T App Folio
-
లైఫ్ సర్టిఫికెట్ ఇస్తేనే పింఛన్
సాక్షి, హన్మకొండ అర్బన్ : జిల్లా ఖజానా శాఖ ద్వారా సుమారు 20 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు నెలవారీ పింఛన్ పొందుతున్నారు. వీరికి ప్రతినెలా సుమారు రూ. 65 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే, నిబంధనల మేరకు ప్రతీ పింఛన్‌దారు ఏటా తాను జీవించి ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని విధిగా ఖజానా అధికారులకు అందజేయాలి. ప్రస్తుతం కోవిడ్–19 నేపథ్యంలో భౌతికంగా కాకుండా 2021 మార్చి 31లోపు ప్రభుత్వ టీ యాప్ పోలియో యాప్ ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా లేదా జీవన్ ప్రమాణ్ ద్వారా అందచేయాలి. అలా అందజేసిన వారికి మాత్రమే 2021 – 2022 ఆర్థిక సంవత్సరం మొత్తం పింఛన్ అందుతుంది. లేనిపక్షంలో వచ్చే ఏడాది మే నుంచి పింఛన్ ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేయండి.. టీ యాప్ పోలియో ద్వారా గత ఏడాది కూడా జీవన ధృవీకరణ పత్రాలను అధికారులు తీసుకున్నారు. అలా గత ఏడాది రిజిస్ట్రేషన్ చేసుకున్న పింఛన్‌దారులు ఈ ఏడాదికి నేరుగా సెల్ఫీ ద్వారా ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. గత సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకోని వారు మాత్రం నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు తమ మొబైల్ ఫోన్లో టీ యాప్ పోలియో తెలంగాణ ప్రభుత్వ యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ నంబర్, ఈ మెయిల్ నమోదు చేస్తే పిన్ వస్తుంది. అనంతరం తెలంగాణ ప్రభుత్వ పింఛన్దారుడిగా చెబుతూ ఓటరు ఐడీ నంబర్ (ఎపిక్ నంబర్) లేదా బ్యాంకు అకౌంట్ నంబర్‌తో పాటు పేరు, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. వీటితో పాటు సెల్ఫీ దిగి అప్లోడ్ చేయాలి. అన్నీ సరిగ్గా ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత టీయాప్ పోలియో సాఫ్ట్వేర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో నమోదైన ఓటరు వివరాలు, ఖజానా శాఖ సాఫ్ట్‌వేర్‌లో నమోదైన వివరాలు ఫొటోలతో సహా ట్రెజరీ అధికారుల పరిశీలనకు అందుతాయి. అక్కడ సరైనదేనని ధృవీకరించుకుని రిజిస్ట్రేషన్‌ను ఆమోదిస్తారు. ఆ తర్వాత పింఛన్‌దారులు జీవిత కాలమంతా జీవన ధృవీకరణ పత్రాన్ని ఇంట్లో నుంచి టీయాప్ పోలియో యాప్ ద్వారా సమర్పించవచ్చు. కాగా, రిజిస్ట్రేషన్ పరిశీలన పూర్తయ్యాక మొబైల్ నంబర్‌కు రిజిస్ట్రేషన్‌ను ట్రెజరీ అధికారులు ఆమోదించినట్లుగా మెసేజ్ వస్తుంది. ఆ వెంటనే మళ్లీ సెల్ఫీ దిగి తన జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. రెండోసారి దిగిన సెల్ఫీ ఫొటోతో జీవన ధృవీకరణ పత్రాన్ని నేరుగా ట్రెజరీ సాఫ్ట్వేర్ ఆమోదిస్తుంది. ఎవరివైనా వివరాలు లేదా ఫొటోలు రెండూ సరిగ్గా లేనప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ట్రెజరీ అధికారులు తిరస్కరిస్తారు. మళ్లీ సరిగ్గా నమోదు చేసి తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని కోసం ఎలాంటి రుసుము ఎవ్వరికీ చెల్లించాలి్సన అవసరం లేదు. మరికొంత సమాచారం పోస్ట్ ద్వారా వచ్చిన జీవన ధృవీకరణ పత్రాలను అధికారులు ఆమోదించరు. పత్రం సమర్పించిన తర్వాత ఎవరైనా పింఛన్‌దారులు మరణిస్తే ఆ వివరాలను కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఓటరు కార్డు లేని పింఛన్‌దారులు ఆధార్ నంబర్ ద్వారా సమీప మీ సేవా కేంద్రానికి లేదా కేంద్ర ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ కేంద్రాలకు వెళ్లి జీవన ధృవీకరణ పత్రాన్ని అందచేయవచ్చు. ఇందుకోసం నామమాత్రపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ నంబర్ లేని వారి జీవన ధృవీకరణ పత్రం మీ సేవ కేంద్రాల్లో ఆమోదించరు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పింఛన్‌దారులు ట్రెజరీ కార్యాలయంలో తమ ఆధార్ నంబర్ నమోదు చేయించుకోవాలి. కాగా, ఓటరు కార్డు, ఆధార్ నంబర్ లేని వారితో పాటు ఆధార్ నంబరు ఉండి కూడా వేళ్లు సరిగ్గా స్కాన్ కాక జీవన ధృవీకరణ పత్రాన్ని ఆన్లైన్లో ఇవ్వలేని వారైతే సంబంధిత ట్రెజరీ అధికారిని కలిసి పత్రాన్ని నేరుగా అందచేయవచ్చు. రెవెన్యూ ధ్రువీకరణ పత్రం కూడా.. జీఓ 315 ద్వారా పింఛన్ పొందుతున్న అవివాహిత మహిళలు, వితంతు మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలతో పాటు మైనర్ పింఛన్ పొందుతున్న ఫ్యామిలీ పింఛన్‌దారులు వివాహం చేసుకోనట్లు, ఉద్యోగం చేయడం లేదన్నట్లుగా రెవెన్యూ శాఖ ద్వారా ధృవీకరణ పత్రాన్ని ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలి. దివ్యాంగుల పింఛన్‌దారులు ఇటీవల(మూడేళ్ల క్రితం) తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. వీరు ధృవీకరణ పత్రాలను ట్రెజరీ కార్యాలయంలో ఇవ్వకుండా నేరుగా జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తే పింఛన్ నిలిపివేస్తారు. రెండు పింఛన్లు పొందుతున్న వారైతే ఒక దానిపైనే కరువు భత్యం పొందాల్సి ఉంటుంది. ఇలాంటి వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎక్కువగా వస్తున్న కరువు భత్యాన్నే పొందాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉంటున్నారా? విదేశాల్లో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులు అక్కడి ఎంబసీ ద్వారా జీవన ధృవీకరణ పత్రాన్ని జిల్లా ఖజానా అధికారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. బంధువుల ద్వా రా వచ్చినా, వాట్సప్ లేదా ఫేస్బుక్ వీడియో కాల్ ద్వారా అందిన పత్రాలను పరిగణనలోకి తీసుకోరు. ఎంబసీ ద్వారా పంపలేనప్పుడు స్వదేశానికి వచ్చిన తర్వాత ట్రెజరీ అధికారికి పత్రాలను సమర్పించి పింఛన్ పొందొచ్చు. కార్యాలయాలకు రావొద్దు కోవిడ్ నేపథ్యంలో పెన్షనర్లు ఎవరూ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కార్యాలయాలకు రావొద్దు. పెన్షనర్లలో ఎక్కువ మంది 60 ఏళ్ల వయస్సు పైబడినవారు ఉంటారు. అందువల్ల వ్యక్తిగతంగా కార్యాలయాలకు వచ్చి అనారోగ్యం కొని తెచ్చుకోవద్దు. సమీపంలోని మీ సేవా కేంద్రాలు, ఇతర ఆన్లైన్ పద్ధతుల ద్వారా లైఫ్ సర్టిఫికెట్ అందజేస్తే సరిపోతుంది. ఈ విషయంలో దళారుల మాటలు నమ్మి డబ్బు ఇవ్వొద్దు. ఎవరికైనా(వరంగల్ అర్బన్ జిల్లా పెన్షనర్లు) ఏదైనా సమస్యలు, సందేహాలు ఉంటే నేరుగా 77999 34090 నంబర్‌కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయవచ్చు.– గుజ్జు రాజు, జిల్లా ఖజానా లెక్కల అధికారి -
సెల్ఫీతో లైఫ్ సర్టిఫికెట్
సాక్షి, కాజీపేట అర్బన్: ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ఉద్యోగులు పెన్షన్దారులుగా వృద్ధాప్యంలో తమ శేష జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. కాగా ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు పెన్షన్‌దారుడు లైఫ్ సర్టిఫికెట్‌ను సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో లేదా బ్యాంకులో అందజేస్తే సంబంధిత అధికారులు పెన్షన్‌దారుడు జీవించి ఉన్నట్లుగా ధృవీకరించి పెన్షన్ అందజేస్తారు. ఒకవేళా పెన్షన్‌దారుడు ట్రెజరీ కార్యాలయం, బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జీవన్ ప్రమాణ్ వెబ్సైట్లో లేదా మీ–సేవా కేంద్రానికి వెళ్లి ఆధార్ ఆధారిత లైఫ్ సర్టిఫికేట్‌ను అందజేయాలి. ఇందుకు రూ.30 చెల్లించాలి. సకాలంలో లైఫ్ సర్టిఫికెట్ అందజేయకపోతే పెన్షన్ నిలపి వేయబడుతుంది. దీంతో పెన్షన్‌దారుడికి టెన్షన్ మొదలవుతుంది. పెన్షన్‌దారులకు వరంలా.. నేటి ఆధునిక యుగంలో మారుతున్న టెక్నాలజీ వృద్ధాప్యానికి చేరుకున్న పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం టీయాప్–ఫోలియో వరంగా మారనుంది. ఇంట్లో ఉంటునే కేవలం ఒక సెల్ఫీ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేసే విధంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం టీ యాప్ ఫోలియోకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల యాబై వేల మంది, ఉమ్మడి వరంగల్‌లో సుమారు ఇరవై వేల మంది పెన్షన్‌దారులకు లైఫ్ సర్టిఫికెట్ అందజేయడంలో చాలా ఈజీగా మారనుంది. యాప్ డౌన్లోడ్ ఇలా.. పెన్షన్‌దారులు తొలుత తమ ఆండ్రాయిడ్ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి టీ యాప్–ఫోలియోను డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూజర్ ఐడీగా మొబైల్ నెంబర్ స్వీకరిస్తుంది. ఎంపీన్ను పాస్‌వర్డ్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయడం ద్వారా టీ–యాప్ ఫోలియోలోకి లాగిన్ అవుతారు. యాప్‌లోకి ప్రవేశించిన అనంతరం పెన్షనర్ అన్యూవల్ వెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనే అప్షన్‌ను క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా పెన్షనర్ ఐడీ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత ఎలక్షన్ ఓటర్ ఈపీక్ నెంబర్ , అసెంబ్లీ నియోజకవర్గం పేరును ఎంటర్ చేయాలి. అనంతరం పెన్షన్‌దారుడు ఒక సెల్ఫీ దిగి పంపించాలి. సెల్ఫీ ఫోటో జనాభా లెక్కల (ఓటర్ ఐడీ)తో సరిపోలితే ఆమోదం పొందినట్లుగా ధృవీకరిస్తూ ఒక మెసేజ్, రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. పెన్షన్‌దారుడికి అందిన మెసేజ్ సంబంధిత ట్రెజరరీ, బ్యాంకు అధికారికి చేరడంతో లైఫ్ సర్టిఫికెట్ అందించినట్లుగా భావిస్తారు. దీంతో పెన్షన్‌దారులకు లైఫ్ సర్టిఫికేట్ అందించడంలో ఏర్పడే కష్టాల నుంచి ఒక సెల్ఫీతో ఊరట లభించనుంది. సద్వినియోగం చేసుకోవాలి... పెన్షన్‌దారులు ప్రభుత్వం, ట్రెజరరీ శాఖ ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫేస్ రికాగనైజేషన్ టెక్నాలజీ ద్వారా మొట్టమొదటి సారిగా పెన్షన్‌దారుడు టీయాప్–ఫోలియో సౌజన్యంతో సెల్ఫీ అందిస్తే కార్యాలయంలోని రికార్డుల ఆధారంగా ఆమోదం అందిస్తాం. ఒక్క సారి ఆమోదం పొందిన పెన్షన్‌దారుడు తర్వాత ఏడాది నుంచి లైఫ్ సర్టిఫికెట్ అందజేయకపోయినా ఆటోమెటిక్‌గానే ఆమోదం పొందుతారు. - గుజ్జురాజు, ఉప సంచాలకులు, జిల్లా ఖజానా కార్యాలయం -
ఒక యాప్.. 150 సేవలు..!
సాక్షి, హైదరాబాద్: ఒక్క యాప్.. 150 ప్రభుత్వ సర్వీసులు.. అరచేతిలోనే మీసేవలన్నింటినీ పొందే వెసులుబాటు.. ఉన్న చోటు నుంచే ప్రభుత్వ సేవలను పొందేందుకు వీలుగా టీయాప్ ఫోలియో అనే అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మీసేవా కేంద్రాలకు వెళ్లి ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే పని లేకుండా.. ఇంట్లో నుంచే ఫోన్ ద్వారా వాటిని పొందే సౌకర్యాన్ని టీయాప్ ఫోలియో కల్పిస్తుంది. ఐటీ శాఖతో పాటు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సంస్థలు సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి. ప్రభుత్వ సేవలను సులువుగా పొందడమేకాక మీసేవ కేంద్రాల్లో చెల్లించే నగదు కన్నా తక్కువ ఖర్చు కావడం ఈ యాప్ ప్రత్యేకత. ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా.. వాస్తవానికి కులం, ఆదాయం వంటి ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రానికి వెళ్లాలి. టీయాప్ ఫోలియోతో మీసేవ సర్వీసులన్నీ ఓపెన్ ఆన్‌లైన్‌లోకి వస్తాయి. అంటే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే మీసేవా కేంద్రానికి వెళ్లకుండా ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా.. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా తొలుత 150 సేవలను ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. ఇందుకోసం మొబైల్, ఆధార్ నంబర్‌తో యాప్‌లో ముందుగా అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానం అయిన వారే సంబంధిత ధ్రువీకరణ పత్రాల కోసం యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇప్పటి వరకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నా.. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగితే కానీ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేవి కావు. కొత్త విధానం వల్ల మీసేవలో చెల్లించే దరఖాస్తు రుసుం తప్పుతుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీయాప్ ఫోలియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిల్, పాన్ నంబర్ ద్వారా లాగిన్ కావొచ్చు. అందులో కనిపించే సర్వీసుల్లో మనకు అవసరమైన దానిని ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి. ఫీజు చెల్లింపు ఉంటే పూర్తి చేయాలి. అంతే కోరుకున్న సర్టిఫికెట్ వస్తుంది. యాప్ ప్రత్యేకతలు ఇవీ.. కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, స్థానికత గుర్తింపు, ఆర్వోఆర్ పహాణీలు, రిజర్వేషన్ బుకింగ్, ప్రీమియం చెల్లింపులు, దైవదర్శన టికెట్ బుకింగ్‌లు, వ్యవసాయ, రవాణా శాఖ, ఉద్యోగులు, కార్మికుల కోసం సేవలు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్ష రుసుములను చెల్లించవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. యాప్ ద్వారా పరీక్షా ఫలితాలూ తెలుస్తాయి. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ రీచార్జ్, ల్యాండ్‌లైన్, ఇంటర్నెట్ బిల్లు చెల్లింపు, డీటీహెచ్, డేటా కార్డు రీచార్జ్ చేసుకోవచ్చు. ఏడాదిలో వెయ్యి సేవలు.. మరో ఆరు నెలల్లో 500 సేవలు.. ఏడాదిలో వెయ్యి సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నాం. 600 వరకు ప్రభుత్వ సర్వీసులు కాగా.. 400 వరకూ ఇన్ఫర్మేషన్, రేషన్, హోటల్స్, మెట్రో సర్వీసులు మీరు ఉన్న చోటుకు ఎక్కడ దగ్గర ఉన్నాయో తెలుపుతాయి. ఏమైనా ఇబ్బందులుంటే ప్రజలు తెలియజేయవచ్చు. – జీటీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిషనర్, మీసేవ -
టీ-యాప్ ఫోలియో, ప్రత్యేకతలివే!
సాక్షి, హైదరాబాద్ : మొబైల్ గవర్నెన్స్ లో దేశంలో రెండో రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, తన సొంత యాప్ ఫోలియోను విడుదల చేసింది. టీ-యాప్ ఫోలియో పేరుతో సొంత యాప్ ఫోలియోను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం లాంచ్ చేశారు. అన్ని మొబైల్ ఆధారిత సేవలకు ఒకే ప్లాట్‌ఫామ్ టీ-యాప్ ఫోలియోను విడుదల చేసినట్టు మంత్రి చెప్పారు. టీ-యాప్ ఫోలియో అనే యాప్ సాధారణమైనది కాదని, దీని ద్వారా ప్రస్తుతం 150 మేర ప్రజా సేవలు అందిస్తామన్నారు. అనంతరం ఏడాది లోపు వెయ్యి సర్వీసులను ఈ యాప్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. అన్ని ప్రభుత్వ శాఖల యాప్స్‌ని ఈ టీ-యాప్ ఫోలియోకు ఇంటిగ్రేట్ చేసినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ, ఎం వాలెట్, టీ వాలెట్, హ్యాక్ ఐ లాంటి యాప్స్‌ను కూడా టీ-యాప్ ఫోలియోలో ఇంటిగ్రేట్ చేసినట్టు పేర్కొన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న టీ ఫైబర్‌తో 15జీబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ అందిస్తామని కేటీఆర్ తెలిపారు. టీ వాలెట్ ద్వారా 120 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. టెక్నాలజీ ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.టీ-యాప్ ఫోలియో లాంచింగ్ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, సివిల్ సప్లయ్ కమిషనర్ సీ వీ ఆనంద్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లకు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.