t. padma rao goud
-
ముంబైసే ఆయా మేరా దోస్త్
సాక్షి, హైదరాబాద్: వారిద్దరు బాల్యమిత్రులు. పుట్టింది మొదలు 20 ఏళ్ల వయసు వరకు ఇరువురు సికింద్రాబాద్ మోండా మార్కెట్లో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో బాల్యమిత్రుల్లో ఒకరు కుటుంబంతో సహా మకాం మార్చారు. అప్పట్లో ఫోన్ల సదుపాయం లేని కారణంగా స్నేహబంధం దూరమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వీరిద్దరిని తిరిగి ఫేస్బుక్ దగ్గర చేసింది. సోమవారం రాత్రి ఇరువురు మిత్రులు శంషాబాద్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఇందులో ఒకరు రిటైర్డు ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి కాగా ఇంకొకరు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్. మోండాలోని టకారాబస్తీలో మంత్రి పద్మారావు పుట్టి పెరిగారు. ముంబై నుంచి కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్టియన్ కుటుంబం నగరానికి వలస వచ్చింది. మోండా మార్కెట్లో స్థిరపడిన ఆ కుటుంబంలో జన్మించిన వ్యక్తి జాకబ్ విక్టర్. పద్మారావుగౌడ్, జాకబ్‌విక్టర్ ఇరువురు బాల్యమిత్రులు. 20 ఏళ్ల వయసులో జాకబ్ విక్టర్‌కు ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబం ముంబైకి తరలివెళ్లింది. నాలుగు దశాబ్దాలుగా ఇరువురు కలుసుకోలేకపోయారు. ఫేస్బుక్ చూస్తుండగా... ఎయిర్‌ఫోర్స్‌లో పదవీ విరమణ చేసిన జాకబ్ విక్టర్ కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్ పరిశీలిస్తుండగా మంత్రి పద్మారావు ఫొటోలు కనిపించాయి. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఎక్సైజ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మారావుగౌడ్ తన బాల్యమిత్రుడేనని గుర్తించిన జాకబ్‌విక్టర్ అందులోని ఫోన్‌నెంబర్‌కు కాల్చేశాడు. ఫోన్ రిసీవ్ చేసుకున్న మంత్రి పీఆర్ఓ కలకోట వెంకటేశ్ జాకబ్ ముంబై నుంచి ఫోన్ చేసిన విషయాన్ని మంత్రికి చేరవేశారు. బాల్యమిత్రుడి ఆచూకీ లభించడంతో హర్షం వ్యక్తం చేసిన పద్మారావుగౌడ్ హైదరాబాద్ రావాల్సిందిగా జాకబ్ విక్టర్‌ను ఆహ్వానించారు. స్వయంగా మంత్రి స్వాగతం... సోమవారం రాత్రి ముంబై నుంచి నగరానికి చేరుకున్న జాకబ్ విక్టర్‌కు మంత్రి పద్మారావు స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. టకారాబస్తీలోని మంత్రి నివాసంలో బసచేసిన జాకబ్ విక్టర్ మంగళవారం మంత్రి పద్మారావుతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లతో బాల్యం నాటి ముచ్చట్లను ఇరువురు పంచుకున్నారు. -
అమెరికాలో మద్యం విక్రయాలపై మంత్రి పరిశీలన
సాక్షి, హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ గురువారం న్యూయార్క్‌లోని మద్యం దుకాణాలను పరిశీలించారు. మద్యం తయారీ, విక్రయాలు జరిగే తీరును ఆయన తెలుసుకున్నారు. అమెరికాలో మద్యం ధరలు, మన రాష్ట్రంలో ధరలకు మధ్య తేడాలను పరిశీలించారు. మంత్రి వెంట ప్రత్యేకాధికారి రాజేశ్వర్‌రావు ఉన్నారు. -
గుడుంబాపై ఉక్కుపాదం
♦ ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ ♦ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబా అమ్మకాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ తెలిపారు. ఎనిమిది జిల్లా ల్లో గుడుంబా విక్రయాలను పూర్తిగా అరికట్టామని, హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా గుడుంబా తయారీ, అమ్మకాలు లేకుండా చేసి తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొం దించిన 2016 డైరీ, క్యాలెండర్లను సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు గుడుంబా తయారీ, అమ్మకాలే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉపాధి కోల్పోయినట్లుగా తన దృష్టికి వచ్చిం దని అన్నారు. అలాంటి కుటుంబాలను ఆదుకొని వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, బదిలీలపై తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి.రవీందర్రావు, ఇతర నాయకులు డి.అరుణ్‌కుమార్, సత్యనారాయణ, విష్ణువర్ధన్ రావు, కృష్ణయాదవ్, వెంకటయ్య, జూపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌ను గులాబీరంగు మయం చేసి...
హైదరాబాద్: ఈ నెల 24న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు తెలిపారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఈ ప్లీనరీ సమావేశాలకు దాదాపు 40 వేల మంది హాజరవుతారని వెల్లడించారు. ఈ ప్లీనరీలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌ను గులాబీరంగు మయం చేసి గ్రేటర్లో టీఆర్ఎస్ సత్తా చాటుతామని పద్మారావు స్పష్టం చేశారు. -
ఎమ్మార్పీ రేట్లకే మద్యం: పద్మారావు
హైదరాబాద్: దసరాకల్లా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరిపిస్తామని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గీత కార్మికులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గీత కార్మికులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో మంళగవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్‌లో 107 వైన్స్ షాపుల నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. మరోసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫునే ఆ షాపులను నిర్వహిస్తామని వెల్లడించారు. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్మేలా చర్యలు చేపడతామని పద్మారావు తెలిపారు. -
గ్రేటర్లో మరిన్ని కొత్త బార్లు!
* తెలంగాణలో మొత్తం బార్ల సంఖ్య 726 * గ్రేటర్ పరిధిలోనే 350కిపైగా బార్ లెసైన్స్‌లు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లోని మద్యం ప్రియులకు ఇది శుభవార్తే! వైన్‌షాపుల ముందు రోడ్లపై నిలబడి హడావుడిగా కాకుండా నిమ్మలంగా కూర్చొని తాగేందుకు కొత్తగా మరిన్ని బార్లకు లెసైన్స్‌లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 726 బార్లు ఉంటే, అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 350కిపైగా బార్ లెసైన్సులు ఉన్నాయి. రాజధానిలో ఉన్న డిమాండ్, 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని మరిన్ని బార్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాల్లో మాత్రం బార్ల సంఖ్యను పెంచరాదని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రాష్ట్రంలో కొత్త సర్కార్ మద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్న అపవాదు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మీనా, కమిషనర్ నదీం అహ్మద్ తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విమర్శలకు తావులేని బార్ పాలసీని ప్రకటించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. దీంతో గురు, శుక్రవారాల్లో అధికారికంగా పాలసీని ప్రకటిస్తూ జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. జూలై ఒకటి నుంచి కొత్త పాలసీ అమలు ఈనెలాఖరుతో ప్రస్తుతమున్న ఎక్సైజ్ పాలసీ గడువు ముగుస్తున్నందున జూలై ఒకటి నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తేవలసి ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో ఇప్పటికే గత 14న రిటైల్ అమ్మకాల కోసం మద్యం పాలసీ తీసుకొచ్చి, డ్రా పద్ధతిలో వైన్‌షాపుల కేటాయింపు కూడా పూర్తి చేశారు. ఇక నూతన బార్ పాలసీ రావలసి ఉన్నా, సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు బుధవారం రాత్రి సీఎంతో ఎక్సైజ్ మంత్రి, అధికారులు సమావేశమై నూతన పాలసీకి ఆమోద ముద్ర వేయించుకున్నారు. యథాతథంగా లెసైన్స్ ఫీజు తెలంగాణకు కొత్త బార్ పాలసీ తీసుకువస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న లెసైన్స్ ఫీజులను పెంచకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అధికార యంత్రాంగం కూడా లెసైన్స్ ఫీజును పెంచడం వల్ల వైన్‌షాపుల తరహాలోనే బార్లను తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకురారని ప్రభుత్వానికి వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బార్ల లెసైన్స్ ఫీజు ఉన్నట్టుగానే నాలుగు స్లాబుల్లో కొనసాగించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్టు సమాచారం. కాగా లెసైన్స్ ఫీజు కన్నా 6 రెట్ల విలువైన మద్యాన్ని బార్లలో ఎలాంటి ప్రివిలేజ్ ఫీజు లేకుండా అమ్మవచ్చు. ఆరు రెట్లు దాటితే 9 శాతం నుంచి 16 శాతం వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. గ్రేటర్లో 16 శాతం ప్రివిలేజ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఓ బార్ యజమాని ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాల్లో డిమాండ్ ఉన్నా... రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం మినహాయిస్తే ఎక్కువ శాతం బార్లు పెద్ద మునిసిపాలిటీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక మునిసిపాలిటీల్లో బార్ల కోసం డిమాండ్ ఉంది. అయితే కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బార్లకు గేట్లు తీసిందన్న అపవాదు వస్తుందన్న కారణంగా జిల్లాల్లో కొత్తగా బార్ లెసైన్స్‌లు ఇవ్వరాదని నిర ్ణయించినట్లు సమాచారం. బుధవారం సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. 170 వైన్‌షాపులపై కమిషనర్ నదీం అహ్మద్ ఆరా! వైన్‌షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్ నదీం అహ్మద్ బుధవారం అన్ని జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. గతంతో పోలిస్తే వైన్‌షాపులకు మంచి డిమాండ్ వచ్చినప్పటికీ, 170 దుకాణాలను ఎవరూ తీసుకోకపోవడానికి గల కారణాలపై చర్చించారు. ఎక్కడైనా వ్యాపారులు సిండికేటై షాపులకు దరఖాస్తులు రాకుండా చేశారా అన్న కోణంలో కూడా కమిషనర్ వివరాలు రాబట్టినట్లు తెలిసింది. దరఖాస్తుల ద్వారా రూ. 50 కోట్లు, తొలివిడత లెసైన్స్ ఫీజు రూపంలో దాదాపు రూ. 300 కోట్లు ఆదాయంగా సమకూరింది. కాగా, దరఖాస్తులు రాని దుకాణాలకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్ నిర్ణయించినట్లు సమాచారం. అదనపు కమిషనర్ వెంకటస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.