2022 Year Roundup Movies in Telugu, Special Story - Sakshi
Sakshi News home page

ఇయర్‌ రౌండప్‌ 2022: హిట్‌ బొమ్మలివే...

Published Sun, Dec 25 2022 4:47 AM | Last Updated on Sun, Dec 25 2022 10:23 AM

year roundup 2022 movies in telugu, special story - Sakshi

దాదాపు 275  (స్ట్రెయిట్, డబ్బింగ్‌) చిత్రాలు... 20 శాతం హిట్స్‌తో 2022 ముగియనుంది. గత ఏడాది కరోనా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ పడింది. ఈ ఏడాది థియేటర్స్‌కి లాక్‌ పడలేదు. అయితే కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనే సందేహం నడుమ సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ప్రేక్షకులు సినిమా పట్ల తమకు ఉన్న ప్రేమను నిరూపించుకున్నారు. కానీ విజయాల శాతం మాత్రం ఇరవైకి అటూ ఇటూగానే ఉంది. కాగా స్ట్రెయిట్‌ చిత్రాలే కాదు..  అనువాద చిత్రాలూ మంచి వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 2022 ‘హిట్‌ బొమ్మ’ (చిత్రాలు)లను చూద్దాం.

బంగార్రాజుల సందడి
వాసివాడి తస్సాదియ్యా... అంటూ సంక్రాంతికి పెద్ద బంగార్రాజు (నాగార్జున), చిన్న బంగార్రాజు (నాగచైతన్య) జనవరి 14న ఫెస్టివల్‌ ట్రీట్‌ ఇచ్చారు. కల్యాణŠ  కృష్ణ దర్శకత్వంలో దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ నెల దాదాపు 17 చిత్రాలు వచ్చాయి.

టిల్లుగాడు.. దంచి కొట్టాడు
ఫిబ్రవరిలో ఇరవై చిత్రాలు విడుదలైతే విజయం శాతం రెండు అనే చెప్పాలి. దాదాపు రూ. 5 కోట్లతో రూపొంది, 30 కోట్ల వరకూ వసూళ్లను దంచి కొట్టాడు ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్‌కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇదే నిర్మాత దాదాపు రూ. 80 కోట్లతో పవన్‌ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్‌ Mð.. చంద్ర దర్శకత్వంలో నిర్మించిన  ‘భీమ్లా నాయక్‌’ 150 కోట్లకు పైగా రాబట్టింది. ఇంకా రవితేజ ‘కిలాడి’, మోహన్‌బాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’తో పాటు మరికొన్ని చిత్రాలొచ్చాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌... రికార్డ్‌
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్చి 25న వచ్చింది. దాదాపు రూ. 550 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సుమారు 1150 కోట్ల వసూళ్ల రికార్డుని సాధించింది. ఇదే నెలలో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’తో పాటు మరో పది చిత్రాల వరకూ రిలీజయ్యాయి.

నిరాశతో ఆరంభమైన వేసవి
ఏప్రిల్‌లో దాదాపు 15 సినిమాలు విడుదలైతే  ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రాలు పెద్దగా లేవు. అలా వేసవి నిరాశతో ఆరంభమైంది. వరుణ్‌ తేజ్‌ ‘గని’, తండ్రీకొడుకులు చిరంజీవి– రామ్‌చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రాలు భారీ
అంచనాల మధ్య విడుదలయ్యాయి.

సర్కారుకీ.. ఫన్‌కీ విజయం
మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన సర్కారువారి పాట’ మే 12న విడుదలైంది. దాదాపు రూ. 60 కోట్లతో మహేశ్‌బాబు, అనిల్‌ సుంకర, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం సుమారు 200 కోట్లు వసూ లు చేసింది. ఇక వినోద ప్రధానంగా వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా రూపొందిన ‘ఎఫ్‌ 3’ మే 27న రిలీజైంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దాదాపు రూ. 70 కోట్లతో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా సుమారు 130 కోట్లు రాబట్టింది. మేలో మరో 7 చిత్రాలు రిలీజయ్యాయి.

‘మేజర్‌’  హిట్‌తో..
ఒక్క ‘మేజర్‌’ హిట్‌తో జూన్‌ సరిపెట్టుకుంది.  హీరో అడివి శేష్‌ టైటిల్‌ రోల్‌లో శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో మహేశ్‌బాబు ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం జూన్‌ 3న విడుదలైంది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొంది, 65 కోట్ల వసూళ్లు రాబట్టింది. జూన్‌లో దాదాపు 20 చిత్రాలు రిలీజయ్యాయి.

హిట్‌ లేని నెల
జూలైలో గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, రామ్‌ ‘వారియర్‌’, రవితేజ ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’... ఇలా దాదాపు 20 సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు హిట్‌ చేసిన సినిమాలు ఏవీ లేకుండా పోయాయి. .

అదిరింది ఆగస్ట్‌
ఆగస్టులో వచ్చిన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ బంపర్‌హిట్స్‌గా నిలిచాయి. కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించగా, ‘బింబిసార’తో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నందమూరి కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం 70 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొందిన పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రం ‘సీతారామం’ 100 కోట్ల వసూళ్లకు చేరువలో నిలిచింది. దుల్కర్‌ సల్మాన్, మృణాళ్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో సి. అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నిఖిల్‌ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో దాదాపు  రూ. 20 కోట్ల బడ్జెట్‌తో అభిషేక్‌ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ‘కార్తికేయ 2’ 120 కోట్లు  రాబట్టింది. ఒక్క హిందీ భాషలోనే ఈ చిత్రం సుమారు 50 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఇదే నెలలో విడుదలైన నితిన్‌ ‘మాచర్ల నియోజకగర్గం’, విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ చిత్రాల వసూళ్లు తడబడ్డాయి.

ఒకే ఒక్క విజయం...
ఇక సెప్టెంబరులో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్‌ హీరోగా శ్రీ కార్తీక్‌ దర్శకత్వంలో దాదాపు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో ఎస్‌ఆర్‌. ప్రభు, ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందన్నది ట్రేడ్‌ వర్గాల మాట. ఇంకా ఈ నెలలో దాదాపు పాతిక  చిత్రాలు రిలీజయ్యాయి.

స్వాతిముత్యానికి విజయం
అక్టోబర్‌ నెలలో వచ్చిన ‘స్వాతిముత్యం’ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ. 8 కోట్లతో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బెల్లంకొండ గణేష్‌ హీరోగా, లక్ష్మణ్‌ కె కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అక్టోబరు 5న విడుదలైంది. ఇదే నెలలో రిలీజైన చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ ఫర్వాలేదనిపించింది. నాగార్జున ‘ది ఘోస్ట్‌’ కూడా ఇదే నెల వచ్చింది. ఇదే నెల 21న విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’, విశ్వక్‌సేన్‌ ‘ఓరి..దేవుడా..’ మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ లెక్కల్లో తడబడ్డాయి.

చిన్న సినిమాకి పెద్ద విజయం
సమంత టైటిల్‌ రోల్‌ చేసిన ‘యశోద’ నవంబరు 11న విడుదలైంది. హరి–హరీష్‌ దర్శకత్వంలో దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా 35 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక చిన్న సినిమా ‘మసూద’ రూ. 10 కోట్ల బడ్జెట్‌లోపు రూపొంది, 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంగీత, తిరువీర్‌ ముఖ్య తారలుగా సాయికిరణ్‌ దర్శకత్వంలో రాహుల్‌ యాదవ్‌ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబరులో విడుదలైన దాదాపు 20 సినిమాల్లో అల్లు శిరీష్‌ ‘ఊర్వశివో రాక్షసివో..’, అల్లరి నరేశ్‌ చేసిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీ కం’లకు
ప్రేక్షకులు పాస్‌ మార్కులు వేశారు.

‘హిట్‌’కి హిట్‌
జూన్‌లో ‘మేజర్‌’ హిట్‌ అందుకున్న అడివి శేష్‌కు డిసెంబరులో ‘హిట్‌ 2’ రూపంలో మరో హిట్‌ లభించింది. శైలేష్‌ కొలను దర్శకత్వంలో దాదాపు రూ. 12 కోట్లతో నాని నిర్మించిన ఈ చిత్రం 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’, ‘ఖిలాడి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ ఈ నెల 23న విడుదలైంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ రాబట్టింది. అలాగే ‘కార్తికేయ 2’తో హిట్‌ అందుకున్న నిఖిల్‌ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్‌’ డిసెంబరు 23నే విడుదలైంది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం వసూళ్ల లెక్క రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇంకా నెలాఖరున ఆది సాయికుమార్‌ ‘టాప్‌ గేర్‌’తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

అనువాదం అదిరింది
ఈ ఏడాది డబ్బింగ్‌ చిత్రాల జోరు కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఆ చిత్రాల విశేషాల్లోకి వెళితే... వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్‌ ఖేర్, దర్శన్‌ కుమార్, మిథున్‌ చక్రవర్తి, పల్లవి జోషి ముఖ్య తారలుగా సుమారు రూ. 20 కోట్లతో రూపొందిన ‘ది కశ్మీరీ ఫైల్స్‌’ అన్ని భాషల్లో దాదాపు 350 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిందని టాక్‌. యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కేజీఎఫ్‌ 2’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 కోట్లు సాధించిందని టాక్‌.

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో సీనియర్‌ నటుడు కమల్‌హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’ సుమారు 100 కోట్లతో రూపొంది, దాదాపు 450 కోట్లు వసూలు చేసిందని భోగట్టా. అలాగే కె. కిరణ్‌ రాజ్‌ దర్శకత్వంలో రూ. 20 కోట్లతో రూపొంది, 100 కోట్లకుౖ పెగా వసూళ్లు సాధించింది ‘777 చార్లి’. రిషబ్‌ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ రూ. 16 కోట్లతో రూపొంది, 450 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇవన్నీ ప్రపంచవ్యాప్త లెక్కలు కాగా తెలుగులో లాభాలిచ్చిన చిత్రాలుగా నిలిచాయి.

(వసూళ్ల వివరాలన్నీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement