గుడుంబాపై ఉక్కుపాదం
♦ ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్
♦ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబా అమ్మకాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ తెలిపారు. ఎనిమిది జిల్లా ల్లో గుడుంబా విక్రయాలను పూర్తిగా అరికట్టామని, హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా గుడుంబా తయారీ, అమ్మకాలు లేకుండా చేసి తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొం దించిన 2016 డైరీ, క్యాలెండర్‌లను సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు గుడుంబా తయారీ, అమ్మకాలే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉపాధి కోల్పోయినట్లుగా తన దృష్టికి వచ్చిం దని అన్నారు.
అలాంటి కుటుంబాలను ఆదుకొని వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, బదిలీలపై తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, ఇతర నాయకులు డి.అరుణ్‌కుమార్, సత్యనారాయణ, విష్ణువర్ధన్ రావు, కృష్ణయాదవ్, వెంకటయ్య, జూపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.