dairy innovation
-
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి జగన్ భరోసా ఇచ్చారు
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారిని నేను కలిసినప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలపైన చర్చ జరిగింది. తెలుగు పరిశ్రమ అభివృద్ధికి ఏం కావాలన్నా చేస్తానని భరోసా ఇచ్చారు. నంది అవార్డులు గత రెండేళ్లుగా ఇవ్వకుండా ఆపేశారు.. వాటిని మళ్లీ అందివ్వాలని కోరాను. అందుకు ఆయన ‘చెప్పండి అన్నా.. మీరందరూ అనుకుని చెబితే తిరిగి ప్రారంభిద్దామని సుముఖంగా స్పందించారు’’ అన్నారు చిరంజీవి. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’(మా) 2020 డైరీ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, టీఎస్సాయర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– జగన్ గారితో ‘సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు?’ అని అడిగితే.. ‘ఆ శాఖని ఇంకా కేటాయించలేదు. త్వరలో పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్‌కి లేక మరొకరికి కేటాయిస్తాను. సంబంధిత శాఖ కార్యదర్శిని మీ వద్దకు పంపిస్తా.. ఎలా చేద్దాం ఏంటన్నది మీరందరూ మాట్లాడండి’ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. జగన్‌గారికి చిత్ర పరిశ్రమకు ఎంతో చేయాలని ఉంది. అయితే వారు వెళుతున్న విధానంలోకి మనలాంటి వాళ్లు వెళితే కానీ ఒక రూపం రాదనుకుంటున్నా. మోహన్‌బాబు, మురళీమోహన్గార్లు, నేను... మరికొందరు కలిసి వెళ్లి మార్చికో, ఉగాదికో ‘నంది’ అవార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ‘చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా చేస్తాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చెప్పారు. ‘మా’ సంఘానికి 3 ఎకరాలు స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సాయంతో చిత్ర పరిశ్రమను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఏకాభిప్రాయంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి తెలుగు ఇండస్ట్రీకి, ‘మా’కి మంచి పేరు తీసుకురావాలి. చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోదాం. మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం. ‘మా’లో గతంలో పెద్దగా విభేదాలు లేవు. కానీ మాకంటే ఎక్కువ సేవ చేయాలనే కసితో ప్రస్తుత బాడీ ఉంది. దానివల్ల కొన్ని విభేదాలు తలెత్తాయి. వాటిని సమన్వయం చేసుకుందాం. స్వలాభం కోసం కాకుండా కళామతల్లి గర్వపడే బిడ్డలుగా ముందుకు వెళ్లాలి’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అసోసియేషన్ అంటే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి.. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. ‘మా’ గురించి ఎవరూ బయట మాట్లాడకూడదు. ‘మా’ గౌరవాన్ని నిలబెట్టాలి’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కళాకారులను గౌరవించి, సాయం చేసే టి.సుబ్బరామిరెడ్డిగారిలాంటి గొప్ప వ్యక్తి ముందు నేడు ఇలాంటి గొడవలు జరగడం బాధాకరం. భగవంతుడి సాక్షిగా నాకు, చిరంజీవికి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నా కుటుంబమే ఆయన కుటుంబం. ఆయన కుటుంబమే నా కుటుంబం. ‘మా’లో గొడవలు జరుగుతున్న మాట వాస్తవం. ‘మా’ ఎవడి సొత్తు కాదు. సవాళ్లు చేసుకోవడం మానేసి కలిసి పనిచేద్దాం’’ అన్నారు. ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘మార్చిలో జరిగిన ‘మా’ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ అసోసియేషన్ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో సినిమా కూడా చేయలేకపోయాను. ‘మా’ కోసం చాలా మెంటల్ టెన్షన్‌తో వర్క్ చేస్తున్నందుకు మా ఇంట్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. వాటివల్లే ఇటీవల నా కారుకి ప్రమాదం చోటు చేసుకుంది. ‘మా’లో ఉన్నవి చిన్న చిన్న సమస్యలే కాబట్టి సర్దుకుపోయి పని చేయాలని చిరంజీవిగారు చెప్పడం సంతోషమే. కానీ ‘మా’లో పెద్ద గొడవలున్నాయి. నిప్పును కప్పిపుచ్చితే పొగ రాకుండా ఉండదు. రీల్ లైఫ్‌లోలా రియల్ లైఫ్‌లోనూ హీరోలా పని చేద్దామంటే కొందరు నొక్కేస్తున్నారు.. తొక్కేస్తున్నారు’’ అన్నారు. ‘‘రాజశేఖర్గారిది చిన్నపిల్లల మనస్తత్వం. ఆయన మాటలకు క్షమాపణ కోరుతున్నా’’ అన్నారు జీవిత. అందుకే రాజీనామా చేశా – రాజశేఖర్ గురువారం ఉదయం ‘మా డైరీ’ ఆవిష్కరణ అనంతరం సాయంత్రం రాజశేఖర్ ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా ఓ ప్రకటన ద్వారా వివరించారు. ‘‘మా’ అసోసియేషన్‌కు ఎంతో మంచి చేయాలనుకున్నాను. కానీ ‘మా’ ప్రెసిడెంట్ నరేశ్‌గారు కమిటీ సభ్యులను కించపరుస్తూ, తక్కువ చేస్తూ వస్తున్నారు. వీటన్నింటినీ పరిష్కరించుకొని ముందుకువెళ్లాలని నా వంతు కృషి చేశాను. కానీ నరేశ్‌గారు పారదర్శకతను మరిచి తనకు నచ్చిన విధంగా నడుచుకుంటున్నారు. ‘మా’ డైరీ వేడుకలో నరేశ్‌గారు మాట్లాడింది ఏదీ కమిటీ సభ్యులతో చర్చించలేదు. జీవితకు వాట్సాప్ మెసేజ్ మాత్రం పంపారు. ఇండస్ట్రీ పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో మాకున్న విభేదాలను చర్చించాం. కానీ ఆయనలో మార్పేం లేదు. అందుకే ఈ రోజు వేడుకలో నా ఎమోషన్స్ బయటపెట్టాను. నేను చాలా సున్నితమైన మనిషిని. ముక్కుసూటిగా వ్యవహరిస్తాను. నరేశ్‌గారు వ్యవహరిస్తున్న తీరు నచ్చడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నా ఎమోషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటారనుకుంటున్నా’’ అని రాజశేఖర్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘మా’ వేడుకలో ఆత్మీయంగా మోహన్‌బాబు, చిరంజీవి చదవండి: హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం మోహన్‌బాబును ఆలింగనం చేసుకున్న చిరంజీవి ‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్ ‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం నాకు పదవీ వ్యామోహం లేదు -
మా మంచి పనులు కొనసాగిస్తూనే ఉండాలి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, శ్యామల దంపతులు సంయుక్తంగా ‘సిల్వర్ జూబ్లీ డైరీ – 2019’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘మా’ మెంబర్స్‌లో పేద కళాకారుల ఇంటి ఆడపిల్లలకు ‘మా కల్యాణ లక్ష్మి’, ‘మా విద్య’ పథకాలను స్టార్ట్ చేస్తున్నట్లు ‘మా’ బృందం పేర్కొంది. ఈ పథకానికి విజయనిర్మల లక్షా యాభై వేల రూపాయలు, శ్యామల లక్ష రూపాయిలు విరాళం అందించారు. కృష్ణ మాట్లాడుతూ – ‘‘మా’ ఇలాంటి మంచి పనులు కొనసాగించాలి. అసోసియేషన్ సొంత బిల్డింగ్ నిర్మాణం జరగాలి’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘కృష్ణ, కృష్ణంరాజు అంటే ఇండస్ట్రీ తొలినాళ్లలో మూల స్తంభాలు. నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారంటే డబ్బులు తీసుకోకుండా వాళ్లకు సినిమాలు చేశాం. కృష్ణగారు ఫిల్మ్ కొనిచ్చి సహాయం చేస్తే, నేను భోజనాలు పెట్టించేవాణ్ణి. వర్గబేధాలు లేకుండా సమస్యలు పరిష్కరించాం. ‘మా’ సంస్థ చాలా మందికి ఉపయోగపడుతోంది. ఇంకా బాగా కొనసాగాలి. అలాగే ఓ మంచి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది’’ అన్నారు. ‘‘ఈ కార్యక్రమం పెళ్లిలా జరిగింది. చాలా సంతోషంగా ఉంది’’ అని విజయనిర్మల అన్నారు. ‘‘ఒకే వేదిక మీద కృష్ణ, కృష్ణంరాజుగారిని సన్మానించడం గర్వంగా ఉంది. విజయనిర్మలగారు అద్భుతమైన సినిమాలు తీసి రికార్డ్ సృష్టించారు. ఆవిడను మనందరం సన్మానించుకోవాలి’’ అని శ్యామల అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం 33మంది కళాకారులకు 3000 చొప్పున ఫించను ఇస్తున్నాం. జనవరి నుంచి 5000 ఇవ్వాలనుకుంటున్నాం.‘మా కల్యాణ లక్ష్మి’ ద్వారా 1,16,000 రూపాయలు అర్హులకు అందిస్తాం. ‘మా విద్య’ ద్వారా లక్ష రూపాయిలు అందిస్తాం. త్వరలోనే లండన్‌లో ఓ ఈవెంట్ చేయనున్నాం’’ అన్నారు. ‘‘అపోలో హాస్పిటల్స్ 14 లక్షలు స్పాన్సర్షిప్ అందించింది. విజయనిర్మలగారు ప్రతి పుట్టిన రోజుకు డొనేషన్ ఇస్తుంటారు. ప్రతి నెలా 15వేలు పంపుతున్నారు’’ అన్నారు ప్రధాన కార్యదర్శి నరేశ్. ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. -
గుడుంబాపై ఉక్కుపాదం
♦ ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ ♦ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబా అమ్మకాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ తెలిపారు. ఎనిమిది జిల్లా ల్లో గుడుంబా విక్రయాలను పూర్తిగా అరికట్టామని, హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా గుడుంబా తయారీ, అమ్మకాలు లేకుండా చేసి తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొం దించిన 2016 డైరీ, క్యాలెండర్లను సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు గుడుంబా తయారీ, అమ్మకాలే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉపాధి కోల్పోయినట్లుగా తన దృష్టికి వచ్చిం దని అన్నారు. అలాంటి కుటుంబాలను ఆదుకొని వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, బదిలీలపై తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి.రవీందర్రావు, ఇతర నాయకులు డి.అరుణ్‌కుమార్, సత్యనారాయణ, విష్ణువర్ధన్ రావు, కృష్ణయాదవ్, వెంకటయ్య, జూపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.