకాలలో నటిస్తూ, మంచి నటన నేర్చుకోవచ్చనుకుంది అమ్మ. తన పద్నాలుగో ఏట ‘భక్త ప్రహ్లాద’ నాటకంలో ప్రహ్లాదుడిగా నటించింది. మంచి తెలుగు వచ్చు కాబట్టి, పద్యాలు చాలా చక్కగా చదవగలిగానని అమ్మ చెప్పేది. ‘సక్కుబాయి’ నాటకం చూసి బాగుందని మెచ్చుకున్నారట కానీ, ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదట. చిన్నగా, సన్నగా ఉన్నావు. కొంచెం ఒళ్లు రావాలి, అలాగే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అన్నారట. పద్యాలు, పాటలు సాధన చేస్తూ, సినిమా అవకాశాల కోసం ఎదురుచూసిందట అమ్మ. ఘంటసాల బలరామయ్యగారు అమ్మ ఫొటోలు చూసి ‘గరుడ గర్వభంగం’ చిత్రంలో సత్యభామ చెలికత్తె వేషం ఇచ్చారట. క్రమేపీ పుల్లయ్య గారు, గూడవల్లి రామబ్రహ్మం గారు, బి. ఎన్. రెడ్డిగారు... వీరందరి పరిచయాలతో అమ్మకు సినిమాలలో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఎత్తుకు పై ఎత్తు, మనుషులు మారాలి... వరసగా 900 కు పైగా చిత్రాలలో నటించింది. ఒక సంవత్సరంలో 19 సినిమాలు చేసిన రికార్డు అమ్మది. 70 సంవత్సరాలు వచ్చాక కూడా చేసింది. హిందీ, తమిళ చిత్రాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. సినీ పరిశ్రమలో అమ్మని అందరూ సొంత తల్లిలా భావించేవారు. అమ్మనాన్నలను అక్క – బావ అని పిలిచేవారు. ప్రోత్సహిస్తేనే వివాహం.. అమ్మకు 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి వివాహం చేసుకోమని అమ్మమ్మ అడిగిందట. అందుకు అమ్మ, ‘నన్ను కళాకారిణిగా ప్రోత్సహించేవారినే చేసుకుంటాను’ అని నిక్కచ్చిగా చెప్పిందట. కళల పట్ల ఆసక్తి ఉన్న జి. వి. కృష్ణారావు గారితో అమ్మ వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుంచి ఇద్దరిదీ ఒకే మాట, ఒకటే బాట. ఉదయిని థియేటర్ స్థాపించి, ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఏ పోటీకి వెళ్లినా అమ్మకు బహుమతి తప్పనిసరి. ఆంధ్రకళాపరిషత్తులో మూడు సార్లు వరసగా బహుమతులు రావటంతో, నిర్వాహకులు ‘అమ్మా! ఇక నుంచి మీరు బహుమతులకు దూరంగా ఉండండి’ అన్నారట. ఆ విషయం అమ్మ ఎంతో సంబరంగా చెప్పేది. పెద్దల ప్రశంసలు... అమ్మ ఒకసారి ‘కరవు రోజులు’ నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ఆ నాటకానికి ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు పృ«థ్విరాజ్ కపూర్ హాజరయ్యారట. ఆ నాటకంలో అమ్మ స్టేజ్ మీద పావుగంట సేపు శవంలా ఉంటుంది. నాటకం పూర్తయ్యాక ఆయన, ‘శవం బాగా నటించింది’ అని చమత్కరిస్తూ అమ్మను అభినందించారని అమ్మ ఎంతో సంతోషంగా చెప్పేది. అలాగే ‘ఎంతో ప్రావీణ్యం ఉంటేనే కానీ రేడియో నాటకాలలో నటించలేం. నాలుగు గోడల మధ్య మైకు ముందర నిలబడి, అందరికీ కళ్ల ముందు కనిపిస్తున్నట్లు నటించాలి. నాకు రేడియో నాటకాలంటే మక్కువ’ అనేది. విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన వేయిపడగలు, ఏకవీర నాటకాలలో నటించింది. ‘వేయిపడగలు’ లో గిరిక పాత్ర విని, ఆయన స్వయంగా ‘పిచ్చి తల్లీ! నిన్ను తక్కువ అంచనా వేశాను. ఎంత బాగా నటించావో’ అని ఆశీర్వదించారుట. అన్నీ పద్ధతిగా ఉండాలి... అన్ని పనులు చాలా చురుగ్గా చేసుకునేది. తాను సెలబ్రిటీని అనే భావన ఏ కోశానా ఉండేది కాదు. వంట స్వయంగా చేసుకుంటేనే ఇష్టం అమ్మకు. వంటవాళ్లతో చేయించుకోవటం ఇష్టం లేదు. ఉలవచారు, చేపల పులుసు.. అన్నీ చాలా శ్రద్ధగా చేసేది. ముక్కలు తరిగితే... ఒక ముక్క పెద్దది, ఒక ముక్క చిన్నది అయితే ఒప్పుకునేది కాదు. ఆవకాయ ముక్కలు సైతం పెద్ద కత్తి పీట మీద తరిగేది. బయట వాళ్లు రకరకాల సైజుల్లో కట్‌చేస్తారని అమ్మకు నచ్చేది కాదు. గోంగూర ఆరబెట్టి, శుభ్రం చేసి పచ్చడి తయారుచేసేది. పెసరపప్పు అప్పడాలు బాగా ఒత్తేది. అడిగిన వారికే కాదు, అడగని వారికి కూడా సీసాలలో పచ్చళ్లు ఇచ్చేది. నలుగురికీ పెట్టడమంటే అమ్మకి చాలా ఇష్టం. అమ్మ వంట చేసి షూటింగ్‌కి క్యారియర్ తీసుకువెళ్లేది. ఔట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు అక్కడ సొంతంగా వంట చేసేది. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్లమనేది. పూల జడ వేసేది... నా చిన్నప్పుడు అమ్మ చెన్నై నుంచి హైదరాబాద్ సారథి స్టూడియోకి షూటింగ్స్ కోసం వచ్చేది. షావుకారు జానకి, అమ్మ మంచి స్నేహితులు. షూటింగ్ అయిపోయాక, అమ్మవాళ్లు షాపింగ్ చేసేవారు. లక్క పిడతలు, బట్టలు, గాజులు తీసుకువచ్చేది. వేసవి కాలంలో మల్లె పూలను, ఎంతో పొందికగా గుచ్చి చాలా అందంగా వంకీల జడ కుట్టేది. నా పుట్టినరోజు వస్తే ఇంట్లో పండగే. నాన్న హైదరాబాద్ నుంచి ఫ్రాక్స్ తెచ్చేవారు. ఆడపిల్లను చక్కగా అలంకరించి, అందంగా చూసుకోవటం నాన్నకు చాలా ఇష్టం. అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసేవారు. బొమ్మల కొలువు పెట్టించేది. అట్ల తద్ది నోము, ఉపవాసాలు చేయించేది. పెళ్లయ్యాక వరలక్ష్మీవ్రతం చేయించింది. మా పిల్లలకు నలుగు పిండి కోసం బావంచాలు, కచ్చూరాలు తెప్పించి మర పట్టించేది. వాళ్లకి నలుగు పెట్టి స్నానం చేయించి, ఆ తరవాత అమ్మ సాన్నం చేసి, షూటింగ్‌కి రెడీ అయ్యేది. షూటింగ్ నుంచి రాగానే శుభ్రంగా స్నానం చేసి, మళ్లీ పిల్లల దగ్గరకు వచ్చి వారిని, మురిపెంగా చూసుకునేది. వాళ్లు కొంచెం పెద్దవాళ్లయ్యాక హైదరాబాద్ నుంచి ద్రాక్షపళ్లు, మామిడి పండ్లు తెచ్చేది. ఇబ్బంది పెట్టేది కాదు... షూటింగ్‌కి వెళ్లాలంటే తెల్లవారుజామునే లేచి, కాఫీ తాగి, అన్ని పనులు ముగించుకుని, సిద్ధంగా ఉండేది. ఒక్క రూపాయి కూడా ఎవ్వరిదీ తీసుకోలేదు. దర్శకులంటే చాలా గౌరవం. వాళ్లు చెప్పింది చేసేది. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టేది కాదు. డబ్బింగ్ కూడా కాల్షీట్ ప్రకారం వెళ్లి చెప్పేది. అమ్మ అప్పట్లో చాలా బిజీగా ఉండేది. అమ్మనాన్న ఇద్దరూ రాత్రి షూటింగ్స్‌కి వెళ్తుంటే బాగా ఏడ్చేసేదాన్ని. నన్ను మా పెద్దమ్మ కూతురు సుబ్బులక్క దగ్గరకు తీసుకుని ఓదార్చేది. తనే నన్ను తల్లిలా పెంచింది. నాకు జ్వరం వస్తే మాత్రం అమ్మ నా పక్క నుంచి కదిలేది కాదు. చాలా సాధారణంగా... అమ్మ ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలే ధరించేది. రెండు చేతులకు చెరో గాజు, మెడలో ఒక గొలుసు, చెవులకు దుద్దులు... అంతే. సినిమాలలో కూడా ఇలాగే ఉండేది. మేకప్ వేసుకునేది కాదు. ఎండల్లో షూటింగ్ చేయటం వల్ల ముఖం మీద చిన్న మచ్చ వచ్చింది. ఆ మచ్చకు మాత్రం రంగు వేసేది. వేలి ముడి, సాదా సీదా చీరలు ఇష్టపడేది. ఎక్కువగా మల్మల్ చీరలు, ఆర్గండీ చీరలు కట్టుకునేది. తలకు ఎన్నడూ రంగు వేసుకోలేదు. అమ్మకి పూల మొక్కలు, చెట్లు, కూరగాయ మొక్కలంటే చాలా ఇష్టం. విరజాజి పూలు, ఉసిరి, నిమ్మ, సీతాఫలం, జామ, మామిడి చెట్లు, సపోటా, పనస అన్నీ కడియం నుంచి తెప్పించింది. మొక్కలకు స్వయంగా నీళ్లు పోసేది. కుక్కలంటే చాలా ఇష్టం. చాలా కుక్కల్ని పెంచింది. కాటుక ఇంట్లోనే చేసేది అమ్మ. పుస్తకాలు బాగా చదివేది. బ్రహ్మంగారి చరిత్ర, ఈశ్వరమ్మగారి చరిత్ర చదివి మాకు వినిపించేది. తెలుగు అంటే చాలా ఇష్టం. సాటి నటీనటులు ఒత్తులు పలక్కపోతే చాలా కోపం వచ్చేది. చెన్నైలో స్కూల్లో తెలుగు ఉండేది కాదు. అందువల్ల మా అబ్బాయికి తెలుగు అమ్మ నేర్పటమే కాకుండా, కాకరాల గారి దగ్గర కూడా నేర్పించింది. నాకు కడుపులో నొప్పిగా ఉంటే, పొట్టంతా నూనె రాసేది. ఆదివారం వస్తే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలని నేర్పింది. బట్టలు కూడా బాగా సర్దుకుంటేనే కానీ ఒప్పుకునేది కాదు. వస్తువు విలువ తెలియాలనేది. అమ్మకు కోపం చాలా ఎక్కువ. క్రమశిక్షణలో తేడా వస్తే కొట్టేది. నేను సౌమ్యంగా ఉంటూ, అమ్మ చెప్పినట్లు వినేదాన్ని. పెద్దవాళ్ల దగ్గర నుంచి అమ్మ నేర్చుకున్న పనులన్నీ నాకు నేర్పింది. డిగ్రీ వరకు చదివించింది. మాస్టర్ వేణుగారి దగ్గర సితార్ నేర్పించింది. అమ్మనాన్నలు బాగా బిజీగా ఉంటూ, అష్టకష్టాలు పడ్డారు. నేను అలా కష్టపడకూడదనే ఉద్దేశంతో నన్ను గృహిణిగానే ఉంచారు. అమ్మను మించిన దైవం లేదు, ఆవిడ వల్లే నేను ఈరోజు హాయిగా ఉన్నాను. చాలామంది కళాకారుల పిల్లల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో తెలిసిందే. నన్ను ఒక గృహిణిలా, భర్తకు భార్యగా, పిల్లలకు తల్లిగా పెంచారు. మా అమ్మాయికి లక్ష్మీ నిర్మల అని అమ్మ పేరు, అబ్బాయికి జయకృష్ణ అని నాన్న పేరు పెట్టాం. అల్లుడిని కొడుకులా చూసుకున్నారు. అమ్మానాన్నలకు మా వారే తలకొరివి పెట్టారు. స్వాతిముత్యం సినిమాలో అమ్మ పోయిన సీన్ చూస్తుంటే ఇప్పటికీ ఏడుపు వస్తుంది. అని భావోద్వేగానికి లోనైంది కవిత. సంభాషణ: వైజయంతి పురాణపండ -
మాస్ మెచ్చిన క్లాస్ చిత్రం..స్వాతిముత్యం
కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో... వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమలహాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 35 వసంతాలు. కమలహాసన్, రాధిక మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతిముత్యం’. కల్మషం లేని కథ... కల్లాకపటం తెలీని హీరో... కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్ కార్తీక్) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్ కే మొగ్గారు. సున్నితమైన... విశ్వనాథ ముద్ర మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్‌టైమ్ హిట్స్. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని...’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమలహాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక, ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్‌ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ‘సితార’తో రచయితగా పరిచయమైన సాయినాథ్, ‘సిరివెన్నెల’కు రాసిన ఆకెళ్ళ – ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కలానికి డైలాగుల్లో చేదోడు అయ్యారు. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు. వందరోజుల వేళ... అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లలోనూ ‘స్వాతిముత్యం’ వంద రోజులు ఆడింది. ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్‌గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే! 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్‌కపూర్ వచ్చారు. విశ్వనాథ్ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆస్కార్‌కు ఎంట్రీ! హాలీవుడ్ ఫిల్మ్‌తో పోలిక!! ఆస్కార్స్‌కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్ ‘ఫారెస్ట్‌గంప్’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్‌కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. రాజ్‌కపూర్ మనసు దోచిన సినిమా! ‘షో మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజ్‌కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్‌కపూర్‌కు చూపించడం విశ్వనాథ్‌కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్‌కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్‌లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్‌కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్‌కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత. శతదినోత్సవ వేదికపై రాజ్‌కపూర్, ఎన్టీఆర్, ఏడిద క్లాస్మాటున మాస్ డైరెక్టర్! భారతీయ సినీరంగంలో ప్రయోగాలకూ, ప్రయోగశీలురకూ కొరత లేదు. సత్యజిత్ రే, హృషీకేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదూర్ గోపాలకృష్ణ్ణన్, కన్నడ పుట్టణ్ణ కణగల్ దాకా ఎంతోమంది కళాత్మకంగా, రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే, సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకే పరిమితం. పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లయిన సందర్భాలు అరుదు. కానీ, మన తెలుగు దర్శక ఆణిముత్యం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ అయినా, ఇటు సామాజిక కోణం ఉన్న ‘స్వాతిముత్యం’ అయినా, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గానూ మాస్ హిట్లు సాధించారు. పండితుల ప్రశంసలతో ‘కళాతపస్వి’గా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. పండితులతో పాటు పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి, ‘క్లాస్ మాటున... కనిపించని మాస్ డైరెక్టర్’గానూ నిలిచారు. ఇలా క్లాస్ సినిమాలు తీసి, మాస్‌ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇది విశ్వనాథ్‌కే సాధ్యమైన ఓ ‘న భూతో న భవిష్యత్’ విన్యాసం! రాధికకు నటించి చూపిస్తూ కె. విశ్వనాథ్ తమిళం, హిందీల్లోనూ... హిట్! తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని నిర్మాత ఏడిద నాగేశ్వరరావే తమి ళంలో ‘చిప్పిక్కుళ్ ముత్తు’ (1986 అక్టోబర్ 2)గా అనువదించారు. తమిళ, మలయాళ సీమల్లో అది మంచి విజయం సాధించింది. మూడేళ్ళ తరువాత అనిల్‌కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’(’89) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు హిందీలో రీమేక్ చేశారు. అక్కడా విజయవంతమైంది. ఆపైన చాలాకాలానికి ఇదే కథను కొందరు కన్నడ సినీ రూపకర్తలు ‘స్వాతి ముత్తు’ (2003) పేరుతో స్వయంగా రూపొందించారు. ఇప్పటి స్టార్ హీరో సుదీప్, మీనా అందులో జంటగా నటించారు. తెలుగు ‘స్వాతిముత్యం’కు మక్కికి మక్కి కాపీ లాగా ఈ కన్నడ వెర్షన్‌ను తీశారు. అయితే, దర్శకుడు మాత్రం విశ్వనాథ్ కాదు. కమలహాసన్ మేనరిజమ్‌నే మళ్ళీ కన్నడ వెర్షన్లోనూ పెట్టారు. ఇళయరాజా సంగీతాన్నే వాడుకున్నారు. కానీ, అచ్చం జిరాక్స్ కాపీ తీసినట్లుగా రీమేక్ చేయడంతో కథలో ఆత్మ లోపించింది. దాంతో కన్నడ వెర్షన్ అనుకున్నంత జనాదరణ పొందలేదు. ‘‘మాతృకను చూడకుండా, అదే తొలిసారి చూడడమైతే ఓకే కానీ, ఒకసారి ఒక కథను చూసేసిన ప్రేక్షకులు ఆ తరువాత దాన్ని యథాతథంగా మరొకరు తీసే ప్రయత్నాన్ని పెద్దగా హర్షించరు. కథనం, పాటలు, సంగీతం – ఇలా అన్నిటిలోనూ మాతృకతో పోల్చిచూసి, విమర్శిస్తారు. ఇది నా ఇన్నేళ్ళ అనుభవం’’ అని విశ్వనాథ్ వివరించారు. బెంగళూరు సహా కన్నడసీమలోనూ తెలుగు ‘స్వాతిముత్యం’ బాగా ఆడడంతో, తీరా కన్నడంలోకి అదే కథను రీమేక్ చేసినప్పుడు ఆ మాతృక ఘనవిజయం పెద్ద ఇబ్బందిగా మారింది. చిరు పాత్రలో... అల్లు అర్జున్ ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన మేజర్ సౌందర్ రాజన్ అక్కడ ప్రముఖ నటుడు – ఏడిద నాగేశ్వరరావుకు స్నేహితుడు. సౌందరరాజన్ తొలిసారిగా తెలుగుతెర మీదకొచ్చి, ఈ ‘స్వాతిముత్యం’లో రాధిక మామగారి పాత్రలో కనిపిస్తారు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి, నటుడిగా చాలా పాత్రలు చేసి, నిర్మాతగా స్థిరపడ్డ ఏడిదే ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనుమడు (పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు) మాస్టర్ కార్తీక్ నటించారు. కమలహాసన్ మనవడిగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తెరపై కనిపించడం విశేషం. మనవరాళ్ళుగా అరవింద్ పెద బావగారు – నిర్మాతైన డాక్టర్ కె. వెంకటేశ్వరరావు కుమార్తెలు విద్య, దీపు తెరపైకి వచ్చారు. స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమానే! రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్‌కు ముందు సినిమా కలెక్షన్లకు డల్ పీరియడ్‌గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్‌సీజన్‌లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్ రామ్స్’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తరువాతే స్టార్లు కృష్ణ (70 ఎం.ఎం. ‘సింహాసనం’), బాలకృష్ణ (‘సీతారామకల్యాణం’), చిరంజీవి (‘పసివాడి ప్రాణం’) లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలు సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయం సాధించడాన్ని బట్టి క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’ తాలూకు మాస్ హిట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్ల పోటీలో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్! నిజానికి ఆ ఏడాది తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ‘ఖైదీ’ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి హిట్స్‌తో పోటీపడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం. సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్‌బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ సాధించారు. నాగార్జున ‘విక్రమ్’ (1986 మే 23)తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’(1986 ఆగస్ట్14)తో మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడి (కమలహాసన్)తో, నాన్‌కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియన్ ఫిల్మ్ కూడా ఇదే! ∙– రెంటాల జయదేవ -
గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు
ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘స్వాతిముత్యం, స్వాతి కిరణం’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు రాధిక. తనకు రెండు అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకుడిని కలిశారామె. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు రాధిక. దర్శకులు విశ్వనాథ్‌ను ఆయన స్వగృహంలో కలిశారామె. ఈ సందర్భంగా దిగిన ఫొటోను షేర్ చేసి, ‘‘విశ్వనాథ్‌గారు నాకు గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు ఇచ్చారు. ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక లెజెండ్. విశ్వనాథ్‌గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’’ అన్నారు రాధిక. ‘స్వాతిముత్యం’ లొకేషన్లో... -
స్వాతిముత్యాలు
-
స్వాతిముత్యాలు
కల్మషం ఎరుగని నవ్వులు.. కుతంత్రం కనిపించని చూపులు.. కుట్రలు తెలియని ఆలోచనలు.. ఇదే వారి ప్రపంచం. లౌక్యానికి దూరంగా.. సంతోషానికి దగ్గరగా.. సంచలిస్తున్న వారి హావభావాలు.. కన్నవారికి అనుక్షణం బాధ్యతలు గుర్తు చేస్తుంటాయి. అక్కరకు రాని సానుభూతి తప్ప.. ఇంకేమీ ఇవ్వని ఈ లోకంలో నిస్వార్థానికి చిరునామాగా నిలుస్తున్నారీ అమాయక చక్రవర్తులు. మనసుకు మాలిన్యం అంటని స్వాతిముత్యాల హృదయాలను ఆవిష్కరించడానికి.. వారి తల్లిదండ్రులను హీరో సునీల్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు. పసితనం దగ్గరే ఆగిపోయిన ఇంటలెక్చువల్లీ చాలెంజ్డ్ పిల్లల అంతరంగాలను మనముందుంచారు. - సునీల్ సునీల్: అమ్మా.. మీ బిడ్డ స్పెషల్ కిడ్ అని తెలియగానే చిన్నారి గురించి బాధపడ్డారా..? మీ గురించి బాధ పడ్డారా? సునీత: ఏ త ల్లయినా ఆ షాక్ నుంచి తేరుకోవడం అంత ఈజీ కాదు సార్. నా ఇద్దరు పిల్లలూ స్పెషల్ కిడ్సే. నా బిడ్డలకే ఎందుకిలా అయిందన్న బాధ నుంచి తేరుకోవడానికి నాకు చాన్నాళ్లు పట్టింది. వారి మాటల్లో, చేతల్లో ప్రత్యేకత కనిపించినపుడు మాత్రం నాకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. సునీల్: వావ్.. వారు నేర్చుకోలే క కాదు! మనం సరిగా దృష్టి పెడితే వారు ఎన్నో అద్భుతాలు చేయగలరని సంతోష్లా చాలామంది నిరూపించారు. అపర్ణ: అవును సార్ మా అబ్బాయి వరుణ్ రెండుసార్లు స్పెషల్ ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ కేటగిరీలో మెడల్స్ తీసుకొచ్చాడు. అంతేకాదు.. బుక్ బైండింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. వాడి బుక్స్‌కి బోలెడంత గిరాకీ ఉంది. సునీల్: అది మన గొప్పతనం కాదండీ.. వంద శాతం వాళ్ల ప్రత్యేకతే. మనతో పోల్చుకుంటే వీళ్లు ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేస్తారు. ఇజ్రాయెల్ వంటి దేశాల్లో మిలటరీ సెక్షన్లో గన్స్‌లో బులెట్ లోడింగ్ స్పెషల్ చిల్డ్రన్స్‌తో చేయిస్తుంటారు. వీళ్లయితే పక్కాగా చేస్తారని. అదే మనలాంటి వారికి అప్పగిస్తే బుర్ర ఎక్కడో పెట్టి పొరపాట్లు చేస్తాం. మీ గురించి చెప్పండి సార్.. సుధాకర్: మా అమ్మాయి సుస్మిత. తనకు మూడేళ్లు వచ్చాక స్పెషల్ కిడ్ అని గుర్తించాం. మేం మానసికంగా కుంగిపోయాం. చదువులో ముందుకు వెళ్లలేకపోతుందని స్పోర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాం. స్పెషల్ ఒలింపిక్స్ వరకూ వెళ్లింది. స్విమ్మింగ్‌లో పథకాలు సాధించింది. పెళ్లి చేశాం.. ఓ పిల్లాడు కూడా. ఆడపిల్ల కదా సార్.. ఓ అయ్య చేతిలో పెట్టేవరకూ చాలా ఆందోళన పడ్డాం. ఇప్పుడు హ్యాపీ. సునీల్: గుడ్. శ్రీదేవి గారు.. నిర్వాహకులుగా మీరు చెప్పండి.. శ్రీదేవి: ‘శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్’ స్టార్ట్ చేసి 13 ఏళ్లవుతుంది. నాలుగు సెంటర్లున్నాయి. దాదాపు 300 మంది చిన్నారులను మామూలు మనుషులుగా మార్చగలిగాం. వీరిలో 30 మంది పదో తరగతి పూర్తి చేశారు. 16 మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరు స్పోర్ట్స్‌లో.. ఇంకొందరు డ్యాన్స్‌లో.. మరికొందరు రకరకాల వొకేషనల్ పనుల్లో రాణిస్తున్నారు. వెయ్యి మంది మామూలు వారిని గొప్పవాళ్లుగా తీర్చిదిద్దడంలో కంటే.. ఒక స్పెషల్ కిడ్ని ఓ పనిలో నిష్ణాతుణ్ని చే యడంలో ఉన్న తృప్తి చాలా గొప్పది. సునీల్: వీరు ఎక్కువగా ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు? శ్రీదేవి: కంప్యూటర్ సైడ్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మెకానిక్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటున్నాయి. మొన్నీమధ్యే ఇద్దరబ్బాయిలు బోయిన్‌పల్లిలోని హీరోహోండా షోరూమ్‌లో చేరారు. అలాగే మాల్స్‌లో కూడా వీళ్లు బాగా పని చేయగలరు. కానీ అవకాశాలు కల్పించేవారు కరువయ్యారు. సునీల్: అవును.. ఈ విషయంలో మనం పూర్తిగా ఫెయిల్యూర్. విదేశాల్లో అయితే వీరిని మామూలు మనుషుల్లానే ట్రీట్ చేస్తారు. ఉద్యోగ అవకాశాల్లో కూడా వీరి కోటా పెద్దది. మన దగ్గర కూడా అలాంటి పరిస్థితి రావాలంటే ఏం చేయాలంటారు? వెంకట రమణారెడ్డి: వీళ్లు చేయగల పనులను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమల్లో వీరికి కోటా కల్పించాలి. శ్రీదేవి: అంతేకాదు.. మన రాష్ట్రంలో వీరి సంఖ్యపై సర్వే చేయించి వీరి జీవనోపాధి కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి. సునీల్: మీకో విషయం చెప్పాలి.. మానవజాతిలోనే యూదులను అత్యంత తెలివైన వాళ్లుగా అభివర్ణిస్తారు. అయితే ఇంటలెక్చువల్లీ చాలెంజ్డ్ కూడా వాళ్లలోనే ఎక్కువ! అమెరికాలో ఒత్తిడితో బాధపడే గొప్ప గొప్ప వాళ్లూ.. స్పెషల్ కిడ్స్‌తో ఒకరోజు ఉండటానికి వారి తల్లిదండ్రులకు అప్లికేషన్లు పెట్టుకుంటారు తెలుసా..? వెంకట రమణారెడ్డి: వారికి కల్మషం తెలియదు.. అబద్ధం రాదు.. ఇష్టం లేని పని చేయరు.. నచ్చని వారి జోలికెళ్లరు. నచ్చితే వదలరు. అందుకే వారంటే అందరికీ ఇష్టమే. మావాడు నేను బయటకు వెళ్లి వచ్చే లోపు ఊరంతా చుట్టేసి అందరినీ పలకరించి వస్తాడు. ‘మీ అబ్బాయి చాలా మంచివాడ’ని అందరూ అంటుంటారు. వీడు మామూలుగా పుట్టి.. గొప్పగా చదివి విదేశాలకు వెళ్లినా.. ఆ మాట అనిపించుకునే వాడు కాదేమో. శ్రీలక్ష్మి: మాకు ఇద్దరు అబ్బాయిలు. చిన్నోడు స్పెషల్ కిడ్. పెద్దవాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. పెద్దోడికి కోపం వస్తే.. అంత త్వరగా చిన్నోడితో మాట్లాడడు. కానీ వీడు మాత్రం వెంటనే అన్నా అంటూ ద గ్గరికి వెళ్లి.. కలిపేసుకుంటాడు. సునీల్: నిజం చెప్పాలంటే అసలు వికలాంగులం మనమే. మన మాట ఎవరైనా వినకపోతే వెంటనే కోపం వచ్చేస్తుంది. అదే వాళ్ల బాధని ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం చేసుకోకుండా విసిగిస్తాం.. ఆ టైంలో వాళ్లకు ఎంత కోపం రావాలి ? అపర్ణ: వీరిని అర్థం చేసుకుని.. వారిలో ఉన్న ప్రత్యేకతను తెలుసుకుని ప్రోత్సహిస్తే.. ఆ పిల్లలు కూడా గొప్పస్థానాల్లో ఉంటారు. సునీత: సార్.. చిన్న ప్రశ్న.. మన సినిమాల్లో స్పెషల్ చిల్డ్రన్స్ పాత్రలు చాలా అరుదు. నిజానికి సినిమాకు మించిన ప్రచార మాధ్యమం మరొకటి లేదు కదా..! సునీల్: నిజమే. మన దగ్గర అలాంటి ప్రయత్నాలు తక్కువే. హాలీవుడ్లో చాలా చేశారు. వీరిని చూపించిన తీరు కూడా అద్భుతం. అలాంటి సినిమాలు ఇక్కడ కూడా వస్తే సమాజంలో మార్పు తప్పకుండా వస్తుంది. దానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ‘స్టార్ రిపోర్టర్’గా మిమ్మల్ని కలసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. కొన్ని సంగతులు పంచుకున్నాను. హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ!! సునీల్: నా దృష్టిలో వీళ్లు దేవుడిచ్చిన వరాలు. మాకెందుకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు భగవంతుడా అని మీరెప్పుడూ బాధపడకూడదు. ముందుగా తల్లిదండ్రులను ఎంచుకుని దేవుడు ఈ పిల్లలను ఇస్తాడు. ఎవరైతే ఓపికగా ఈ చిన్నారులను పెంచగలరో వారికే స్పెషల్ కిడ్స్ ఇస్తాడు. ఏమంటారు..? శ్రీదేవి: నిజమే సార్.. సరిగా నిలబడలేని వారు, బేసిక్ థింగ్స్ కూడా తెలియని పిల్లలు ఈ రోజు స్పెషల్ ఒలింపిక్స్‌కు వెళ్లి పతకాలు సాధించారంటే ఆ గొప్పదనం తల్లిదండ్రులదే. నీరజ: మా అబ్బాయి రాజేష్‌ను పదేళ్ల కిందట ‘శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్’కు తీసుకొచ్చాం. అప్పుడు వాడికేం తెలియదు. అలాంటిది ఈ రోజు వాడు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ పిల్లలు ఇలా ఎదగడానికి కారణం ఇలాంటి సంస్థలే. శ్రీదేవి: యస్.. స్వీడన్ వాళ్ల డేటా ఎంట్రీ ప్రాజెక్ట్‌లో సంతోష్‌ది చాలా ముఖ్యమైన పాత్ర.