జాతర విధులు మరువలేనివి
- తల్లుల సేవలో తరించడం అదృష్టం
- వనదేవతల ఆగమనం అనిర్వచనీయం
- ‘న్యూస్‌లైన్’తో జెడ్పీ సీఈఓ ఆంజనేయులు
తెలంగాణ కుంభమేళాగా వర్ధిల్లుతున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో విధులు నిర్వర్తించడం నా అదృష్టం. కోరిన కోర్కెలు తీర్చుతూ.. భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న వనదేవతల్లో గొప్పశక్తి దాగి ఉంది. రెండేళ్లకోసారి జరిగే జాతరలో ప్రధానఘట్టం తల్లుల ఆగమనం. ఈ సమయంలో జాతర ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. భక్తులు తమను తాము మరిచిపోయి వనదేవతలను కొలుస్తుంటారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి మేడారానికి తరలివచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి జాతరను విజయవంతం చేయడంలో అధికారుల పాత్ర కీలకమని చెప్పవచ్చు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ వనదేవతల సేవలో తరిస్తున్న జిల్లా పరిషత్ సీఈఓ గాదె ఆంజనేయులు శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో గత జాతర అనుభవాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మేడారం జాతరలో విధులు నిర్వర్తించడం ప్రభుత్వ ఉద్యోగుల అదృష్టమనే చెప్పవచ్చు. నేను 2004 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు జాతరలో పనిచేశాను. 2004, 2006లో నర్సం పేట ఆర్డీఓగా, 2008లో ములుగు ఆర్డీఓగా, 2012, 2014లో జిల్లా పరిషత్ సీఈఓ హోదాలో వనదేవతలకు సేవ చేసే భాగ్యం దక్కింది. ఆర్డీఓగా పనిచేసిన అనుభవంతోనే తాను జాతరలో అభివృద్ధి పనుల బాధ్యతను తీసుకున్నాను.
2004 జాతర అధికార యంత్రాంగానికి గుణపాఠం..
2004లో జరిగిన మేడారం జాతర జిల్లా యంత్రాంగానికి గుణపాఠం నేర్పింది. అప్పుడు జరిగిన జాతరలో ఆర్‌అండ్‌బీశాఖ అధికారులు ప్రధాన రహదారిని వెడల్పు చేసి, సైడ్‌బర్మ్స్ వేసేందుకు పక్కనే కందకం తీసి మట్టిని ఇరువైపుల పోశారు. అయితే జాతర ప్రారంభమయ్యే ముందు వర్షాలు కురియడంతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల వాహనాలు అందులో కూరుకుపోయాయి. సాధారణంగా జాతర జరిగే సమయం లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రోడ్డు పక్క ఉన్న అడవిలో వాహనాలను పార్కింగ్ చేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కానీ.. 2004 జాతరలో రోడ్డు వెడల్పు కోసం తీసిన కందకాల్లో వర్షపునీరు నిలువడం తో వాహనాలు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
తాడ్వాయి మీదుగా జంగలంచ వరకు, మే డారం-నార్లాపూర్ మార్గంలో పస్రా వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో భక్తు లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది భక్తులు వాహనాలు ఆగిపోయిన చోట నుంచే కాలినడకన మేడారం చేరుకుని సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ట్రాఫిక్ స్తంభించిన సమయంలో దారి పొడవునా చిరువ్యాపారులు తాగునీరు, చల్లటి పానీయాలు, బిస్కెట్లు, ఇతర తినుబండారాలు అమ్మడంతో భక్తులకు కొంత ఊరట లభించింది. రోడ్డు వెడల్పు పనులను సకాలంలో చేయకపోవడం.. జిల్లా యం త్రాంగానికి గుణపాఠం నేర్పింది.
2006లో గద్దెల వద్ద విధులు..
2006లో నర్సంపేట ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో గద్దెల వద్ద విధులు నిర్వర్తించాను. అప్పటి జాతరలో ఉదయం 6 గం టల నుంచి రాత్రి 11గంటల వరకు అక్కడే ఉండి పనిచేశాను. ఎందుకంటే తల్లులు గద్దెలపైకి వచ్చిన తర్వాత భక్తుల తాకిడితోపాటు దొంగల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. దేవతలు గద్దెలకు వస్తున్న సమయంలో అధికారులు కూడా తన్మయత్వంతో ఊగిపోతారు. ఆ సమయంలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. 2008లో ములుగు ఆర్డీఓగా పనిచేస్తున్నప్పుడు జంపన్నవాగు స్నానఘట్టాలపై విధులు నిర్వహించాను.
జాతరలో ట్రాఫిక్‌తో పాటు స్నానఘట్టాలపై పోలీసు యం త్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2008లో జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే దంపతుల సామగ్రిని దొంగలు ఎత్తుకుపోతుండడం.. నేను కళ్లారా చూశా ను. ఈ విషయాన్ని అప్పటి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతో వారు అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. 2010లో కామారెడ్డిలో పనిచేయడం కారణంగా జాతరలో విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. 2011లో జిల్లా పరిషత్ సీఈఓగా మళ్లీ జిల్లాకు రావడంతో 2012లో తల్లులకు సేవలందించాను.
అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత..
జాతరను పురస్కరించుకుని రహదారులు, సదుపాయాల కల్పనకు ఈ ఏడాది ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. అయితే గత జాతరల్లో పనిచేసిన అనుభవం కలిగిన తనకు కలెక్టర్ అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాల ద్వారా చేపట్టిన పనులను పర్యవేక్షిస్తున్నాను. అయితే గత జాతరలో భక్తుల సౌకర్యార్థం ఎన్ని మరుగుదొడ్లు కట్టిన విషయం తెలుసుకునేందుకు జెడ్పీ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు డ్యూటీలు వేశాను. నిరంతరం పర్యవేక్షణ చేస్తుండడంతో పనుల్లో పురోగతి పెరిగింది. మేడారం జాతరతో పాటు అగ్రహంపాడ్, అమ్మవారిపేట లాంటి చిన్న జాతరల్లో జరిగే అభివృద్ధి పనులను కూడా పర్యవేక్షిస్తున్నాం. ఈ ఏడాది జరిగే వనదేవతల జాతరలో ఎంపీడీఓలు, సూపరింటెండెంట్‌స్థాయి అధికారుల సేవలు వినియోంచుకుంటాం.
ప్రధాన గేటు వద్ద ఉన్నతాధికారి విధులు..
గత జాతరల్లో జరిగిన చిన్న చిన్న తప్పిదాలపై జిల్లా యం త్రాంగం ఇటీవల చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. 2010, 2012లో జరిగిన జాతరలో ఇతర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు(వీఐపీ) దర్శనానికి వచ్చిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు వారిని నేరుగా అనుమతించలేదు. దీనిపై అధికారుల మధ్య భేదాభి ప్రాయాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. వీఐపీల దర్శనం సందర్భంగా పోలీసు అధికారితో పాటు ఆర్డీఓ స్థాయి అధికారిని ప్రధానగేటు వద్ద విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. గేటు వద్ద ఉండే ప్రతి అధికారి 12 గంటల పాటు పనిచేసిన అనంతరం విశ్రాంతి తీసుకునే విధంగా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నాం. జాతర సెక్టొరియల్ అధికారులకు సహాయకులుగా తహసీల్దార్లతో పాటు పలువురు ఎంపీడీఓలు పనిచేయనున్నారు. జిల్లా పరిషత్ నుంచి ములుగు పరిధిలోని మండలాలకు చెందిన అధికారులను జాతర విధుల్లోకి తీసుకునే అవకాశాలున్నాయి.