CIBIL Score: సిబిల్ గుబులు!
నేడు ప్రతి చిన్న వస్తువు కొనుగోలూ ఈఎంఐ విధానంలోనే చెల్లింపుల్లో జాప్యంతో సిబిల్ స్కోర్‌కు దెబ్బ భవిష్యత్‌లో ఇతర రుణాలు తీసుకోలేని పరిస్థితి ఆలస్య రుసుములు, వాటిపైన పన్నుల బాదుడు సరేసరి ఆయా కంపెనీల ప్రకటనల వలలో చిక్కుకుంటున్న ప్రజలునియంత్రణ అవసరమంటున్న నిపుణులు విజయవాడకు చెందిన గౌస్ మొహియుద్దీన్ ఐదు నెలల క్రితం టీవీ కొన్నారు. గత నెలలో ఈఎంఐ కట్టాల్సిన సొమ్ము కంటే రూ.10 బ్యాంకులో తక్కువగా ఉండటంతో రూ.580 ఆలస్య రుసుము పడటమే కాకుండా సిబిల్ స్కోర్ భారీగా తగ్గింది.రమేశ్ నాయుడు అనే డిగ్రీ విద్యార్థి ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి శాంసంగ్ మొబైల్ కొన్నాడు. నాలుగో నెలలో ఈఎంఐ చెల్లించకపోవడంతో మొబైల్‌ను బ్లాక్ చేశారు. తిరిగి దీన్ని పనిచేయించేందుకు ఈఎంఐ కట్టడంతో పాటు రూ.600 ఆలస్య రుసుం చెల్లించాడు. అతడు ఇప్పుడు ద్విచక్రవాహనం కొనడానికి వెళ్తే.. ‘సిబిల్ స్కోర్ పడిపోయింది.. రుణం ఇవ్వలేం’ అని చెప్పారు... ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది సిబిల్ స్కోర్ సరిగా లేక వాహన, వ్యక్తిగత, గృహ రుణాలను పొందలేకపోతున్నారు. చెక్ బౌన్స్ అయితే భారీగా సిబిల్ స్కోర్ పడిపోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏ రుణం తీసుకున్నా సకాలంలో చెల్లించాలంటున్నారు. ఆయా రుణ సంస్థలు, బ్యాంకులు నిర్దేశించిన తేదీల్లోగా చెల్లింపులు చేయాలంటున్నారు. ఇలా చేస్తేనే చక్కటి సిబిల్ స్కోర్ సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. సిబిల్ సరిగా లేకపోతే ఏ రుణం కూడా మంజూరు కాదని చెబుతున్నారు. సిబిల్ లెక్కలివి.. సగటున ఉండాల్సిన కనీస స్కోర్ 650ఏదైనా రుణం రావాలంటే కనీసం ఉండాల్సిన స్కోర్ 600గృహరుణం కావాలంటే ఉండాల్సిన స్కోర్ 700కు పైనఈఎంఐల్లోనే ఎక్కువ..ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ నెలసరి వాయిదా చెల్లింపు (ఈఎంఐ) విధానంలో వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వివిధ బ్యాంకులతోపాటు ప్రైవేటు ఆర్థిక సంస్థలు సైతం క్రెడిట్ (సిబిల్) స్కోర్ ఆధారంగా రుణాలు ఇస్తుండటంతో చాలా మంది ఈఎంఐ విధానంలో వస్తువులను కొంటున్నారు. అయితే నిర్దేశిత తేదీల్లోగా ఈఎంఐ చెల్లించకపోవడం, అందుకు తగ్గట్టుగా బ్యాంకులో నగదు నిల్వ ఉంచకపోవడంతో బౌన్సుల బారినపడుతున్నారు. దీంతో భారీగా ఆలస్య రుసుం, దానిపైన ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తోంది. అంతేకాకుండా ఫోన్లలో ఆయా రుణ సంస్థలు, బ్యాంకుల ప్రతినిధుల బెదిరింపులూ తప్పడం లేదు. నియంత్రించుకోకుంటే కష్టం.. ఇప్పుడు చాలా సులువుగా ఆన్‌లైన్‌లోనూ, వివిధ యాప్స్ ద్వారా రుణాలు లభిస్తున్నాయి. కేవలం పాన్ కార్డు నంబర్‌ను సంబంధిత వెబ్సైట్ లేదా యాప్‌లో నమోదు చేయగానే కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేది, రానిదీ తెలిసిపోతుంది. అలాగే వివిధ ఎలక్ట్రానిక్ మాల్స్, షాపుల్లోనూ పాన్ కార్డు నంబర్‌ను నమోదు చేసి వెంటనే ఎంతవరకు రుణం వస్తుందో చెబుతున్నారు. దీంతో తమకు అవసరమున్నా, లేకున్నా చాలామంది ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆసక్తితో రుణాల ద్వారా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ‘జీరో వడ్డీ’, ‘ప్రాసెసింగ్ ఫీజు లేదు’ అంటూ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే ప్రకటనల వలలో పడుతున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఆయా సంస్థలు ఎందుకు ఇలా చేస్తాయనే కనీస అవగాహన కూడా లేకుండా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇలా ఆయా ప్రకటనలకు ఆకర్షితులై రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో భారీగా ఆలస్య రుసుం, ఇతర జరిమానాలు తప్పడం లేదు. అంతేకాకుండా సిబిల్ స్కోర్ కూడా గణనీయంగా పడిపోతోంది. తద్వారా భవిష్యత్తులో రుణాలు పొందలేని పరిస్థితి తలెత్తుతోంది.పదిశాతం మందికి పైగా డిఫాల్టర్లే..రాష్ట్రంలో ప్రైవేటు సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లింపులు చేయక డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నవారిలో మొబైల్ ఫోన్లు తీసుకుంటున్నవారు ఎక్కువ మంది ఉన్నట్టు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు చెబుతున్నాయి. సాధారణంగా సిబిల్ స్కోర్ 650 దాటితేనే ఏ రుణమైనా లభిస్తుంది. అయితే రుణాలు తీసుకున్న వారు నిర్దేశిత తేదీల్లోగా చెల్లించకపోవడంతో ప్రతి పదిమందిలో ఇద్దరు డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేస్తున్న వారిలో రుణాల రికవరీ అత్యంత తక్కువగా ఉన్నట్టు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు గుర్తించాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం నగరాల్లో డిఫాల్టర్లు 14 శాతంగా ఉన్నారని ఆయా సంస్థలు చెబుతున్నాయి. జరిమానాలు ఎక్కువగా పడటం, చెక్ బౌన్స్ కేసులు నమోదు కావడం, ఈఎంఐల చెల్లింపుల్లో జాప్యం వంటివన్నీ అత్యధికంగా ఈ మూడు ప్రాంతాల్లోనే నమోదవుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ మూడు చోట్లా సిబిల్ స్కోర్ కూడా గణనీయంగా తగ్గినట్టు తేలింది. ఈ మూడు నగరాలు కాకుండా మిగతా జిల్లాల్లో సగటున 10 శాతం డిఫాల్టర్లు ఉంటున్నారు.సకాలంలో చెల్లిస్తేనే సిబిల్ బాగుంటుంది.. ప్రస్తుతం సిబిల్ స్కోర్ చాలా కీలకమైంది. సిబిల్‌కు ఆయా ఫైనాన్స్ సంస్థలు చిన్న చిన్న అప్పుల సమాచారాన్ని కూడా ఇస్తాయి. చెల్లింపుల్లో జాప్యం లేదా మొండి బకాయిలు కారణంగా మా దగ్గరకు వచ్చే చాలామందికి సిబిల్ స్కోర్ లేక రుణాలు ఇవ్వడం లేదు. వస్తువు తీసుకున్నాక సకాలంలో చెల్లిస్తేనే సిబిల్ స్కోర్ బాగుంటుంది. లేదంటే భవిష్యత్తులో పరపతి లభించడం చాలా కష్టం. – సునీల్ కుమార్, మేనేజర్, ఎస్బీఐ