విజయ్‌తో ఢీ
పట్రా చిత్రంతో అనూహ్యంగా సినీ రంగ ప్రవేశం చేసిన నటుడు శ్యామ్‌పాల్. ఈ చిత్రంలో ఈయన పండించిన విలనిజానికి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారట. ఆ వివరాలను ఈ వర్ధమాన నటుడి మాటల్లోనే...
ఇంజనీరింగ్ చదివిన నేను నా జీవితంలో ఎదుర్కొన్న ఒక సంఘటన కారణంగా న్యాయవాద పట్టా పొందాల్సి వచ్చింది. అయితే నాకిది ఫ్యాషనే. అదే విధంగా నేనొక బాక్సర్‌ను కూడా. ఇందుకు కారణం మాత్రం నాన్న స్టాలిన్పాల్నే. ఆయన పెద్ద బాక్సర్. నన్ను కూడా బాక్సర్ చేయాలన్నది ఆయన కోరిక. ఆ కారణంగా నిత్యం కఠిన శరీర వ్యాయామంతో బాక్సర్నయ్యాను. బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడల్లోనూ జాతీయ స్థాయిలో కప్‌లు గెలుచుకున్నాను. మాకు పాండిచ్చేరిలో నాలుగు కళాశాలలు, చెన్నైలో మరికొన్ని వ్యాపారాలు ఉన్నాయి. కళాశాల నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్న నాకు సినిమాలు చూసే అలవాటు ఉంది.
ఎక్కువగా ఆంగ్ల చిత్రాలు చూస్తుంటాను. ఆ చిత్రాలను తమిళంలో తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు వస్తుంటాయి. అయితే సినిమాలో నటించాలనే ఆసక్తి మాత్రం లేదు. అలాంటిది ఒకసారి పట్రా చిత్ర దర్శకుడు జయందాన్ లొకేషన్ చూడటానికి పాండిచ్చేరిలోని మా కాలేజీకు వచ్చారు. అక్కడ నన్ను చూసి ఒక చిన్న పాత్ర ఉంది చేస్తారా? అని అడగారు. చిన్న పాత్రే కదా అని ఓకే అన్నాను. అయితే చిత్రం పూర్తి అయ్యే వరకు నా పాత్ర ఏమిటన్నది స్పష్టంగా వివరించలేదు. ఆయన చెప్పినట్టు చేశాను. పట్రా చిత్రం విడుదలైన తరువాత ప్రముఖ దర్శక నటుడు కె.భాగ్యరాజ్ లాంటి పలువురు అభినందిస్తుంటే సంతోషం పట్టలేకపోతున్నాను. ఎలాగు చిత్ర రంగ ప్రవేశం చేశాను కనుక ఇకపై ఇళయదళపతి విజయ్‌తో విలన్‌గా ఢీ కొనడానికైనా సిద్ధమే. మరో పక్క దర్శకుడు ఎ ఎల్ విజయ్‌తో కలసి షట్టర్ అనే చిత్రం కూడా నిర్మిస్తున్నాను అని శ్యామ్‌పాల్ చెప్పారు.