చేసింది నేనే | election campaign at jagtial chandrababu | Sakshi
Sakshi News home page

చేసింది నేనే

Published Mon, Apr 28 2014 3:46 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

చేసింది నేనే - Sakshi

చేసింది నేనే

- జగిత్యాల జిల్లా చేస్తా
- వైద్యకళాశాల అందిస్తా
- బహిరంగ సభలో చంద్రబాబు

జగిత్యాల/జగిత్యాల అర్బన్ : జగిత్యాలను జిల్లా చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. తెలంగాణ జిల్లాల్లో తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల మినీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీ రంగంతో లక్షలమంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.

తెలంగాణలో సామాజికన్యాయం కోసం, బీసీలకు, మైనారిటీలకు న్యాయం చేసేందుకు టీడీపీ ముందుంటోందని తెలిపారు. బీసీల సమస్యలపై పోరాటం చేస్తున్న ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించానని, అదేస్థాయిలో జగిత్యాల బీసీ ముద్దుబిడ్డగా ఎదిగిన ఎల్. రమణను టీ-టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక చేశానని పేర్కొన్నారు.

 రమణతోపాటు జగిత్యాల నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు జగిత్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. జగిత్యాలలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలకు ఎన్నింటికో అనుమతి ఇచ్చానని గుర్తుచేశారు. డ్వాక్రా సంఘాలు అప్పుల్లో కూరుకుపోయానని, తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పులన్నీ మాఫీ చేస్తానని హామీఇచ్చారు.


కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఖాయమని, తెలంగాణలో తమ ప్రభుత్వం వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. టీటీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు, జగిత్యాల అభ్యర్థి ఎల్.రమణ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్నానని నియోజకర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని సవాల్‌విసిరారు.

 కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని అన్నారు. బీసీలకు పెద్దపీట వేయాలని కోరారు. నియోజకవర్గంలో తానుచేపట్టిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని స్థానిక నాయకుడు జీవన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కేంద్రంలో ఫిర్యాదుచేసి రద్దుచేయించారని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ టీడీపీ మొదటినుంచి బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌లో ఒకే సామాజికవర్గానిది పెత్తనమని, అలాంటివారికి అధికారం ఇవ్వొద్దని కోరారు.


ఆలస్యంతో విసిగిపోయిన ప్రజలు

ఉదయం 11.30కే సభ ప్రాంగణానికి చేరుకోవాల్సిన చంద్రబాబు నాలుగున్నర గంటల ఆలస్యంగా 3.48కి వచ్చారు. దీంతో నియోజకవర్గ పరిధి నుంచి ఉదయం పది గంటల వరకే సభా ప్రాంగణానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులెదుర్కొన్నారు. అప్పటివరకు ఉన్నవారు సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసుల సహాయంతో వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు.

బుజ్జగించి కూర్చోబెట్టారు. మధ్యాహ్నం 12కే సభ పూర్తవుతుందని భావించి వచ్చిన ప్రజలను అలరించేందుకు తమ్ముళ్లు ఆట పాటలతో కాలక్షేపం చేశారు. ఆంధ్ర నుంచి వచ్చిన కళాకారులు.. గాయకులు సినీనటుడు బాలకృష్ణ నటించిన సినిమాల్లోని పాటలు పాడి ప్రజలను అలరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement