T mass forum
-
ఆంధ్రా సెటిలర్స్‌కు అండగా ఉంటాం: ఐలయ్య
హైదరాబాద్: ఆంధ్రా సెటిలర్స్‌కు అండగా ఉంటా మని, టీఆర్ఎస్ భయపెడితే వారు భయపడాల్సిన అవసరం లేదని టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రావాళ్లపై టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తోందని, కేసీఆర్, కేటీఆర్ వాడే భాష సరైంది కాదన్నారు. కార్యక్రమంలో టీమాస్ ఫోరం కన్వీనర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ దొరల చేతిలో అధికారం పెట్టొద్దు: ఐలయ్య
నిర్మల్ అర్బన్: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయొద్దని.. మళ్లీ దొరల చేతిలో అధికారం పెట్టవద్దని టీమాస్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం‘ఓటు హక్కు–ఎన్నికల సంస్కరణ’పై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని వర్గాల ప్రజలు త్యాగాలు చేశారని, కానీ సామాజిక తెలంగాణ రాకుండా వెలమ, రెడ్ల చేతుల్లోకి అధికారం వెళ్లిందన్నారు. ఈసారి వారిని గెలవనీయవద్దని చెప్పారు. ఉద్యమాన్ని తమ ఆటపాటల ద్వారా ఉవ్వెత్తున నిలిపిన గద్దర్, విమలక్కలకు మద్దతునిస్తూ కేసీఆర్, కేటీఆర్‌లపై పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. టీమాస్ అధికారంలోకి వస్తే సోషలిస్ట్ వెల్ఫేర్ ఎజెండాను అమలు చేస్తామని, ఎమ్మెల్యేల వేతనాలను ఎత్తేస్తామని, రూ.3కే టిఫిన్, రూ.5 బహుజన బువ్వ, ఇంటర్మీడియెట్‌ను రద్దు చేసి కేజీ నుంచి 12వ తరగతి వరకు గ్రామంలోనే ఆంగ్లబోధన అందేలా చూస్తామని వివరించారు. -
కాంగ్రెస్, టీ–మాస్ నేతల బాహాబాహీ
అంబర్‌పేట: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో కాంగ్రెస్, టీ–మాస్ ఫోరం నేతల మధ్య జరిగిన వాగ్వాదం దాడులకు దారితీసింది. దీంతో కార్యక్రమంలో అంబర్పేట్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బుధవారం అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తాలోని పూలే విగ్రహం వద్ద జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పూలే విగ్రహం వద్ద కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఏటా పూలే జయంతి సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. బుధవారం కాంగ్రెస్ నాయకులకంటే ముందే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించి వెళ్లారు. అనంతరం పలువురు టీ–మాస్ ఫోరం నేతలు అక్కడే ఉన్న మైక్ తీసుకుని పూలే సేవలపై ప్రసంగాలు చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వీహెచ్ తన దైనశైలిలో ‘ఇదేమీ ప్రసంగాలు రా..బై ఇక్కడ మీ సభ ఎందిరా బై’..అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. దీని టీ–మాస్ నేతలు శ్రీరాములు నాయక్, అశయ్య, బాకృష్ణ ప్రతిస్పందించడంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి పరస్పర దాడులకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో వీహెచ్ కిందపడడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను పక్కకు తీసుకువెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం టీ–మాస్ ఫోరం నేతలు వీహెచ్‌పై అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కాంగ్రెస్ నేతలు సైతం టీ–మాస్ నేతలపై సౌండ్ నిర్వహకునితో ఫిర్యాదు చేయించారు. -
పార్లమెంట్ స్థానాల్లో సాంస్కృతిక ఉద్యమం
జూలై 4న ‘టీ మాస్ ఫోరమ్’ ఆవిర్భావ సభ: గద్దర్ సాక్షి, హైదరాబాద్: సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (సికా) ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రజాగాయకుడు గద్దర్ చెప్పారు. సినీనటుడు రజనీకాంత్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలసి పనిచేయాలని భావిస్తున్నామన్నారు. తమ ప్రతినిధులు వెళ్లి వారికి తమ విధానాలను వివరించారని, రజనీ కాంత్, పవన్ అంగీకారంకోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. 200 పార్లమెంట్ స్థానాల్లో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. జూలై 4వ తేదీన హైదరాబాద్‌లో టీమాస్ ఫోరమ్ పేరుతో ఏర్పడనున్న ఐక్యవేదిక పోస్టర్‌ను గురువారం ఆయన ఎస్వీకేలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి ఆవిష్కరించారు.