విమానాల్లో ఇలా కూర్చోకుంటే ప్రమాదమే
విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రయాణికులు గాయపడక తప్పదని తమ పరిశోధన, విశ్లేషణలో వెల్లడైందని విమాన తయారీసంస్థ బోయింగ్ తెలిపింది. విమానాలు టేకాఫ్ తీసుకునేటప్పుడు లేదా ల్యాండింగ్ అవుతున్న సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికులకు సూచించింది. ఆయా సమయాల్లో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తమ సీట్ల వెనకభాగాన్ని నిట్టనిలువుగా ఉంచుకోవాలే తప్ప.. ఏమాత్రం వెనక్కి వాల్చుకోకూడదని చెప్పింది.
ప్రయాణికులు తమ సీట్లను వెనక్కి వాల్చి కూర్చుంటే.. ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో చాలా ఇబ్బంది అవుతుందని బోయింగ్ తెలిపింది. సాధారణంగా విమాన ప్రమాదాల్లో ఎక్కువ శాతం ల్యాండింగ్, టేకాఫ్ సమయంలోనే జరుగుతాయని వివరించింది. 2004 నుంచి 2013 మధ్య కాలంలో 58 శాతం ల్యాండింగ్ సమయంలోను, 22 శాతం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలోను విమాన ప్రమాదాలు జరిగినట్లు గుర్తించామని వెల్లడించింది.
విమానాలు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతాయని, కానీ ఇలాంటివి కేవలం 10 శాతం మాత్రమేనని చెప్పింది. అందువల్ల విమాన ప్రయాణికులు ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో సీట్ల వెనకభాగం నిట్ట నిలువుగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. లేకుంటే ప్రమాదం తప్పదని ప్రయాణికులకు బోయింగ్ సంస్థ తెలిపింది.