సెల్ఫీతో లైఫ్‌ సర్టిఫికెట్‌ | Life Certificate Arranged To Pensioners | Sakshi
Sakshi News home page

సెల్ఫీతో లైఫ్‌ సర్టిఫికెట్‌

Published Thu, Apr 4 2019 4:54 PM | Last Updated on Thu, Apr 4 2019 4:55 PM

Life Certificate Arranged To Pensioners - Sakshi

టీయాప్‌–ఫోలియో లోగో 

సాక్షి, కాజీపేట అర్బన్‌: ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ఉద్యోగులు పెన్షన్‌దారులుగా వృద్ధాప్యంలో తమ శేష జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రభుత్వం పెన్షన్‌ అందిస్తోంది. కాగా ప్రతి ఏడాది నవంబర్‌ 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు పెన్షన్‌దారుడు లైఫ్‌ సర్టిఫికెట్‌ను సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో లేదా బ్యాంకులో అందజేస్తే సంబంధిత అధికారులు పెన్షన్‌దారుడు జీవించి ఉన్నట్లుగా ధృవీకరించి పెన్షన్‌ అందజేస్తారు. ఒకవేళా పెన్షన్‌దారుడు ట్రెజరీ కార్యాలయం, బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జీవన్‌ ప్రమాణ్‌ వెబ్‌సైట్‌లో లేదా మీ–సేవా కేంద్రానికి వెళ్లి ఆధార్‌ ఆధారిత లైఫ్‌ సర్టిఫికేట్‌ను అందజేయాలి. ఇందుకు రూ.30 చెల్లించాలి. సకాలంలో లైఫ్‌ సర్టిఫికెట్‌ అందజేయకపోతే పెన్షన్‌ నిలపి వేయబడుతుంది. దీంతో పెన్షన్‌దారుడికి టెన్షన్‌ మొదలవుతుంది. 


పెన్షన్‌దారులకు వరంలా..
నేటి ఆధునిక యుగంలో మారుతున్న టెక్నాలజీ వృద్ధాప్యానికి చేరుకున్న పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం టీయాప్‌–ఫోలియో వరంగా మారనుంది. ఇంట్లో ఉంటునే కేవలం ఒక సెల్ఫీ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ను అందజేసే విధంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం టీ యాప్‌ ఫోలియోకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల యాబై వేల మంది, ఉమ్మడి వరంగల్‌లో సుమారు ఇరవై వేల మంది పెన్షన్‌దారులకు లైఫ్‌ సర్టిఫికెట్‌ అందజేయడంలో చాలా ఈజీగా మారనుంది.


యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
పెన్షన్‌దారులు తొలుత తమ ఆండ్రాయిడ్‌ మొబైల్‌లోని ప్లే స్టోర్‌ నుంచి టీ యాప్‌–ఫోలియోను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మొబైల్‌ నెంబర్, ఈ–మెయిల్‌ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. యూజర్‌ ఐడీగా మొబైల్‌ నెంబర్‌ స్వీకరిస్తుంది. ఎంపీన్‌ను పాస్‌వర్డ్‌గా సెలెక్ట్‌ చేసుకోవాలి. మొబైల్‌ నెంబర్, పాస్‌వర్డ్‌లను ఎంటర్‌ చేయడం ద్వారా టీ–యాప్‌ ఫోలియోలోకి లాగిన్‌ అవుతారు. యాప్‌లోకి ప్రవేశించిన అనంతరం పెన్షనర్‌ అన్యూవల్‌ వెరిఫికేషన్‌ ఆప్షన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ అనే అప్షన్‌ను క్లిక్‌ చేయాలి. బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ లేదా పెన్షనర్‌ ఐడీ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ఎలక్షన్‌ ఓటర్‌ ఈపీక్‌ నెంబర్‌ , అసెంబ్లీ నియోజకవర్గం పేరును ఎంటర్‌ చేయాలి. అనంతరం పెన్షన్‌దారుడు ఒక సెల్ఫీ దిగి పంపించాలి. సెల్ఫీ ఫోటో జనాభా లెక్కల (ఓటర్‌ ఐడీ)తో సరిపోలితే ఆమోదం పొందినట్లుగా ధృవీకరిస్తూ ఒక మెసేజ్, రిఫరెన్స్‌ నెంబర్‌ వస్తుంది. పెన్షన్‌దారుడికి అందిన మెసేజ్‌ సంబంధిత ట్రెజరరీ, బ్యాంకు అధికారికి చేరడంతో లైఫ్‌ సర్టిఫికెట్‌ అందించినట్లుగా భావిస్తారు. దీంతో పెన్షన్‌దారులకు లైఫ్‌ సర్టిఫికేట్‌ అందించడంలో ఏర్పడే కష్టాల నుంచి ఒక సెల్ఫీతో ఊరట లభించనుంది.

సద్వినియోగం చేసుకోవాలి...
పెన్షన్‌దారులు ప్రభుత్వం, ట్రెజరరీ శాఖ ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫేస్‌ రికాగనైజేషన్‌ టెక్నాలజీ ద్వారా మొట్టమొదటి సారిగా పెన్షన్‌దారుడు టీయాప్‌–ఫోలియో సౌజన్యంతో సెల్ఫీ అందిస్తే కార్యాలయంలోని రికార్డుల ఆధారంగా ఆమోదం అందిస్తాం. ఒక్క సారి ఆమోదం పొందిన పెన్షన్‌దారుడు తర్వాత ఏడాది నుంచి లైఫ్‌ సర్టిఫికెట్‌ అందజేయకపోయినా ఆటోమెటిక్‌గానే ఆమోదం పొందుతారు.
- గుజ్జురాజు, ఉప సంచాలకులు, జిల్లా ఖజానా కార్యాలయం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement