తెలుగు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు విముక్తి
గత ఏడాది లిబియాలో కిడ్నాప్ అయిన తెలుగు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన టి.గోపాలకృష్ణ, తెలంగాణకు చెందిన సి.బలరాం కిషన్ సురక్షితంగా విడుదల కావడంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. కిడ్నాపర్లు ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను విడుదల చేసినట్లు ఆమె తెలిపారు. సుమారు ఏడాదికిపైగా బందీలుగా ఉన్నవారు సురక్షితంగా విడుదలైనట్లు తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నట్లు సుష్మ గురువారం ట్విట్ చేశారు.
2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ లిబియాలోని సిర్టే యూనివర్శిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్ సమీపంలో వారు కిడ్నాప్ కు గురయ్యారు. వారిలోని కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను రెండురోజుల్లోనే వదిలేసిన ఉగ్రవాదులు.. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరామ కిషన్, శ్రీకాకుళం టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణలను మాత్రం చెరలోనే ఉంచారు. వారి విడుదలకోసం లిబియా దేశ రాయబారితో అప్పట్నుంచీ కేంద్రం చర్చలు జరుపుతూనే ఉంది. తమవారి జాడకోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సుమారు ఏడాదికాలం చూసిన వారి ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు బందీలుగా ఉన్నగోపీకృష్ణ, బలరామకిషన్ లు సురక్షితంగా విడుదలవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారి కుటుంబాల్లో సంబరాలు చేసుకున్నారు. ప్రొఫెసర్ల విడుదలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సుష్మాస్వరాజ్ కు తన ట్వీట్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
I am happy to inform that T Gopalakrishna (AP) & C BalaramKishan (Telangana) who were captive in Libya since 29 July 2015 have been rescued.
— Sushma Swaraj (@SushmaSwaraj) 15 September 2016