Digital Life
-
డిజి భారత్: ‘డిజిటల్’ వాడకం జిగేల్!
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటలీకరణ వేగవంతం అవుతోందనడానికి నిదర్శనంగా.. వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా వ్యాపార సంస్థలతో యూజర్లు నిర్వహించే వ్యాపార లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, అదే సమయంలో గోప్యత, భద్రతపైనా యూజర్లలో ఆందోళన ఉంటోంది. టెక్ దిగ్గజం ఐబీఎం నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చి 12–26 మధ్య నిర్వహించిన ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని వయస్సుల వారు ఎంతో కొంత డిజిటల్ మాధ్యమం ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుండగా .. 35 సంవత్సరాలకు పైబడిన వర్గాల్లో ఇది గణనీయంగా పెరిగింది. ‘కోవిడ్ నేపథ్యంలో వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా దేశీ యూజర్లు అన్ని రకాల వ్యాపారాలు, సంస్థలతో లావాదేవీలు నిర్వహించారు. ముఖ్యంగా బ్యాంకింగ్ (65 శాతం), షాపింగ్/రిటైల్ (54 శాతం) విభాగాల్లో ఈ ధోరణి అత్యధికంగా కనిపించింది‘ అని ఐబీఎం పేర్కొంది. ‘పలువురు యూజర్లు యాప్‌లను వాడటానికి ఇష్టపడకపోవడానికి ప్రధాన కారణాలు గోప్యత, భద్రతపై సందేహాలే. అయినప్పటికీ చాలా మంది ఇలాంటి ఏదో ఒక మాధ్యమాన్ని ఎంచుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో నలుగురు.. షాపింగ్ చేసేందుకు లేదా ఆర్డరు చేసేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాంను వాడటానికి ఇష్టపడటం లేదు. యాప్ లేదా వెబ్సైట్లో గోప్యతపై (40 శాతం), భద్రతపై (38 శాతం) సందేహాలు ఇందుకు కారణం‘ అని నివేదిక తెలిపింది. అయితే, మహమ్మారి వ్యాప్తి సమయంలో డిజిటల్ లావాదేవీలందించే సౌకర్యానికి చాలా మంది వినియోగదారులు కాస్త అలవాటు పడినట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోందని ఐబీఎం టెక్నాలజీ సేల్స్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సేల్స్ లీడర్ ప్రశాంత్ భత్కల్ తెలిపారు. కరోనా పూర్వ స్థాయికి పరిస్థితులు తిరిగి వచ్చినా ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయని వివరించారు. భారత్ సహా 22 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 22,000 మంది (ఒక్కో దేశంలో 1,000 మంది) పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు.. మహమ్మారి వ్యాప్తి సమయంలో దేశీ యూజర్లు వివిధ కేటగిరీల్లో సుమారు 19 కొత్త ఆన్లైన్ ఖాతాలు తెరిచారు. సోషల్ మీడియా, వినోదం కోసం సగటున 3 కొత్త ఖాతాలు తీసుకున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు వివిధ కేటగిరీల్లో దాదాపు 27 కొత్త ఆన్లైన్ ఖాతాలు తెరిచారు. ఒక్కో కేటగిరీలో మిగతా వయస్సుల వారికన్నా ఎక్కువ అకౌంట్లు తెరిచారు. దాదాపు సగం మంది (47 శాతం) భారతీయ యూజర్లు చాలా సందర్భాల్లో ఇతర అకౌంట్లకు కూడా ఒకే రకం లాగిన్ వివరాలను ఉపయోగిస్తున్నారు. ఇక 17 శాతం మంది కొత్త, పాత వివరాలు కలిపి ఉపయోగిస్తున్నారు. 35-49 ఏళ్ల మధ్య వారిలో దాదాపు సగం మంది యూజర్లు ఇతర అకౌంట్లకు ఉపయోగించిన క్రెడెన్షియల్స్‌నే మళ్లీ మళ్లీ వాడుతున్నారు. వెబ్సైట్ లేదా యాప్ భద్రతపై సందేహాలు ఉన్నప్పటికీ జనరేషన్ జెడ్ తరం (1990ల తర్వాత, 2000 తొలినాళ్లలో పుట్టిన వారు) మినహా 57 శాతం మంది యూజర్లు.. భౌతికంగా స్టోర్‌కి వెళ్లడం లేదా ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ చేయడం కన్నా డిజిటల్‌గా ఆర్డరు, చెల్లింపులు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము సందర్శించే యాప్‌లు, వెబ్సైట్లను ఇతర యాప్‌లు ట్రాక్ చేసేందుకు యూజర్లు ఇష్టపడటం లేదు. ట్రాకింగ్‌కు సంబంధించి పలు యాప్‌లకు అనుమతులు నిరాకరించినట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పైగా వెల్లడించారు. తమ వ్యక్తిగత డేటా భద్రంగా ఉంచుతాయని యూజర్లు అత్యధికంగా నమ్ముతున్న కేటగిరీల సంస్థల్లో హెల్త్‌కేర్ (51 శాతం), బ్యాంకింగ్/ఆర్థిక సంస్థలు (56%) ఉన్నాయి. సోషల్ మీడియాపై యూజర్లు అత్యంత అపనమ్మకంతో ఉన్నారు. -
లైఫ్ సర్టిఫికెట్ ఇస్తేనే పింఛన్
సాక్షి, హన్మకొండ అర్బన్ : జిల్లా ఖజానా శాఖ ద్వారా సుమారు 20 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు నెలవారీ పింఛన్ పొందుతున్నారు. వీరికి ప్రతినెలా సుమారు రూ. 65 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే, నిబంధనల మేరకు ప్రతీ పింఛన్‌దారు ఏటా తాను జీవించి ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని విధిగా ఖజానా అధికారులకు అందజేయాలి. ప్రస్తుతం కోవిడ్–19 నేపథ్యంలో భౌతికంగా కాకుండా 2021 మార్చి 31లోపు ప్రభుత్వ టీ యాప్ పోలియో యాప్ ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా లేదా జీవన్ ప్రమాణ్ ద్వారా అందచేయాలి. అలా అందజేసిన వారికి మాత్రమే 2021 – 2022 ఆర్థిక సంవత్సరం మొత్తం పింఛన్ అందుతుంది. లేనిపక్షంలో వచ్చే ఏడాది మే నుంచి పింఛన్ ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేయండి.. టీ యాప్ పోలియో ద్వారా గత ఏడాది కూడా జీవన ధృవీకరణ పత్రాలను అధికారులు తీసుకున్నారు. అలా గత ఏడాది రిజిస్ట్రేషన్ చేసుకున్న పింఛన్‌దారులు ఈ ఏడాదికి నేరుగా సెల్ఫీ ద్వారా ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. గత సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకోని వారు మాత్రం నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు తమ మొబైల్ ఫోన్లో టీ యాప్ పోలియో తెలంగాణ ప్రభుత్వ యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ నంబర్, ఈ మెయిల్ నమోదు చేస్తే పిన్ వస్తుంది. అనంతరం తెలంగాణ ప్రభుత్వ పింఛన్దారుడిగా చెబుతూ ఓటరు ఐడీ నంబర్ (ఎపిక్ నంబర్) లేదా బ్యాంకు అకౌంట్ నంబర్‌తో పాటు పేరు, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. వీటితో పాటు సెల్ఫీ దిగి అప్లోడ్ చేయాలి. అన్నీ సరిగ్గా ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత టీయాప్ పోలియో సాఫ్ట్వేర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో నమోదైన ఓటరు వివరాలు, ఖజానా శాఖ సాఫ్ట్‌వేర్‌లో నమోదైన వివరాలు ఫొటోలతో సహా ట్రెజరీ అధికారుల పరిశీలనకు అందుతాయి. అక్కడ సరైనదేనని ధృవీకరించుకుని రిజిస్ట్రేషన్‌ను ఆమోదిస్తారు. ఆ తర్వాత పింఛన్‌దారులు జీవిత కాలమంతా జీవన ధృవీకరణ పత్రాన్ని ఇంట్లో నుంచి టీయాప్ పోలియో యాప్ ద్వారా సమర్పించవచ్చు. కాగా, రిజిస్ట్రేషన్ పరిశీలన పూర్తయ్యాక మొబైల్ నంబర్‌కు రిజిస్ట్రేషన్‌ను ట్రెజరీ అధికారులు ఆమోదించినట్లుగా మెసేజ్ వస్తుంది. ఆ వెంటనే మళ్లీ సెల్ఫీ దిగి తన జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. రెండోసారి దిగిన సెల్ఫీ ఫొటోతో జీవన ధృవీకరణ పత్రాన్ని నేరుగా ట్రెజరీ సాఫ్ట్వేర్ ఆమోదిస్తుంది. ఎవరివైనా వివరాలు లేదా ఫొటోలు రెండూ సరిగ్గా లేనప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ట్రెజరీ అధికారులు తిరస్కరిస్తారు. మళ్లీ సరిగ్గా నమోదు చేసి తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని కోసం ఎలాంటి రుసుము ఎవ్వరికీ చెల్లించాలి్సన అవసరం లేదు. మరికొంత సమాచారం పోస్ట్ ద్వారా వచ్చిన జీవన ధృవీకరణ పత్రాలను అధికారులు ఆమోదించరు. పత్రం సమర్పించిన తర్వాత ఎవరైనా పింఛన్‌దారులు మరణిస్తే ఆ వివరాలను కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఓటరు కార్డు లేని పింఛన్‌దారులు ఆధార్ నంబర్ ద్వారా సమీప మీ సేవా కేంద్రానికి లేదా కేంద్ర ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ కేంద్రాలకు వెళ్లి జీవన ధృవీకరణ పత్రాన్ని అందచేయవచ్చు. ఇందుకోసం నామమాత్రపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ నంబర్ లేని వారి జీవన ధృవీకరణ పత్రం మీ సేవ కేంద్రాల్లో ఆమోదించరు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పింఛన్‌దారులు ట్రెజరీ కార్యాలయంలో తమ ఆధార్ నంబర్ నమోదు చేయించుకోవాలి. కాగా, ఓటరు కార్డు, ఆధార్ నంబర్ లేని వారితో పాటు ఆధార్ నంబరు ఉండి కూడా వేళ్లు సరిగ్గా స్కాన్ కాక జీవన ధృవీకరణ పత్రాన్ని ఆన్లైన్లో ఇవ్వలేని వారైతే సంబంధిత ట్రెజరీ అధికారిని కలిసి పత్రాన్ని నేరుగా అందచేయవచ్చు. రెవెన్యూ ధ్రువీకరణ పత్రం కూడా.. జీఓ 315 ద్వారా పింఛన్ పొందుతున్న అవివాహిత మహిళలు, వితంతు మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలతో పాటు మైనర్ పింఛన్ పొందుతున్న ఫ్యామిలీ పింఛన్‌దారులు వివాహం చేసుకోనట్లు, ఉద్యోగం చేయడం లేదన్నట్లుగా రెవెన్యూ శాఖ ద్వారా ధృవీకరణ పత్రాన్ని ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలి. దివ్యాంగుల పింఛన్‌దారులు ఇటీవల(మూడేళ్ల క్రితం) తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. వీరు ధృవీకరణ పత్రాలను ట్రెజరీ కార్యాలయంలో ఇవ్వకుండా నేరుగా జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తే పింఛన్ నిలిపివేస్తారు. రెండు పింఛన్లు పొందుతున్న వారైతే ఒక దానిపైనే కరువు భత్యం పొందాల్సి ఉంటుంది. ఇలాంటి వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎక్కువగా వస్తున్న కరువు భత్యాన్నే పొందాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉంటున్నారా? విదేశాల్లో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులు అక్కడి ఎంబసీ ద్వారా జీవన ధృవీకరణ పత్రాన్ని జిల్లా ఖజానా అధికారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. బంధువుల ద్వా రా వచ్చినా, వాట్సప్ లేదా ఫేస్బుక్ వీడియో కాల్ ద్వారా అందిన పత్రాలను పరిగణనలోకి తీసుకోరు. ఎంబసీ ద్వారా పంపలేనప్పుడు స్వదేశానికి వచ్చిన తర్వాత ట్రెజరీ అధికారికి పత్రాలను సమర్పించి పింఛన్ పొందొచ్చు. కార్యాలయాలకు రావొద్దు కోవిడ్ నేపథ్యంలో పెన్షనర్లు ఎవరూ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కార్యాలయాలకు రావొద్దు. పెన్షనర్లలో ఎక్కువ మంది 60 ఏళ్ల వయస్సు పైబడినవారు ఉంటారు. అందువల్ల వ్యక్తిగతంగా కార్యాలయాలకు వచ్చి అనారోగ్యం కొని తెచ్చుకోవద్దు. సమీపంలోని మీ సేవా కేంద్రాలు, ఇతర ఆన్లైన్ పద్ధతుల ద్వారా లైఫ్ సర్టిఫికెట్ అందజేస్తే సరిపోతుంది. ఈ విషయంలో దళారుల మాటలు నమ్మి డబ్బు ఇవ్వొద్దు. ఎవరికైనా(వరంగల్ అర్బన్ జిల్లా పెన్షనర్లు) ఏదైనా సమస్యలు, సందేహాలు ఉంటే నేరుగా 77999 34090 నంబర్‌కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయవచ్చు.– గుజ్జు రాజు, జిల్లా ఖజానా లెక్కల అధికారి -
పదివేల టవర్లతో ఏపీలోదూసుకుపోతున్న జియో
సాక్షి, విజయవాడ : భారతదేశ వ్యాప్తంగా జియో సృష్టించిన డిజిటల్ సేవలను ఆంధ్రప్రదేశ్ వాసులకు మరింత అందుబాటులో తీసుకొచ్చామని రిలయన్స్ జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. సమగ్రమైన మొబైల్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిబడిన నేపథ్యంలో ఈ డిజిటల్ విప్లవం రాష్ట్ర ప్రజానికానికి మరింత చేరువైందనీ, ఆంధ్రప్రదేశ్ లో 10వేల మొబైల్ టవర్ల కీలక మైలురాయిని చేరుకున్నామిన వెల్లడించింది. తద్వారా నెట్వర్క్ పరంగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నామని పేర్కొంది.జియో నెట్వర్క్ పరిధిని మరింత విస్తరించుకుని రాష్ట్రంలోని ప్రతి ఇంటిని చేరుకోవడంతాటు, వారందరికీ జియో డిజిటల్ లైఫ్ ప్రయోజనాలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది. జియో వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13.07 మిలియన్ల మంది చందాదారులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సేవలను పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల జియో ప్రతి జిల్లా నుంచి అనేక మంది చందాదారులను తన ఖాతాలో జమచేసుకుంది. ప్రతిపౌరుడికి డేటా అనే లక్ష్యంతో 34 నెలల క్రితం జియో సేవలు ప్రారంభం అయ్యాయి. భారతదేశానికి చెందిన డిజిటల్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయడంలో జియో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. కాగా ఉచిత కాలింగ్ సేవలు, డాటా సేవలతో టెలికాం రంగంలోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో అతి స్వల్ప కాలంలోనే అతి ఎక్కువ వినియోగదారులనుసొంతం చేసుకుంది. అలాగే ప్రపంచంలోనే అతి ఎక్కువ మొబైల్ డాటా వినియోగదారులతో భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపింది. ఏప్రిల్ 2019 ట్రాయ్ గణాంకాల ప్రకారం, 314.8 మిలియన్ల చందాదారులను జియో కలిగి ఉంది. జియో డిజిటల్ లైఫ్ ప్రయోజనాలు జియో వినియోగదారులందరికీ సాటిలేని కనెక్టివిటీ సౌలభ్యం, 4జీ నెట్వర్క్ యొక్క శక్తివంతమైన మరియు విస్తృత శ్రేణి నెట్ వర్క్‌తో ఉత్తమ సేవలు. జియో అన్లిమిటెడ్ వాయిస్, డాటా ప్రయోజనాలు జియో ప్రీమియం యాప్స్ ప్రయోజనాలు పొందే అవకాశం, జియో టీవీ (అత్యంత జనాదరణ పొందిన క్యాచ్ ఆప్ టీవీ యాప్), జియో మ్యూజిక్, జియో సినిమా సహా మరెన్నింటినో ఆనందించవచ్చు. జియో సిమ్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంచడం. జియో సేవలను సులభంగా, సౌకర్యవంతంగా పొందేలా తీర్చిదిద్దడం. -
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ గడువు పెంపు
న్యూఢిల్లీ: పింఛన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ రూపంలో సమర్పించేం దుకు ఈపీఎఫ్ఓ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో ఏర్పడిన రద్దీ దృష్ట్యా ఈ గడువును గత నవంబర్‌లో జనవరి 15 వరకు పెంచిన సంగతి తెలిసిందే. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణకు ఆధార్‌ను తప్పనిసరి చేశామని, బ్యాంకుల ద్వారా వీటిని భౌతికంగా స్వీకరించే విధానాన్ని తొలగించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మొబైల్ ఫోన్లు లేదా ఉమ్మడి సేవా కేంద్రాలు (సీఎస్సీ) లేదా ప్రత్యేక బ్యాంకు శాఖల ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ రూపంలో సమర్పించాలని సూచించారు. మొబైల్ఫోన్లలో జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ ఈ సర్టిఫికెట్‌ను అంగీకరిస్తుంది. లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించని పింఛన్‌దారులకు పెన్షన్ ఆగిపోతుంది.