జేసీ అనుచరుల ఆగడాలు.. ప్రభాకర్‌రెడ్డి అన్న చెప్పాడంటూ
సాక్షి, అనంతపురం(తాడిపత్రి): తాడిపత్రి మునిసిపాలిటీలో జేసీ అనుచరుల ఆగడాలు శ్రుతిమించాయి. తరచూ ఏదో ఒక వివాదాన్ని రేకెత్తిస్తున్నారు. తద్వారా అధికారులు, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రొటోకాల్ పేరిట గొడవ చేశారు. రెండు రోజుల క్రితం ఏకంగా మునిసిపల్ కమిషనర్ చాంబరును ఆక్రమించేందుకు ప్రయత్నించారు. టీడీపీ కౌన్సిలర్లతో పాటు ఆ పార్టీ నాయకులు మునిసిపల్ కార్యాలయంలోనే తిష్ట వేసి.. చీటికిమాటికి ‘జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్న చెప్పాడం’టూ అధికారుల విధులకు అడ్డు తగులుతున్నారు. వీరి ఆగడాలు తాళలేక కొందరు బదిలీపై వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
మారని తీరు
రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు అనుచరులు దౌర్జన్యాలు, బరి తెగింపులతో రెచ్చిపోయారు. అధికారులను భయకంపితులను చేశారు. అప్పట్లో వీరి ఆగడాలు తాళలేక ఎంతో మంది అధికారులు సెలవుపై వెళ్లిపోయారు. మరికొందరు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకున్నారు. వీరి తీరును ప్రజలు సైతం అసహ్యించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా తీరు మార్చుకున్నారా అంటే అదీ లేదు. పాత పద్ధతుల్లోనే అధికారులు, ఉద్యోగులపై రుబాబు చేస్తున్నారు.
చదవండి: (అచ్చెన్నా.. నీకెందుకంత నోటి దురద)
స్వేచ్ఛాయుత వాతావరణాన్ని దెబ్బతీస్తూ..
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కృషి చేశారు. అటు పోలీసు యంత్రాంగానికి, ఇటు అధికార యంత్రాంగానికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిచ్చారు. ఫలితంగా శాంతిభద్రతలు గాడిలో పడ్డాయి. పట్టణ వాసులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. జేసీ ప్రభాకర్‌రెడ్డి మునిసిపల్ చైర్మన్‌గా గెలిచిన తర్వాత తాడిపత్రిలో మళ్లీ అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మునిసిపల్ కార్యాలయంలో తన పార్టీ కౌన్సిలర్లతో ప్రొటోకాల్ వివాదానికి తెర లేపడమే కాకుండా అధికార దర్పంతో అధికారులను, సిబ్బందిని బెదిరిస్తున్నారు. మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్‌రెడ్డి ఇటీవల బదిలీపై వెళ్లారు. ఇంకా నూతన కమిషనర్ రాకపోవడంతో చాంబర్‌కు తాళం వేసి ఉంచారు. దీన్ని గమనించిన టీడీపీ కౌన్సిలర్లు గురువారం కమిషనర్ చాంబరును ఆక్రమించేందుకు ప్రయత్నించారు. తాళాలను దౌర్జన్యంగా పగులగొట్టి, కమిషనర్ నేమ్ బోర్డు సైతం తొలగించి చైర్మన్ చాంబర్‌గా మార్చాలని చూశారు. పోలీసులు రావడంతో వారి ఆటలు సాగలేదు.
►గత ఆగస్టులో తాను పిలిస్తే కమిషనర్ రాలేదన్న నెపంతో చైర్మన్ జేసీ తన అనుచరులతో కలిసి మునిసిపల్ కార్యాలయంలో 24 గంటల పాటు తిష్టవేసి నానా హంగామా సృష్టించారు. తనకు అధికారం లేకపోయినప్పటికీ అధికారులకు, కింది స్థాయి సిబ్బందికి నోటీసులు ఇస్తున్నానంటూ హడావుడి చేశారు.
►ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్‌డే సందర్భంగా జెండా ఆవిష్కరణ పేరుతో నానా యాగీ చేసి విమర్శల పాలయ్యారు.
►ప్రతి రోజూ టీడీపీ కౌన్సిలర్లతో పాటు చైర్మన్ జేసీ అనుచరులు కార్యాలయంలోకి వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ సిబ్బందిని బెంబేలెత్తిస్తున్నారు. వీరి తీరుతో ఆందోళన చెందుతున్న కొందరు ఉద్యోగులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జేసీ అనుచరుల వైఖరితో మునిసిపల్ కార్యాలయ విధులకు ఆటంకం కలగడమే కాకుండా..పట్టణాభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.