చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏపీ సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు | YS Jagan support for Film Industry Development - Sakshi
Sakshi News home page

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి జగన్‌ భరోసా ఇచ్చారు

Published Fri, Jan 3 2020 1:59 AM | Last Updated on Fri, Jan 3 2020 2:31 PM

ap cm ys jagan mohan reddy support for telugu film industry - Sakshi

‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారిని నేను కలిసినప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలపైన చర్చ జరిగింది. తెలుగు పరిశ్రమ అభివృద్ధికి ఏం కావాలన్నా చేస్తానని భరోసా ఇచ్చారు. నంది అవార్డులు గత రెండేళ్లుగా ఇవ్వకుండా ఆపేశారు.. వాటిని మళ్లీ అందివ్వాలని కోరాను. అందుకు ఆయన ‘చెప్పండి అన్నా.. మీరందరూ అనుకుని చెబితే తిరిగి ప్రారంభిద్దామని సుముఖంగా స్పందించారు’’ అన్నారు చిరంజీవి. ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’(మా) 2020 డైరీ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, టీఎస్సాయర్‌ తదితరులు పాల్గొన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ– జగన్‌ గారితో ‘సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు?’ అని అడిగితే.. ‘ఆ శాఖని ఇంకా కేటాయించలేదు. త్వరలో పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్‌కి లేక మరొకరికి కేటాయిస్తాను. సంబంధిత శాఖ కార్యదర్శిని మీ వద్దకు పంపిస్తా.. ఎలా చేద్దాం ఏంటన్నది మీరందరూ మాట్లాడండి’ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. జగన్‌గారికి చిత్ర పరిశ్రమకు ఎంతో చేయాలని ఉంది. అయితే వారు వెళుతున్న విధానంలోకి మనలాంటి వాళ్లు వెళితే కానీ ఒక రూపం రాదనుకుంటున్నా. మోహన్‌బాబు, మురళీమోహన్‌గార్లు, నేను... మరికొందరు కలిసి వెళ్లి మార్చికో, ఉగాదికో ‘నంది’ అవార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ‘చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా చేస్తాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చెప్పారు.

‘మా’ సంఘానికి 3 ఎకరాలు స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌ ఇటీవల ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సాయంతో చిత్ర పరిశ్రమను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఏకాభిప్రాయంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి తెలుగు ఇండస్ట్రీకి, ‘మా’కి మంచి పేరు తీసుకురావాలి. చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోదాం. మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం. ‘మా’లో గతంలో పెద్దగా విభేదాలు లేవు. కానీ మాకంటే ఎక్కువ సేవ చేయాలనే కసితో ప్రస్తుత బాడీ ఉంది. దానివల్ల కొన్ని విభేదాలు తలెత్తాయి. వాటిని సమన్వయం చేసుకుందాం. స్వలాభం కోసం కాకుండా కళామతల్లి గర్వపడే బిడ్డలుగా ముందుకు వెళ్లాలి’’ అన్నారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అసోసియేషన్‌ అంటే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి.. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కో ఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. ‘మా’ గురించి ఎవరూ బయట మాట్లాడకూడదు. ‘మా’ గౌరవాన్ని నిలబెట్టాలి’’ అన్నారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కళాకారులను గౌరవించి, సాయం చేసే టి.సుబ్బరామిరెడ్డిగారిలాంటి గొప్ప వ్యక్తి ముందు నేడు ఇలాంటి గొడవలు జరగడం బాధాకరం. భగవంతుడి సాక్షిగా నాకు, చిరంజీవికి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నా కుటుంబమే ఆయన కుటుంబం. ఆయన కుటుంబమే నా కుటుంబం. ‘మా’లో గొడవలు జరుగుతున్న మాట వాస్తవం. ‘మా’ ఎవడి సొత్తు కాదు. సవాళ్లు చేసుకోవడం మానేసి కలిసి పనిచేద్దాం’’ అన్నారు.

‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ – ‘‘మార్చిలో జరిగిన ‘మా’ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ అసోసియేషన్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో సినిమా కూడా చేయలేకపోయాను. ‘మా’ కోసం చాలా మెంటల్‌ టెన్షన్‌తో వర్క్‌ చేస్తున్నందుకు మా ఇంట్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. వాటివల్లే ఇటీవల నా కారుకి ప్రమాదం చోటు చేసుకుంది. ‘మా’లో ఉన్నవి చిన్న చిన్న సమస్యలే కాబట్టి సర్దుకుపోయి పని చేయాలని చిరంజీవిగారు చెప్పడం సంతోషమే. కానీ ‘మా’లో పెద్ద గొడవలున్నాయి. నిప్పును కప్పిపుచ్చితే  పొగ రాకుండా ఉండదు. రీల్‌ లైఫ్‌లోలా రియల్‌ లైఫ్‌లోనూ హీరోలా పని చేద్దామంటే కొందరు నొక్కేస్తున్నారు.. తొక్కేస్తున్నారు’’ అన్నారు. ‘‘రాజశేఖర్‌గారిది చిన్నపిల్లల మనస్తత్వం. ఆయన మాటలకు క్షమాపణ కోరుతున్నా’’ అన్నారు జీవిత.

అందుకే రాజీనామా చేశా – రాజశేఖర్‌
గురువారం ఉదయం ‘మా డైరీ’ ఆవిష్కరణ అనంతరం సాయంత్రం రాజశేఖర్‌ ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా ఓ ప్రకటన ద్వారా వివరించారు. ‘‘మా’ అసోసియేషన్‌కు ఎంతో మంచి చేయాలనుకున్నాను. కానీ ‘మా’ ప్రెసిడెంట్‌ నరేశ్‌గారు కమిటీ సభ్యులను కించపరుస్తూ, తక్కువ చేస్తూ వస్తున్నారు. వీటన్నింటినీ పరిష్కరించుకొని ముందుకువెళ్లాలని నా వంతు కృషి చేశాను. కానీ నరేశ్‌గారు పారదర్శకతను మరిచి తనకు నచ్చిన విధంగా నడుచుకుంటున్నారు.

‘మా’ డైరీ వేడుకలో నరేశ్‌గారు మాట్లాడింది ఏదీ కమిటీ సభ్యులతో చర్చించలేదు. జీవితకు వాట్సాప్‌ మెసేజ్‌ మాత్రం పంపారు. ఇండస్ట్రీ పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో మాకున్న విభేదాలను చర్చించాం. కానీ ఆయనలో మార్పేం లేదు. అందుకే ఈ రోజు వేడుకలో నా ఎమోషన్స్‌ బయటపెట్టాను. నేను చాలా సున్నితమైన మనిషిని. ముక్కుసూటిగా వ్యవహరిస్తాను. నరేశ్‌గారు వ్యవహరిస్తున్న తీరు నచ్చడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నా ఎమోషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటారనుకుంటున్నా’’ అని రాజశేఖర్‌ పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

‘మా’ వేడుకలో ఆత్మీయంగా మోహన్‌బాబు, చిరంజీవి

చదవండి:

హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం

మోహన్బాబును ఆలింగనం చేసుకున్న చిరంజీవి

మావిభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్

మాలో రచ్చ.. రాజశేఖర్పై చిరంజీవి ఆగ్రహం

నాకు పదవీ వ్యామోహం లేదు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement