సాక్షి, హన్మకొండ అర్బన్ : జిల్లా ఖజానా శాఖ ద్వారా సుమారు 20 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు నెలవారీ పింఛన్ పొందుతున్నారు. వీరికి ప్రతినెలా సుమారు రూ. 65 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే, నిబంధనల మేరకు ప్రతీ పింఛన్‌దారు ఏటా తాను జీవించి ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని విధిగా ఖజానా అధికారులకు అందజేయాలి. ప్రస్తుతం కోవిడ్–19 నేపథ్యంలో భౌతికంగా కాకుండా 2021 మార్చి 31లోపు ప్రభుత్వ టీ యాప్ పోలియో యాప్ ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా లేదా జీవన్ ప్రమాణ్ ద్వారా అందచేయాలి. అలా అందజేసిన వారికి మాత్రమే 2021 – 2022 ఆర్థిక సంవత్సరం మొత్తం పింఛన్ అందుతుంది. లేనిపక్షంలో వచ్చే ఏడాది మే నుంచి పింఛన్ ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు.
ఇలా చేయండి..
టీ యాప్ పోలియో ద్వారా గత ఏడాది కూడా జీవన ధృవీకరణ పత్రాలను అధికారులు తీసుకున్నారు. అలా గత ఏడాది రిజిస్ట్రేషన్ చేసుకున్న పింఛన్‌దారులు ఈ ఏడాదికి నేరుగా సెల్ఫీ ద్వారా ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. గత సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకోని వారు మాత్రం నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు తమ మొబైల్ ఫోన్‌లో టీ యాప్ పోలియో తెలంగాణ ప్రభుత్వ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ నంబర్, ఈ మెయిల్ నమోదు చేస్తే పిన్ వస్తుంది. అనంతరం తెలంగాణ ప్రభుత్వ పింఛన్‌దారుడిగా చెబుతూ ఓటరు ఐడీ నంబర్ (ఎపిక్ నంబర్) లేదా బ్యాంకు అకౌంట్ నంబర్‌తో పాటు పేరు, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. వీటితో పాటు సెల్ఫీ దిగి అప్‌లోడ్ చేయాలి. అన్నీ సరిగ్గా ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత టీయాప్ పోలియో సాఫ్ట్‌వేర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో నమోదైన ఓటరు వివరాలు, ఖజానా శాఖ సాఫ్ట్‌వేర్‌లో నమోదైన వివరాలు ఫొటోలతో సహా ట్రెజరీ అధికారుల పరిశీలనకు అందుతాయి.
అక్కడ సరైనదేనని ధృవీకరించుకుని రిజిస్ట్రేషన్‌ను ఆమోదిస్తారు. ఆ తర్వాత పింఛన్‌దారులు జీవిత కాలమంతా జీవన ధృవీకరణ పత్రాన్ని ఇంట్లో నుంచి టీయాప్ పోలియో యాప్ ద్వారా సమర్పించవచ్చు. కాగా, రిజిస్ట్రేషన్ పరిశీలన పూర్తయ్యాక మొబైల్ నంబర్‌కు రిజిస్ట్రేషన్‌ను ట్రెజరీ అధికారులు ఆమోదించినట్లుగా మెసేజ్ వస్తుంది. ఆ వెంటనే మళ్లీ సెల్ఫీ దిగి తన జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. రెండోసారి దిగిన సెల్ఫీ ఫొటోతో జీవన ధృవీకరణ పత్రాన్ని నేరుగా ట్రెజరీ సాఫ్ట్‌వేర్ ఆమోదిస్తుంది. ఎవరివైనా వివరాలు లేదా ఫొటోలు రెండూ సరిగ్గా లేనప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ట్రెజరీ అధికారులు తిరస్కరిస్తారు. మళ్లీ సరిగ్గా నమోదు చేసి తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని కోసం ఎలాంటి రుసుము ఎవ్వరికీ చెల్లించాలి్సన అవసరం లేదు.
మరికొంత సమాచారం
పోస్ట్ ద్వారా వచ్చిన జీవన ధృవీకరణ పత్రాలను అధికారులు ఆమోదించరు. పత్రం సమర్పించిన తర్వాత ఎవరైనా పింఛన్‌దారులు మరణిస్తే ఆ వివరాలను కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఓటరు కార్డు లేని పింఛన్‌దారులు ఆధార్ నంబర్ ద్వారా సమీప మీ సేవా కేంద్రానికి లేదా కేంద్ర ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ కేంద్రాలకు వెళ్లి జీవన ధృవీకరణ పత్రాన్ని అందచేయవచ్చు. ఇందుకోసం నామమాత్రపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ నంబర్ లేని వారి జీవన ధృవీకరణ పత్రం మీ సేవ కేంద్రాల్లో ఆమోదించరు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పింఛన్‌దారులు ట్రెజరీ కార్యాలయంలో తమ ఆధార్ నంబర్ నమోదు చేయించుకోవాలి. కాగా, ఓటరు కార్డు, ఆధార్ నంబర్ లేని వారితో పాటు ఆధార్ నంబరు ఉండి కూడా వేళ్లు సరిగ్గా స్కాన్ కాక జీవన ధృవీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో ఇవ్వలేని వారైతే సంబంధిత ట్రెజరీ అధికారిని కలిసి పత్రాన్ని నేరుగా అందచేయవచ్చు.
రెవెన్యూ ధ్రువీకరణ పత్రం కూడా..
జీఓ 315 ద్వారా పింఛన్ పొందుతున్న అవివాహిత మహిళలు, వితంతు మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలతో పాటు మైనర్ పింఛన్ పొందుతున్న ఫ్యామిలీ పింఛన్‌దారులు వివాహం చేసుకోనట్లు, ఉద్యోగం చేయడం లేదన్నట్లుగా రెవెన్యూ శాఖ ద్వారా ధృవీకరణ పత్రాన్ని ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలి. దివ్యాంగుల పింఛన్‌దారులు ఇటీవల(మూడేళ్ల క్రితం) తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. వీరు ధృవీకరణ పత్రాలను ట్రెజరీ కార్యాలయంలో ఇవ్వకుండా నేరుగా జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తే పింఛన్ నిలిపివేస్తారు. రెండు పింఛన్లు పొందుతున్న వారైతే ఒక దానిపైనే కరువు భత్యం పొందాల్సి ఉంటుంది. ఇలాంటి వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎక్కువగా వస్తున్న కరువు భత్యాన్నే పొందాల్సి ఉంటుంది.
విదేశాల్లో ఉంటున్నారా?
విదేశాల్లో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులు అక్కడి ఎంబసీ ద్వారా జీవన ధృవీకరణ పత్రాన్ని జిల్లా ఖజానా అధికారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. బంధువుల ద్వా రా వచ్చినా, వాట్సప్ లేదా ఫేస్‌బుక్ వీడియో కాల్ ద్వారా అందిన పత్రాలను పరిగణనలోకి తీసుకోరు. ఎంబసీ ద్వారా పంపలేనప్పుడు స్వదేశానికి వచ్చిన తర్వాత ట్రెజరీ అధికారికి పత్రాలను సమర్పించి పింఛన్ పొందొచ్చు.
కార్యాలయాలకు రావొద్దు
కోవిడ్ నేపథ్యంలో పెన్షనర్లు ఎవరూ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కార్యాలయాలకు రావొద్దు. పెన్షనర్లలో ఎక్కువ మంది 60 ఏళ్ల వయస్సు పైబడినవారు ఉంటారు. అందువల్ల వ్యక్తిగతంగా కార్యాలయాలకు వచ్చి అనారోగ్యం కొని తెచ్చుకోవద్దు. సమీపంలోని మీ సేవా కేంద్రాలు, ఇతర ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా లైఫ్ సర్టిఫికెట్ అందజేస్తే సరిపోతుంది. ఈ విషయంలో దళారుల మాటలు నమ్మి డబ్బు ఇవ్వొద్దు. ఎవరికైనా(వరంగల్ అర్బన్ జిల్లా పెన్షనర్లు) ఏదైనా సమస్యలు, సందేహాలు ఉంటే నేరుగా 77999 34090 నంబర్‌కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయవచ్చు.– గుజ్జు రాజు, జిల్లా ఖజానా లెక్కల అధికారి
Comments
Please login to add a commentAdd a comment