గ్రేటర్‌లో మరిన్ని కొత్త బార్లు! | new wine shops in greater hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో మరిన్ని కొత్త బార్లు!

Published Thu, Jun 26 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

గ్రేటర్‌లో మరిన్ని కొత్త బార్లు!

గ్రేటర్‌లో మరిన్ని కొత్త బార్లు!

* తెలంగాణలో మొత్తం బార్ల సంఖ్య 726  
* గ్రేటర్ పరిధిలోనే 350కిపైగా బార్ లెసైన్స్‌లు
 
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లోని మద్యం ప్రియులకు ఇది శుభవార్తే! వైన్‌షాపుల ముందు రోడ్లపై నిలబడి హడావుడిగా కాకుండా నిమ్మలంగా కూర్చొని తాగేందుకు కొత్తగా మరిన్ని బార్లకు లెసైన్స్‌లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 726 బార్లు ఉంటే, అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 350కిపైగా బార్ లెసైన్సులు ఉన్నాయి. రాజధానిలో ఉన్న డిమాండ్, 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని మరిన్ని బార్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే జిల్లాల్లో మాత్రం బార్ల సంఖ్యను పెంచరాదని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రాష్ట్రంలో కొత్త సర్కార్ మద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్న అపవాదు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మీనా, కమిషనర్ నదీం అహ్మద్ తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విమర్శలకు తావులేని బార్ పాలసీని ప్రకటించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. దీంతో గురు, శుక్రవారాల్లో అధికారికంగా పాలసీని ప్రకటిస్తూ జీవో విడుదలయ్యే అవకాశం ఉంది.

జూలై ఒకటి నుంచి కొత్త పాలసీ అమలు
ఈనెలాఖరుతో ప్రస్తుతమున్న ఎక్సైజ్ పాలసీ గడువు ముగుస్తున్నందున జూలై ఒకటి నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తేవలసి ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో ఇప్పటికే గత 14న రిటైల్ అమ్మకాల కోసం మద్యం పాలసీ తీసుకొచ్చి, డ్రా పద్ధతిలో వైన్‌షాపుల కేటాయింపు కూడా పూర్తి చేశారు. ఇక నూతన బార్ పాలసీ రావలసి ఉన్నా, సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు బుధవారం రాత్రి సీఎంతో ఎక్సైజ్ మంత్రి, అధికారులు సమావేశమై నూతన పాలసీకి ఆమోద ముద్ర వేయించుకున్నారు.

యథాతథంగా లెసైన్స్ ఫీజు
తెలంగాణకు కొత్త బార్ పాలసీ తీసుకువస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న లెసైన్స్ ఫీజులను పెంచకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అధికార యంత్రాంగం కూడా లెసైన్స్ ఫీజును పెంచడం వల్ల వైన్‌షాపుల తరహాలోనే బార్లను తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకురారని ప్రభుత్వానికి వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బార్ల లెసైన్స్ ఫీజు  ఉన్నట్టుగానే నాలుగు స్లాబుల్లో కొనసాగించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్టు సమాచారం. కాగా లెసైన్స్ ఫీజు కన్నా 6 రెట్ల విలువైన మద్యాన్ని బార్లలో ఎలాంటి ప్రివిలేజ్ ఫీజు లేకుండా అమ్మవచ్చు. ఆరు రెట్లు దాటితే 9 శాతం నుంచి 16 శాతం వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. గ్రేటర్‌లో 16 శాతం ప్రివిలేజ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఓ బార్ యజమాని ‘సాక్షి’కి తెలిపారు.

జిల్లాల్లో డిమాండ్ ఉన్నా...
రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం మినహాయిస్తే ఎక్కువ శాతం బార్లు పెద్ద మునిసిపాలిటీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక మునిసిపాలిటీల్లో బార్ల కోసం డిమాండ్ ఉంది.  అయితే కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బార్లకు గేట్లు తీసిందన్న అపవాదు వస్తుందన్న కారణంగా జిల్లాల్లో కొత్తగా బార్ లెసైన్స్‌లు ఇవ్వరాదని నిర ్ణయించినట్లు సమాచారం. బుధవారం సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది.

170 వైన్‌షాపులపై కమిషనర్ నదీం అహ్మద్ ఆరా!
వైన్‌షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్ నదీం అహ్మద్ బుధవారం అన్ని జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. గతంతో పోలిస్తే వైన్‌షాపులకు మంచి డిమాండ్ వచ్చినప్పటికీ, 170 దుకాణాలను ఎవరూ తీసుకోకపోవడానికి గల కారణాలపై చర్చించారు. ఎక్కడైనా వ్యాపారులు సిండికేటై షాపులకు దరఖాస్తులు రాకుండా చేశారా అన్న కోణంలో కూడా కమిషనర్ వివరాలు రాబట్టినట్లు తెలిసింది.

దరఖాస్తుల ద్వారా రూ. 50 కోట్లు, తొలివిడత లెసైన్స్ ఫీజు రూపంలో దాదాపు రూ. 300 కోట్లు ఆదాయంగా సమకూరింది. కాగా, దరఖాస్తులు రాని దుకాణాలకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్ నిర్ణయించినట్లు సమాచారం. అదనపు కమిషనర్ వెంకటస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement