T - TDP
-
రుణమాఫీ హామీ అమలులో ప్రభుత్వం విఫలం
వరంగల్ : రుణమాఫీ హామీ నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నాయకులు ఆరోపించారు. రైతులకు ఏకకాలంగా రుణమాఫీ చేయాలని, బ్యాంకులు కొత్త రుణాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల ఎదుట టీడీ పీ శ్రేణులు మంగళవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఇందులో భాగంగా హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కాళోజీ జంక్షన్‌లోని డీసీసీ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం వాయిదా పద్ధతిలో మాఫీ చేయడం వల్ల రైతులకు ప్రయోజనం లే దన్నారు. రుణాలు రీషెడ్యూల్ కాక, బీమా ప్రీమియం చెల్లించక పంటబీమాకు నోచుకోలేదన్నారు. విడతల వారీగా ఇస్తున్న మాఫీ రుణా ల వడ్డీకి సరిపోవడం లేదన్నారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతులను ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, గట్టు ప్రసాద్‌బాబు, బొట్ల శ్రీ నివాస్, అశోక్‌కుమార్, గన్నోజు శ్రీనివాస్, ఇం దిర , సంతోస్నాయక్, సారంగం, రహీం, బాల రాజు, వెంకటకృష్ణ, సాంబయ్య పాల్గొన్నారు. -
చేసింది నేనే
- జగిత్యాల జిల్లా చేస్తా - వైద్యకళాశాల అందిస్తా - బహిరంగ సభలో చంద్రబాబు జగిత్యాల/జగిత్యాల అర్బన్ : జగిత్యాలను జిల్లా చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. తెలంగాణ జిల్లాల్లో తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల మినీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీ రంగంతో లక్షలమంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. తెలంగాణలో సామాజికన్యాయం కోసం, బీసీలకు, మైనారిటీలకు న్యాయం చేసేందుకు టీడీపీ ముందుంటోందని తెలిపారు. బీసీల సమస్యలపై పోరాటం చేస్తున్న ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించానని, అదేస్థాయిలో జగిత్యాల బీసీ ముద్దుబిడ్డగా ఎదిగిన ఎల్. రమణను టీ-టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక చేశానని పేర్కొన్నారు. రమణతోపాటు జగిత్యాల నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు జగిత్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. జగిత్యాలలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలకు ఎన్నింటికో అనుమతి ఇచ్చానని గుర్తుచేశారు. డ్వాక్రా సంఘాలు అప్పుల్లో కూరుకుపోయానని, తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పులన్నీ మాఫీ చేస్తానని హామీఇచ్చారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఖాయమని, తెలంగాణలో తమ ప్రభుత్వం వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. టీటీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు, జగిత్యాల అభ్యర్థి ఎల్.రమణ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్నానని నియోజకర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని సవాల్‌విసిరారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని అన్నారు. బీసీలకు పెద్దపీట వేయాలని కోరారు. నియోజకవర్గంలో తానుచేపట్టిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని స్థానిక నాయకుడు జీవన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కేంద్రంలో ఫిర్యాదుచేసి రద్దుచేయించారని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ టీడీపీ మొదటినుంచి బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. టీఆర్ఎస్లో ఒకే సామాజికవర్గానిది పెత్తనమని, అలాంటివారికి అధికారం ఇవ్వొద్దని కోరారు. ఆలస్యంతో విసిగిపోయిన ప్రజలు ఉదయం 11.30కే సభ ప్రాంగణానికి చేరుకోవాల్సిన చంద్రబాబు నాలుగున్నర గంటల ఆలస్యంగా 3.48కి వచ్చారు. దీంతో నియోజకవర్గ పరిధి నుంచి ఉదయం పది గంటల వరకే సభా ప్రాంగణానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులెదుర్కొన్నారు. అప్పటివరకు ఉన్నవారు సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసుల సహాయంతో వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు. బుజ్జగించి కూర్చోబెట్టారు. మధ్యాహ్నం 12కే సభ పూర్తవుతుందని భావించి వచ్చిన ప్రజలను అలరించేందుకు తమ్ముళ్లు ఆట పాటలతో కాలక్షేపం చేశారు. ఆంధ్ర నుంచి వచ్చిన కళాకారులు.. గాయకులు సినీనటుడు బాలకృష్ణ నటించిన సినిమాల్లోని పాటలు పాడి ప్రజలను అలరించారు.