గిన్నిస్ రికార్డే లక్ష్యంగా తైక్వాండో విన్యాసాలు
బోడుప్పల్: నగరంలో శనివారం వరల్డ్ తైక్వాండో డేని పురస్కరించుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా విద్యార్థులు తైక్వాండో విన్యాసాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు చత్తీస్గడ్, కర్ణాటక, మొహాలి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలకు చెందిన 999 మంది విద్యార్థులు ఈ విన్యాసాల్లో పాల్గొని, 13 నిమిషాల పాటు ప్రదర్శించారు.
బోడుప్పల్లో పల్లవి మోడల్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరాటే పోటీలు ఒకప్పుడు శారీరక దృడత్వం, సమాజంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నేర్చుకునేవారని చెప్పారు. తైక్వాండో గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డుకోసం 999 మంది విద్యార్థులచే ఈ విన్యాసాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ విద్యార్థులు కరాటే పోటీల్లో పాల్గొని ప్రపంచ స్థాయి గుర్తింపును రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. క్రీడల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు.