bar policy
-
ఏపీలో నూతన బార్ పాలసీపై ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన బార్ పాలసీని శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలయ్యే ఈ పాలసీ ప్రకారం బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజును రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. ఇది నాన్ రిఫండబుల్. లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించనుండగా, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వ్యాపార వేళలుగా నిర్ణయించారు. లైసెన్స్ గడువు రెండేళ్ల వరకు ఉంటుంది. లైసెన్స్ ఫీజులను చూస్తే 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 25 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 75 లక్షలుగా ఫీజును నిర్ణయించారు. మరోవైపు సామాన్యులకు మద్యాన్ని దూరం చేసేందుకు బార్లలో మద్యం అమ్మకాలపై అదనపు పన్ను వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మద్యపాన నిషేధంపై సీఎం జగన్ మరో ముందడుగు
సాక్షి, అమరావతి : మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బార్ల పాలసీపై మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి ప్రభుత్వం తగ్గించనుంది. బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 20శాతం మద్యం దుకాణాలను తగ్గించామని, విడతల వారీగా పూర్తిగా తగ్గిస్తామని అధికారులు తెలిపారు. ఇక బార్ల సంఖ్యను కుదించే క్రమంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్కడ మద్యం సరఫరా వేళల్ని కుదించింది. బార్లలో మద్యం సరఫరాకు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ, ఆహారం రాత్రి 11 వరకు.. స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాలు.. ఉదయం 11నుంచి రాత్రి 11 వరకు అనుమతి ఉంటుంది. దీంతోపాటు మద్యం ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. మద్యం కల్తీకు పాల్పడినా, స్మగ్లింగ్ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు ఉంటాయని, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. లైసెన్స్ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చేఅసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. నిబంధనలు అతిక్రమిస్తే.. రాష్ట్రంలో 40 శాతం బార్లను తగ్గిస్తున్నామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పుడున్న బార్లు మొత్తం తీసేస్తామని, కొత్తగా 40 శాతం తగ్గించి బార్లకు అనుమతులు ఇస్తాం. మద్యపాన నిషేధం అమలులో భాగంగా బార్లు తగ్గిస్తున్నాం. వాటి టైమింగ్స్ కూడా మార్చాం. బార్లలో మద్యం ధరలను కూడా పెంచుతాం. లాటరీ పద్ధతిలో బార్ల ను కేటాయిస్తాం. బార్ల పాలసీలో నిబంధనలు అతిక్రమించేవారికి జైలు శిక్ష వేసేలా చర్యలు తీసుకుంటున్నాం’అన్నారు. -
బార్ పాలసీలో ఐదు రకాల లైసెన్సులు!
-
బార్ పాలసీలో ఐదు రకాల లైసెన్సులు!
- దరఖాస్తు రుసుం రూ. లక్షకు తగ్గింపు..లైసెన్సుకు రూ. 4 లక్షలు - రెన్యువల్‌కు దరఖాస్తు ఫీజు లేదు.. - హైవేకు 100 మీటర్ల దూరం నిబంధనపై మెలిక - ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం? సాక్షి, అమరావతి: ఎట్టకేలకు నూతన బార్ పాలసీ ఖరారైంది. 2017–18 సంవత్సరానికి గాను బార్ పాలసీలో ఐదు రకాల లైసెన్సులు జారీ చేయనున్నారు. పట్టణ ప్రాంతాలకు ఫాం–2బీ, కార్పొరేషన్లలో స్టార్ హోటళ్లు, టూరిజం ప్రదేశాలు, పార్లర్లు, పదిలక్షలకు పైగా జనాభా ఉన్న విజయవాడ, విశాఖపట్టణాల్లో కొత్తగా ’క్రౌన్’ లైసెన్సులుగా విభజించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ’ఎలైట్’ అనే లైసెన్సు జారీ చేయగా, ఏపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖలలో ’క్రౌన్’ అనే లైసెన్సు జారీ చేయనుంది. క్రౌన్ లైసెన్సు అంటే కేఫ్‌లు/విశాలమైన హాల్స్, రూఫ్ గార్డెన్లు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్న రెస్టారెంట్లకు జారీ చేస్తారు. ఐదు రకాల లైసెన్సులకు రెస్టారెంట్లు తప్పనిసరి చేశారు. ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది. బార్ పాలసీని 2005లో రూపొందించారు. అప్పటి నుంచి రెన్యువల్తోనే నెట్టుకొస్తున్నారు. 2016–17 సంవత్సరానికి బార్ పాలసీ రూపొందించారు. అయితే ఈ పాలసీలో ఫస్ట్ కమ్ ఫస్ట్ అనే నిబంధన ఉంచడంతో మద్యం వ్యాపారులు కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ విధానాన్ని హైకోర్టు తప్పు పట్టింది. దీంతో 2017 సంవత్సరానికి కొత్త పాలసీ రూపొందించారు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులొస్తే లాటరీ.. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 765 బార్లు ఉండాలి. ప్రస్తుతం 708 మాత్రమే ఉన్నాయి. ఈ బార్లకు లైసెన్సును పునరుద్ధరించి మిగిలిన 57 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. దరఖాస్తు రుసుం రూ. 2 లక్షల నుంచి రూ. లక్షకు తగ్గించారు. రెన్యువల్ చేసుకునే వారు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. లైసెన్సు ఫీజు రూ.4 లక్షలు చెల్లించాలి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కొత్త బార్లకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో అప్పగిస్తారు. ఫాం–2 బీ లైసెన్సుకు 200 చదరపు మీటర్లలో బార్ ఏర్పాటు చేయాలి. బీర్, వైన్ పార్లర్లకు 150 చదరపు మీటర్లు.. కార్పొరేషన్, పదిలక్షలు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో 500 చదరపు మీటర్లు ఉండాలి. ఇందుకు అదనంగా లైసెన్సు రుసుం వసూలు చేస్తారు. హైవేలకు వంద మీటర్ల నిబంధనపై మెలిక హైవేలకు వంద మీటర్ల లోపు మద్యం దుకాణాలు, బార్ల విషయంలో సీరియస్‌గా ఉన్న సుప్రీంకోర్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కొత్త బార్ పాలసీలో వంద మీటర్ల నిబంధనపై ఆబ్కారీ శాఖ మెలిక పెట్టినట్లు సమాచారం. హైవే పక్కన వంద మీటర్ల దూరాన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్ వాణిజ్య సముదాయంగా గుర్తిస్తే బార్ ఏర్పాటు చేయవచ్చనే నిబంధన చేర్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. -
బార్ పాలసీ ఉత్తర్వుల్లో జాప్యం
సీఎం సంతకమైనా ప్రకటించని సర్కార్ సాక్షి, హైదరాబాద్: బార్ పాలసీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను వెల్లడించడంలో జాప్యం జరుగుతోంది. సెప్టెంబర్ 30తో ముగిసిన 2015-16 బార్ పాలసీ స్థానంలో ఈ నెల 1 నుంచి నూతన పాలసీ అమలులోకి వచ్చింది. పలు సవరణలు చేస్తూ రూపొందించిన ఈ బార్ పాలసీని ఆమోదిస్తూ ఈ నెల ఒకటో తేదీనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 214 రూపొందించారు. కానీ ఐదు రోజులైనా ఈ జీవోను ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టలేదు. ఎక్సైజ్ మంత్రి పద్మారావు, ప్రభుత్వ కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రవదన్‌కు మాత్రమే ఈ ఉత్తర్వులు అందాయి. బార్ లెసైన్సు ఫీజు రూ. 5 లక్షలు పెంపు, బార్ విస్తీర్ణం ఆధారంగా లెసైన్సు ఫీజును 10 శాతం నుంచి 30 శాతం వరకు పెంచుతూ ఆబ్కారీ శాఖ చేసిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలపడంతో తదనుగుణ ంగా ఫీజుల వసూళ్లను ప్రారంభించారు. అదే సమయంలో పాలసీలో కొత్తగా చేసిన సవరణలు ఈ జీవోలో ఉన్నప్పటికీ, వాటి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. మరోవైపు జీవోలో బార్ లెసైన్సుల మంజూరీకి నిర్ణయించిన జనాభా లెక్కల్లో మార్పులు చేసినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 13 వేల జనాభాకు ఒక బార్ చొప్పున అనుమతికి అవకాశం ఉండగా, దానిని 11 వేలకు తగ్గించినట్లు సమాచారం. అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో 30 వేల జనాభాలోపు ఉంటే ఇప్పటి వరకు బార్ లెసైన్సు ఇచ్చేవారు. దానిని కూడా 25 వేలకు తగ్గించినట్లు తెలిసింది. వీటికి తోడు మరిన్ని సవరణలు కూడా చేసినట్లు అధికారులు చెపుతున్నారు. కాగా జీవోను అధికారికంగా వెల్లడించడానికి ముందు న్యాయ సలహా కోసం పంపించి నట్లు అధికారులు చెపుతున్నారు. -
బార్లపై ఇదేం బాదుడు!
- బార్ల అసోసియేషన్ ఆందోళన - లెసైన్సు, రెన్యూవల్ ఫీజుల పెంపు, సిట్టింగ్ కెపాసిటీని బట్టి రుసుము వసూలుకు ఆబ్కారీ శాఖ ప్రతిపాదన - నేడు ఎక్సైజ్ కమిషనర్‌ను కలసి నిరసన సాక్షి, హైదరాబాద్: ఆబ్కారీశాఖ ప్రతిపాదనలపై బార్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల రూపేణా బాదడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న ‘నూతన బార్ పాలసీ’లో భాగంగా ఫీజులను పెంచాలని ఆబ్కారీ శాఖ ప్రతిపాదించింది. ప్రతి రెండేళ్లకోసారి ఇష్టానుసారంగా లెసైన్సు ఫీజులు, రెన్యూవల్ దరఖాస్తు ఫీజు ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నారని తెలంగాణ రెస్టారెంట్, బార్ల అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో లెసైన్సు, రెన్యూవల్ దరఖాస్తు ఫీజుల పెంపు ప్రతిపాదనలను వ్యతిరేకించాలని యజమానులు నిర్ణయించారు. ఈ ఫీజులతోపాటు సీటింగ్ కెపాసిటీ ఆధారంగా రుసుము వసూలు చేస్తే ఆ భారం వినియోగదారులపైనే పడుతుందని, మద్యం ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలో రూ.2 నుంచి లక్షకు పెంపు ఐదేళ్ల క్రితం వరకు రెండు రూపాయల రెవెన్యూ స్టాంప్‌తో బార్ లెసైన్స్ రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకొనేవారు. తరువాత దీనిని ఆబ్కారీ శాఖ రూ.10 వేలకు పెంచింది. ఈసారి ఆ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచాలని ప్రతిపాదించింది. 804 బార్ల రెన్యూవల్ దరఖాస్తు ఫారాల విక్రయం ద్వారానే రూ.8 కోట్లకుపైగా వసూలు చేయాలని నిర్ణయించింది. లెసైన్సు ఫీజు, సిట్టింగ్ కెపాసిటీ ఆధారంగా ఫీజుల పెంపు జీహెచ్ఎంసీతోపాటు ఇతర మునిసిపాలిటీలు, నగర పంచాయితీల్లో కూడా 10 శాతం వరకు లేదా రూ.5 లక్షల మేర లెసైన్సు ఫీజు పెంచాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బార్ల వైశాల్యం, సిట్టింగ్ కెపాసిటీ ఆధారంగా 500 చదరపు మీటర్లు దాటితే ప్రతి 200 మీటర్లకు 10 శాతం చొప్పున రుసుము వసూలు చేయాలని కూడా భావిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమలు చేస్తే బార్ల నిర్వహణ సాధ్యం కాదని యజమానులు పేర్కొంటున్నారు. కాగా సోమవారం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాలను కలసి పరిస్థితిని వివరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు తిరిగి రాగానే ఫీజుల పెంపుపై విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. -
గ్రేటర్లో మరిన్ని కొత్త బార్లు!
* తెలంగాణలో మొత్తం బార్ల సంఖ్య 726 * గ్రేటర్ పరిధిలోనే 350కిపైగా బార్ లెసైన్స్‌లు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లోని మద్యం ప్రియులకు ఇది శుభవార్తే! వైన్‌షాపుల ముందు రోడ్లపై నిలబడి హడావుడిగా కాకుండా నిమ్మలంగా కూర్చొని తాగేందుకు కొత్తగా మరిన్ని బార్లకు లెసైన్స్‌లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 726 బార్లు ఉంటే, అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 350కిపైగా బార్ లెసైన్సులు ఉన్నాయి. రాజధానిలో ఉన్న డిమాండ్, 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని మరిన్ని బార్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాల్లో మాత్రం బార్ల సంఖ్యను పెంచరాదని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రాష్ట్రంలో కొత్త సర్కార్ మద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్న అపవాదు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మీనా, కమిషనర్ నదీం అహ్మద్ తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విమర్శలకు తావులేని బార్ పాలసీని ప్రకటించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. దీంతో గురు, శుక్రవారాల్లో అధికారికంగా పాలసీని ప్రకటిస్తూ జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. జూలై ఒకటి నుంచి కొత్త పాలసీ అమలు ఈనెలాఖరుతో ప్రస్తుతమున్న ఎక్సైజ్ పాలసీ గడువు ముగుస్తున్నందున జూలై ఒకటి నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తేవలసి ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో ఇప్పటికే గత 14న రిటైల్ అమ్మకాల కోసం మద్యం పాలసీ తీసుకొచ్చి, డ్రా పద్ధతిలో వైన్‌షాపుల కేటాయింపు కూడా పూర్తి చేశారు. ఇక నూతన బార్ పాలసీ రావలసి ఉన్నా, సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు బుధవారం రాత్రి సీఎంతో ఎక్సైజ్ మంత్రి, అధికారులు సమావేశమై నూతన పాలసీకి ఆమోద ముద్ర వేయించుకున్నారు. యథాతథంగా లెసైన్స్ ఫీజు తెలంగాణకు కొత్త బార్ పాలసీ తీసుకువస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న లెసైన్స్ ఫీజులను పెంచకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అధికార యంత్రాంగం కూడా లెసైన్స్ ఫీజును పెంచడం వల్ల వైన్‌షాపుల తరహాలోనే బార్లను తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకురారని ప్రభుత్వానికి వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బార్ల లెసైన్స్ ఫీజు ఉన్నట్టుగానే నాలుగు స్లాబుల్లో కొనసాగించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్టు సమాచారం. కాగా లెసైన్స్ ఫీజు కన్నా 6 రెట్ల విలువైన మద్యాన్ని బార్లలో ఎలాంటి ప్రివిలేజ్ ఫీజు లేకుండా అమ్మవచ్చు. ఆరు రెట్లు దాటితే 9 శాతం నుంచి 16 శాతం వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. గ్రేటర్లో 16 శాతం ప్రివిలేజ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఓ బార్ యజమాని ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాల్లో డిమాండ్ ఉన్నా... రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం మినహాయిస్తే ఎక్కువ శాతం బార్లు పెద్ద మునిసిపాలిటీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక మునిసిపాలిటీల్లో బార్ల కోసం డిమాండ్ ఉంది. అయితే కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బార్లకు గేట్లు తీసిందన్న అపవాదు వస్తుందన్న కారణంగా జిల్లాల్లో కొత్తగా బార్ లెసైన్స్‌లు ఇవ్వరాదని నిర ్ణయించినట్లు సమాచారం. బుధవారం సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. 170 వైన్‌షాపులపై కమిషనర్ నదీం అహ్మద్ ఆరా! వైన్‌షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్ నదీం అహ్మద్ బుధవారం అన్ని జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. గతంతో పోలిస్తే వైన్‌షాపులకు మంచి డిమాండ్ వచ్చినప్పటికీ, 170 దుకాణాలను ఎవరూ తీసుకోకపోవడానికి గల కారణాలపై చర్చించారు. ఎక్కడైనా వ్యాపారులు సిండికేటై షాపులకు దరఖాస్తులు రాకుండా చేశారా అన్న కోణంలో కూడా కమిషనర్ వివరాలు రాబట్టినట్లు తెలిసింది. దరఖాస్తుల ద్వారా రూ. 50 కోట్లు, తొలివిడత లెసైన్స్ ఫీజు రూపంలో దాదాపు రూ. 300 కోట్లు ఆదాయంగా సమకూరింది. కాగా, దరఖాస్తులు రాని దుకాణాలకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్ నిర్ణయించినట్లు సమాచారం. అదనపు కమిషనర్ వెంకటస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.