బార్ పాలసీలో ఐదు రకాల లైసెన్సులు!
- దరఖాస్తు రుసుం రూ. లక్షకు తగ్గింపు..లైసెన్సుకు రూ. 4 లక్షలు
- రెన్యువల్‌కు దరఖాస్తు ఫీజు లేదు..
- హైవేకు 100 మీటర్ల దూరం నిబంధనపై మెలిక
- ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం?
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు నూతన బార్ పాలసీ ఖరారైంది. 2017–18 సంవత్సరానికి గాను బార్ పాలసీలో ఐదు రకాల లైసెన్సులు జారీ చేయనున్నారు. పట్టణ ప్రాంతాలకు ఫాం–2బీ, కార్పొరేషన్లలో స్టార్ హోటళ్లు, టూరిజం ప్రదేశాలు, పార్లర్లు, పదిలక్షలకు పైగా జనాభా ఉన్న విజయవాడ, విశాఖపట్టణాల్లో కొత్తగా ’క్రౌన్’ లైసెన్సులుగా విభజించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ’ఎలైట్’ అనే లైసెన్సు జారీ చేయగా, ఏపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖలలో ’క్రౌన్’ అనే లైసెన్సు జారీ చేయనుంది. క్రౌన్ లైసెన్సు అంటే కేఫ్‌లు/విశాలమైన హాల్స్, రూఫ్ గార్డెన్లు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్న రెస్టారెంట్‌లకు జారీ చేస్తారు.
ఐదు రకాల లైసెన్సులకు రెస్టారెంట్లు తప్పనిసరి చేశారు. ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది. బార్ పాలసీని 2005లో రూపొందించారు. అప్పటి నుంచి రెన్యువల్‌తోనే నెట్టుకొస్తున్నారు. 2016–17 సంవత్సరానికి బార్ పాలసీ రూపొందించారు. అయితే ఈ పాలసీలో ఫస్ట్ కమ్ ఫస్ట్ అనే నిబంధన ఉంచడంతో మద్యం వ్యాపారులు కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ విధానాన్ని హైకోర్టు తప్పు పట్టింది. దీంతో 2017 సంవత్సరానికి కొత్త పాలసీ రూపొందించారు.
ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులొస్తే లాటరీ..
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 765 బార్లు ఉండాలి. ప్రస్తుతం 708 మాత్రమే ఉన్నాయి. ఈ బార్లకు లైసెన్సును పునరుద్ధరించి మిగిలిన 57 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. దరఖాస్తు రుసుం రూ. 2 లక్షల నుంచి రూ. లక్షకు తగ్గించారు. రెన్యువల్ చేసుకునే వారు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. లైసెన్సు ఫీజు రూ.4 లక్షలు చెల్లించాలి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కొత్త బార్లకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో అప్పగిస్తారు. ఫాం–2 బీ లైసెన్సుకు 200 చదరపు మీటర్లలో బార్ ఏర్పాటు చేయాలి. బీర్, వైన్ పార్లర్‌లకు 150 చదరపు మీటర్లు.. కార్పొరేషన్, పదిలక్షలు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో 500 చదరపు మీటర్లు ఉండాలి. ఇందుకు అదనంగా లైసెన్సు రుసుం వసూలు చేస్తారు.
హైవేలకు వంద మీటర్ల నిబంధనపై మెలిక
హైవేలకు వంద మీటర్ల లోపు మద్యం దుకాణాలు, బార్ల విషయంలో సీరియస్‌గా ఉన్న సుప్రీంకోర్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కొత్త బార్ పాలసీలో వంద మీటర్ల నిబంధనపై ఆబ్కారీ శాఖ మెలిక పెట్టినట్లు సమాచారం. హైవే పక్కన వంద మీటర్ల దూరాన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్ వాణిజ్య సముదాయంగా గుర్తిస్తే బార్ ఏర్పాటు చేయవచ్చనే నిబంధన చేర్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.