శాసనసభా సమావేశాలు మొదలు
సాక్షి, ముంబై: బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం పది గంటలకు గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రసంగించారు. అనంతరం 178 మంది నూతన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు.
మిగతా ఎమ్మెల్యేలు మంగళవారం చేస్తారని శాసనసభ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులైన పాండుజీవా గావిత్తోనూ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చివరిరోజు జరిగే సమావేశంలో అధ్యక్షుడి నియమాకం జరగనుంది. అదేరోజు బీజేపీ ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోనుంది. అయితే మద్దతు ఎవరు ఇస్తారనే విషయంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. చివరిరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే అంశంపైనే అందరి దృష్టి నెలకొంది.
కాగా సమావేశాలు మొదలైన నేపథ్యంలో పోలీసు శాఖ శాసనసభ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. దక్షిణ విభాగం అదనపు పోలీసు కమిషనర్ కృష్ణప్రకాశ్ ఈ బందోబస్తుకు సారథ్యం వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్టేట్ రిజర్వ్డ్ పోలీసు (ఎస్ఆర్పీ) బలగాలు, బాంబు గుర్తింపు, నిర్వీర్య బృందం, అల్లర్ల నియంత్రణ బలగాలను రంగంలోకి దింపారు.
సభలోనూ పెరిగిన దూరం ప్రభావం
మద్దతు విషయంలో బీజేపీ, శివసేన మధ్య పెరిగిన దూరం ప్రభావం తొలిరోజు శాసనసభలోనూ కనిపించింది. శివసేన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ టీంను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగారు. మరాఠీ పాఠశాలల్లో ఉర్దూను ఆప్షనల్ సబ్జెక్టుగా చేర్చాలని నిర్ణయించినట్టు ఫడ్నవిస్ బృందంలోని సీనియర్ నాయకుడు, మైనారిటీ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ప్రకటించారు.
అయితే ఈ నిర్ణయంపట్ల శివసేన నాయకుడు దివాకర్ రావుతే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరాఠీ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ సబ్జెక్టును చేరిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయన్నారు. ‘నమాజ్ చేసుకునేందుకు స్థలం కేటాయించాల్సి ఉంటుంది. ప్రతి శుక్రవారం సెలవు ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకపోయినా కనీసం ఆఫ్ డే ఇవ్వాల్సి ఉంటుంది.
ఇటువంటి సమస్యలు మున్ముందు మరిన్ని తలెత్తుతాయి’ అని పేర్కొన్నారు. నగరంలో ప్రత్యేక ఉర్దూ పాఠశాలున్నాయని, ఈ నేపథ్యంలో మరాఠీ పాఠశాలల్లో ఉర్దూ నేర్పించాల్సిన అవసరమేముందని నిలదీశారు. తరగతిలో ఒక్క ముస్లిం విద్యార్థి ఉన్నా ప్రత్యేకంగా ఓ ఉపాధ్యాయుడిని నియమించాల్సి వస్తుందన్నారు.