ప్రత్యేక హోదా కోరిక ప్రజల్లో లేదు
- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్కిశోర్
సాక్షి, విజయవాడ
ప్రత్యేక హోదా అంశం రాజకీయ పార్టీల్లో మినహా ప్రజల్లో లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్కిశోర్ అభిప్రాయపడ్డారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంతో చర్చించిన తర్వాత తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిందన్నారు. రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తామని, విభజన చట్టంలోని లేని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజె క్టును 90శాతం కాకుండా నూరుశాతం నిధులు కేంద్రం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. రెవెన్యూ లోటును కూడా పూర్తిగా భరిస్తామని హమీ ఇస్తున్నారని చెప్పారు. వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం పోరాడారని, ఆ తరువాత జరిగిన పరిణామాల్లో జీఎస్టీ బిల్లు, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడలేదన్నారు. ఇదే విషయాన్ని తాము ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్ నేత యు.వి.శ్రీనివాసరాజు పాల్గొన్నారు.