తాండవ నదిలో ఇసుక కార్మికుడి మృతి
తుని రూరల్ :
తుని మండలం మరువాడ వద్ద శుక్రవారం తాండవ నదిలో ఇసుక తవ్వకానికి దిగిన కార్మికుడు ప్రమాదవశాస్తు నీట మునిగి మృతి చెందాడు. సహచరుల కథనం మేరకు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన కురందాసు నాని (చెల్లారావు–32) రోజులాగే తాండవ నదిలో ఇసుక తీసేందుకు వెళ్లాడు. నదీలో పది అడుగుల నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో ఇసుక తీయడం చేపట్టాడు. కొద్దిసేపటికే నీటి మునిగిపోతూ రక్షించండి అంటు కేకలు వేశాడు. సమీపంలోనే ఉన్న సహచరులు వచ్చి ప్రయత్నించినా కనిపించకపోవడంతో గల్లంతైనట్టుగా తుని అగ్నిమాపక, రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల అనంతరం నాని మృతదేహాం లభ్యమైంది. కేసు నమోదు చేసి తుని ఏరియా ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని పోలీసులు బందువులకు అప్పగించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. ప్రమాదమని తెలిసినా ఉపాధి కోసం తాండవ నదీలో దిగి ఇసుక తవ్వకాలు చేస్తున్నామని పి.కృష్ణ, ఉరుకూటి రాము తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.