అనంతపురం, సాక్షి: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాల్ని తాను ఇష్టమొచ్చినట్లు తిడతానని, పడాల్సిందేనంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘చదువులెందుకంటూ?’ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారాయన.
‘‘తాడిపత్రిలో ఆలయాలకు వెళ్లే భక్తులకు క్రమశిక్షణ లేదు. జనాలను దారిలో పెట్టేందుకు ఖచ్చితంగా తిడతా.. పడాల్సిందే. మీరు మారతారా? లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. నావల్లనే సమస్య అంటే నేను వెళ్లిపోతా. ఉంటే మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా’’ అని అన్నారాయన. చెత్త వేసే వారి ఇళ్లకు కరెంట్ కట్ చేస్తా.. తాగునీటి సరఫరా నిలిపివేయిస్తా అని హెచ్చరించారు. అలాగే..
బీటెక్ చదివిన ఓ అమ్మాయిని దీపాలు అమ్ముతుంటే.. సంతోషపడ్డానని, వేరే దగ్గర ఆమెతో స్టాల్ పెట్టిస్తే.. మళ్లీ పాత చోటుకే వచ్చి అమ్ముతోందని మండిపడ్డారాయన. ఈ మాత్రం దానికి చదువుకుని దేనికి? అంటూ ప్రశ్నించారు. పిల్లలకు చదువులు కాకుండా క్రమశిక్షణ నేర్పించాలని తల్లిదండ్రులకు జేసీ సూచించారు.
‘‘పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి. చదువుకాదు. లేకుంటే పాడైపోతారు. అమెజాన్, రెడ్‌బస్ ఓనర్లు.. ఎలాన్ మస్క్.. వీళ్లంతా చదువులేనోళ్లే!!. ఇప్పుడంతా కొత్త షావుకారులే వస్తున్నారు. సదువులేనోళ్లు బ్రహ్మాండమైన ఇళ్లు కడుతున్నారు. వాళ్లంతా బుర్రున్నోళ్లు. ఇంజనీరింగ్ కంటే మున్సిపల్‌లో ఊడ్చే పర్మినెంట్ ఉద్యోగికి మంచి జీతం వస్తోంది’’ అని జేసీ అన్నారు. తాడిపత్రి ప్రజలకు ఉంది రెండే ఆప్షన్లు. మీరైనా మారాలి లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment