ప్రభుత్వం కల్పిస్తున్న ఆసరా పింఛన్ డబ్బులను గ్రామ పంచాయతీ సిబ్బంది పన్నుల కింద కోత పెడుతుండడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇంటి, నల్లా పన్నులు కుటుంబంలో ఎవరిపేరునైనా బకాయి ఉంటే చాలు.. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారుల నుంచి వసూలు చేసి రశీదు చేతిలో పెడుతున్నారు. – శాయంపేట(పరకాల)
శాయంపేట(భూపాలపల్లి): వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత, గీతకార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గతంలో రూ.200 ఇచ్చే పింఛన్ డబ్బులను తెలంగాణ సర్కారు రూ.వెయ్యికి పెంచి అందజేస్తున్నది. ఎంతో పొదుపుగా నెలరోజుల అవసరాలు తీర్చుకుంటున్నారు. పన్నుల పేరుతో పంచా యతీ సిబ్బంది పింఛన్ డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో పింఛన్ పంపిణి నిలిపివేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఇవ్వాల్సిన పింఛన్ డబ్బులను ప్రభుత్వం ఒక నెల ఆలస్యంగా అందిస్తున్నది. గతనెల చేబదులు తెచ్చుకుని కాలం వెల్లదీశారు. ఈనెల వచ్చే డబ్బులు సంక్రాంతి పండగ ఖర్చులకు పనికొస్తాయని ఆశతో ఉంటే నిరాశే ఎదురవుతోంది. గ్రామాల్లో ఇంటి, నల్లా పన్నుల పేరుతో కుటుంబంలో ఎవరిపేరునైనా పన్ను బకాయి ఉంటే చాలు.. పింఛన్ కోసం వచ్చిన లబ్ధిదారుల నుంచి వసూలు చేసి రశీదు చేతిలో పెడుతున్నారు. దీంతో పండగ పూట పస్తులు తప్పేట్టు లేవని వాపోతున్నారు.
పన్నుల వసూలు కోసమే..
గతంలో పింఛన్ డబ్బులను స్థానికంగా ఉండే పోస్టాఫీసుల్లో ఇచ్చేది. ఈ విధానాన్ని మార్పుచేసి డబ్బులను బ్యాంకులో జమచేస్తున్నారు. వాటిని పోస్ట్‌మెన్ విడిపించుకుని లబ్ధిదారులకు తన ఇంటివద్దే పంపిణీ చేస్తున్నాడు. అయితే ఈసారి కేవలం ఇంటి పన్నులు వసూలు చేసేందుకే గ్రామపంచాయతీల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి పోస్ట్‌మెన్‌ను అక్కడికే పిలిపించుకుంటున్నారు. లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు చెల్లించే క్రమంలో పంచాయతీ కార్యదర్శి లేదా సిబ్బంది వెంటనే వారికి సంబంధించిన కుటుంబసభ్యుల పన్నుల వివరాలను తీసి ఆ మొత్తం కోతపెట్టి మిగిలిన డబ్బులు, రశీదు అందజేస్తున్నారు. ఈ చర్యపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ అధికారులు కాని, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా కొన్ని గ్రామ పంచాయతీల్లో పన్ను బకాయి ఉన్న కుటుంబాల్లోని పింఛన్ లబ్ధిదారులకు చెల్లింపులు పూర్తిగా నిలిపి వేస్తున్నారు. ఈ విషయమై శనివారం పరకాల మండల సర్వసభ్య సమావేశంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. పన్ను బకాయిల పేరుతో పింఛన్ నిలివేయడం సరికాదని, వెంటనే చెల్లించాలని ఎంపీపీ సులోచన అధికారులను ఆదేశించారు.
పింఛన్ డబ్బులు వసూలు చేసే అధికారం లేదు
ఇంటి పన్నులను పింఛన్ డబ్బుల నుంచి వసూలు చేసే అధికారం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టార్గెట్ పూర్తి చేసేందుకు ఇలాంటి చర్యలకు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్పడుతున్న నా దృష్టికి వచ్చింది. లబ్ధిదారుల ఇష్టపూర్వకంగానే వారిపేరు మీది ఉంటే తీసుకోవాలని సూచించాం. పన్నుల వసూలు ఇంటింటికీ వెళ్లి వసూలు చేయాల్సి ఉంది. ఇవ్వకపోతే వారి ఆస్తులను జప్తు చేసుకునే అధికారం ఉంది. ఇలా పింఛన్ డబ్బుల్లో కోత విధంచకుండా చూస్తాం. – సరస్వతి, ఈఓపీఆర్డీ
Comments
Please login to add a commentAdd a comment