tadvayi
-
అలజడి
మళ్లీ మావోయిస్టుల కదలిక తాడ్వాయిలో విధ్వంసక చర్య అటవీ శాఖ గుడిసె, జీపు దగ్ధం కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరిట లేఖ పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన వరంగల్ ఏజెన్సీలో మరోసారి అలజడి రేగింది. తాడ్వాయిలోని అటవీ శాఖ వన్యప్రాణి విభాగం గుడిసెను, వాహనాన్ని తగులబెట్టడం.. సంఘటన స్థలంలో మావోయిస్టుల పేరిట ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖ ఉండడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఒంటిగంట సమయంలో తాడ్వాయిలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. వీరి చర్యతో ఆదివాసీల సంస్కృతి వివరించే ఒక గుడిసె, జీపు కాలిపోయాయి. మావోయిస్టు పార్టీ ఖమ్మం-కరీంనగర్-వరంగల్(కేకేడబ్ల్యూ) కార్యదర్శి దామోదర్ పేరుతో ఘటన స్థలంలో ఇప్ప చెట్టు వద్ద లేఖ ఉంది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ లేఖలోని అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులను మావోయిస్టులు ధ్వంసం చేయడం ఐదారేళ్ల కాలంలో ఎప్పుడూ జరగలేదు. తాడ్వాయిలోని అటవీ శాఖ ఆస్తులను మావోయిస్టు పార్టీ దగ్ధం చేయడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అంతా స్తబ్ధుగా ఉందనుకుంటున్న దశలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేకుండాపోయిందని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే ప్రకటిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో తాడ్వాయి ఘటన జరగడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. సాగునీటి శాఖ ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో భాగంగా నిర్మించనున్న ప్రాజెక్టుల రక్షణ కోసం తుపాకులగూడెం వద్ద పోలీస్ అటాకింగ్ స్టేషన్‌ను నిర్మించేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి ఘటన నేపథ్యంలో స్టేషన్ నిర్మాణం కోసం మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సరిగ్గా ఏడు నెలలకు... తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయిన మొదటి సంఘటన తాడ్వాయి-గోవిందరావుపేట అడవుల్లోనే జరిగింది. 2015 సెప్టెంబరు 15న జరిగిన ఈ ఎన్కౌంటర్లో తంగెళ్ల శృతి(27) అలియాస్ మహిత, మణికంటి విద్యాసాగర్‌రెడ్డి(27) అలియాస్ సాగర్ మృతిచెందారు. వరంగల్ ఏజెన్సీలో అప్పటికే మావోయిస్టుల ప్రభావం పూర్తిగా లేకుండా పోయిందనే పరిస్థితులలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. దీంతో మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల్లోనూ ఆందోళన పెరిగింది. ఇప్పుడు పూర్తిగా పోలీసుల అధిపత్యం ఉందనే భావన ఉంంది. ఇలాంటి పరిస్థితుల్లో తాడ్వాయి ఘటన జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన ఏడు నెలల తర్వాత అటవీ శాఖ ఆస్తుల దగ్ధమయ్యాయి. పోలీసు వర్గాలు సైతం మావోయిస్టు సానుభూతిపరులే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇదే దిశగా గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలతో స్థానికులకు, మావోయిస్టు పార్టీ మాజీ సభ్యులు, సానుభూతి పరులకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మావోస్టులా.. నకిలీలా.. ములుగు / తాడ్వారుు : తాడ్వాయిలో అటవీశా ఖ వన్యప్రాణి విభాగానికి చెందిన గుడిసె, జీపు దగ్ధం చేసింది మావోయిస్టులా.. నకిలీలా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటన స్థలంలో కేకేడబ్ల్యు కార్యదర్శి దామెదర్ పేరుతో లేఖ లభ్యమైంది. లేఖలో ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు గ్రీన్ హంట్ పేరుతో మావోయిస్టులను ఏరి పారేయాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని’ రాసి ఉంది. దీనిని చూస్తే మావోయిస్టులేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరుుతే లేఖ లెటర్‌ప్యాడ్‌పై కాకుండా తెల్లకాగి తంపై రాసి ఉండడాన్ని చూస్తే ఇది చేసింది నకిలేనన్న అనుమానం కూడా కలుగుతోంది. ఇదే తరహాలో గత ఏడాది జూన్ లో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో నడుస్తున్న జేసీబీ, వెంకటాపురం మండలంలోని బూర్గుపేటలో మిషన్‌కాకతీయ పనులు చేస్తున్న జేసీబీలు దగ్ధం చేశారు. ఈ ఘటనల్లో కూడా మావోరుుస్టుల పేరుతో లేఖలు కనిపించారుు. దీనిపై విచారణ చేసిన పోలీసులు ఇది ఆకతాయిల పనిగా తేల్చారు. అయితే మ ల్లంపల్లి సంఘటన జరిగిన నెల రోజుల వ్యవధి లో మొద్దుగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో విద్యాసాగర్, శృతి ప్రాణాలు వదిలారు. దీంతో పోలీసులు మావోయిస్టుల కదలికలు, సానుభూతిపరులపై దృష్టి పెట్టారు. తాడ్వాయి సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులకు సమాచా రం అందింది. తక్షణమే కూబింగ్ చేపట్టినా ఎవరూ తారసపడలేదు. ఒకరిద్దరు మావోరుుస్టులు గానీ, లేదా సానుభూతి పరులు ద్విచక్రవాహనంపై వచ్చి ఈ సంఘటనకు పాల్పడి క్షణాల్లో తప్పించుకొని ఉంటారని భావిస్తున్నారు. సందర్శించిన ములుగు ఏఎస్పీ మావోయిస్టులు దగ్ధం చేసిన హట్స్‌ను ములుగు ఏఎస్పీ విశ్వజిత్ సందర్శించారు. ముందుగా తా డ్వాయి ఎస్సై కరుణాకర్‌రావు పోలీసుల బలగాలతో సంఘటన స్థలంలో వివరాలు సేకరించా రు. అనంతరం వచ్చిన సందర్శించిన ఏఎస్పీ దగ్ధమైన జీపు, గుడిసెలను పరిశీలించి నైట్వాచ్మెన్లు రవి, సమ్మయ్య, జీపు డ్రైవర్‌ను ఘటన జరిగిన తీరుపై అడిగి తెలుసుకున్నారు. మంటల శబ్దానికి నిద్ర లేశాం.. గుడిసె, జీపు కాలుతున్న మంటల శబ్దానికి రాత్రి ఒంటి గంటకు మేల్కొన్నామని వాచ్మెన్లు రవి, సమ్మయ్య చెప్పారు. అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తూనే అధికారులకు సమాచారం అందించామని చెప్పారు. ఆ తర్వా త ఫైర్‌ఇంజన్ వచ్చి ఆర్పేసిందన్నారు. తాడ్వాయి-పస్రా మధ్య కూంబింగ్ పస్రా-తాడ్వాయి-ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు భారీ కూం బింగ్ చేపట్టారుు. గొత్తికోయగూడేలపై పోలీసు లు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎవరైనా తలదాచుకోవడానికి వచ్చారా అనే కోణం లో ప్రశ్నించారని సమాచారం. అనుమానితుల తో పాటు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది. మంత్రి పర్యటన రద్దు ములుగు : తాడ్వాయి మండలం వనకుటీరంలో మావోయిస్టుల పేరుతో గుడిసె, వాహనాన్ని తగలబెట్టిన నేపథ్యంలో ఏజెన్సీలో మంత్రి చందూలాల్ పర్యటన రద్దయింది. శనివారం మంత్రి మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. ఇంతలో మావోయిస్టుల పేరుతో ఘటన జరగడంతో పర్యటన రద్దయింది. పోలీసుల సూచనతో మంత్రి చందూలాల్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైనట్టు సమాచారం. -
మేడారంలో భక్తుల సందడి
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో అటవీ ప్రాంతంలో కొలువైన సమ్మక్మ, సారక్క ఆలయం వద్ద ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుమారు 4 వేల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల వద్ద కుంకుమ పూజలు చేసి మేకలు, కోళ్లను బలి ఇచ్చారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు!
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని మావోయిస్టు సానుభూతిపరుడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన సిద్ధబోయిన సంపత్ (25) గతంలో కూలీ పనులు చేసుకునేవాడు. ఆరు నెలల క్రితం లారీ క్లీనర్ పని కోసం వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ముందు తిరిగి తన గ్రామానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం పోలీసులు సంపత్‌ను మావోయిస్టు సానుభూతిపరుడనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. సంపత్‌ను కోర్టు ముందు హాజరపరచనున్నట్టు తెలిసింది. -
జాతర విధులు మరువలేనివి
తల్లుల సేవలో తరించడం అదృష్టం వనదేవతల ఆగమనం అనిర్వచనీయం ‘న్యూస్‌లైన్’తో జెడ్పీ సీఈఓ ఆంజనేయులు తెలంగాణ కుంభమేళాగా వర్ధిల్లుతున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో విధులు నిర్వర్తించడం నా అదృష్టం. కోరిన కోర్కెలు తీర్చుతూ.. భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న వనదేవతల్లో గొప్పశక్తి దాగి ఉంది. రెండేళ్లకోసారి జరిగే జాతరలో ప్రధానఘట్టం తల్లుల ఆగమనం. ఈ సమయంలో జాతర ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. భక్తులు తమను తాము మరిచిపోయి వనదేవతలను కొలుస్తుంటారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి మేడారానికి తరలివచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి జాతరను విజయవంతం చేయడంలో అధికారుల పాత్ర కీలకమని చెప్పవచ్చు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ వనదేవతల సేవలో తరిస్తున్న జిల్లా పరిషత్ సీఈఓ గాదె ఆంజనేయులు శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో గత జాతర అనుభవాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మేడారం జాతరలో విధులు నిర్వర్తించడం ప్రభుత్వ ఉద్యోగుల అదృష్టమనే చెప్పవచ్చు. నేను 2004 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు జాతరలో పనిచేశాను. 2004, 2006లో నర్సం పేట ఆర్డీఓగా, 2008లో ములుగు ఆర్డీఓగా, 2012, 2014లో జిల్లా పరిషత్ సీఈఓ హోదాలో వనదేవతలకు సేవ చేసే భాగ్యం దక్కింది. ఆర్డీఓగా పనిచేసిన అనుభవంతోనే తాను జాతరలో అభివృద్ధి పనుల బాధ్యతను తీసుకున్నాను. 2004 జాతర అధికార యంత్రాంగానికి గుణపాఠం.. 2004లో జరిగిన మేడారం జాతర జిల్లా యంత్రాంగానికి గుణపాఠం నేర్పింది. అప్పుడు జరిగిన జాతరలో ఆర్‌అండ్‌బీశాఖ అధికారులు ప్రధాన రహదారిని వెడల్పు చేసి, సైడ్బర్మ్స్ వేసేందుకు పక్కనే కందకం తీసి మట్టిని ఇరువైపుల పోశారు. అయితే జాతర ప్రారంభమయ్యే ముందు వర్షాలు కురియడంతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల వాహనాలు అందులో కూరుకుపోయాయి. సాధారణంగా జాతర జరిగే సమయం లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రోడ్డు పక్క ఉన్న అడవిలో వాహనాలను పార్కింగ్ చేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కానీ.. 2004 జాతరలో రోడ్డు వెడల్పు కోసం తీసిన కందకాల్లో వర్షపునీరు నిలువడం తో వాహనాలు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తాడ్వాయి మీదుగా జంగలంచ వరకు, మే డారం-నార్లాపూర్ మార్గంలో పస్రా వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో భక్తు లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది భక్తులు వాహనాలు ఆగిపోయిన చోట నుంచే కాలినడకన మేడారం చేరుకుని సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ట్రాఫిక్ స్తంభించిన సమయంలో దారి పొడవునా చిరువ్యాపారులు తాగునీరు, చల్లటి పానీయాలు, బిస్కెట్లు, ఇతర తినుబండారాలు అమ్మడంతో భక్తులకు కొంత ఊరట లభించింది. రోడ్డు వెడల్పు పనులను సకాలంలో చేయకపోవడం.. జిల్లా యం త్రాంగానికి గుణపాఠం నేర్పింది. 2006లో గద్దెల వద్ద విధులు.. 2006లో నర్సంపేట ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో గద్దెల వద్ద విధులు నిర్వర్తించాను. అప్పటి జాతరలో ఉదయం 6 గం టల నుంచి రాత్రి 11గంటల వరకు అక్కడే ఉండి పనిచేశాను. ఎందుకంటే తల్లులు గద్దెలపైకి వచ్చిన తర్వాత భక్తుల తాకిడితోపాటు దొంగల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. దేవతలు గద్దెలకు వస్తున్న సమయంలో అధికారులు కూడా తన్మయత్వంతో ఊగిపోతారు. ఆ సమయంలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. 2008లో ములుగు ఆర్డీఓగా పనిచేస్తున్నప్పుడు జంపన్నవాగు స్నానఘట్టాలపై విధులు నిర్వహించాను. జాతరలో ట్రాఫిక్‌తో పాటు స్నానఘట్టాలపై పోలీసు యం త్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2008లో జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే దంపతుల సామగ్రిని దొంగలు ఎత్తుకుపోతుండడం.. నేను కళ్లారా చూశా ను. ఈ విషయాన్ని అప్పటి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతో వారు అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. 2010లో కామారెడ్డిలో పనిచేయడం కారణంగా జాతరలో విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. 2011లో జిల్లా పరిషత్ సీఈఓగా మళ్లీ జిల్లాకు రావడంతో 2012లో తల్లులకు సేవలందించాను. అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత.. జాతరను పురస్కరించుకుని రహదారులు, సదుపాయాల కల్పనకు ఈ ఏడాది ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. అయితే గత జాతరల్లో పనిచేసిన అనుభవం కలిగిన తనకు కలెక్టర్ అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల ద్వారా చేపట్టిన పనులను పర్యవేక్షిస్తున్నాను. అయితే గత జాతరలో భక్తుల సౌకర్యార్థం ఎన్ని మరుగుదొడ్లు కట్టిన విషయం తెలుసుకునేందుకు జెడ్పీ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు డ్యూటీలు వేశాను. నిరంతరం పర్యవేక్షణ చేస్తుండడంతో పనుల్లో పురోగతి పెరిగింది. మేడారం జాతరతో పాటు అగ్రహంపాడ్, అమ్మవారిపేట లాంటి చిన్న జాతరల్లో జరిగే అభివృద్ధి పనులను కూడా పర్యవేక్షిస్తున్నాం. ఈ ఏడాది జరిగే వనదేవతల జాతరలో ఎంపీడీఓలు, సూపరింటెండెంట్‌స్థాయి అధికారుల సేవలు వినియోంచుకుంటాం. ప్రధాన గేటు వద్ద ఉన్నతాధికారి విధులు.. గత జాతరల్లో జరిగిన చిన్న చిన్న తప్పిదాలపై జిల్లా యం త్రాంగం ఇటీవల చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. 2010, 2012లో జరిగిన జాతరలో ఇతర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు(వీఐపీ) దర్శనానికి వచ్చిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు వారిని నేరుగా అనుమతించలేదు. దీనిపై అధికారుల మధ్య భేదాభి ప్రాయాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. వీఐపీల దర్శనం సందర్భంగా పోలీసు అధికారితో పాటు ఆర్డీఓ స్థాయి అధికారిని ప్రధానగేటు వద్ద విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. గేటు వద్ద ఉండే ప్రతి అధికారి 12 గంటల పాటు పనిచేసిన అనంతరం విశ్రాంతి తీసుకునే విధంగా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నాం. జాతర సెక్టొరియల్ అధికారులకు సహాయకులుగా తహసీల్దార్లతో పాటు పలువురు ఎంపీడీఓలు పనిచేయనున్నారు. జిల్లా పరిషత్ నుంచి ములుగు పరిధిలోని మండలాలకు చెందిన అధికారులను జాతర విధుల్లోకి తీసుకునే అవకాశాలున్నాయి.