Tandur constituency
-
ముగ్గురు ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్న ఎమ్మెల్సీ.. బీఆర్ఎస్లో కోల్డ్‌వార్!
వికారాబాద్ జిల్లా గులాబీ పార్టీలో రాజకీయాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలనే టెన్షన్ పెడుతున్నాయి. ఓ మాజీ మంత్రి అసంతృప్తితో రగిలిపోతూ ఎమ్మెల్యేలను ముప్పతిప్పలు పెడుతున్నారని టాక్. తెరవెనుక పావులు కదుపుతూ తమను దెబ్బతీస్తున్నారని ఆ సీనియర్ నేత గురించి ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్న ఆ సీనియర్ ఎవరు?.. పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణలో మాజీ మంత్రి.. ప్రస్తుత ఎమ్మెల్సీ. మూడు దశాబ్ధాలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తెర వెనక చక్రం తిప్పడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. నాలుగు సార్లు తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ తొలి క్యాబినెట్లో బెర్త్ సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి మండలిలో ప్రవేశించారు. వరుసగా మూడు సార్లు తన సతీమణి పట్నం సునీతారెడ్డిని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గెలిపించుకున్నారు. తన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా, ఆ తర్వాత కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ట్రాక్ రికార్డ్ ఘనంగానే ఉన్నా.. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యేలదే ఫైనల్ డెసిషన్ కావడంతో ఇన్నాళ్లు స్థబ్ధుగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో మహేందర్ రెడ్డి తనదైన శైలిలో తెరవెనక పావులు కదుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. మహేందర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరులో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తాండూరులో ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గంగా బీఆర్ఎస్ చీలిపోయింది. ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ చాలాసార్లు రచ్చకెక్కింది. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌తో కూడా మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి పొసగడం లేదు. గతంలో మర్పల్లిలో పర్యటించిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సునీతారెడ్డిపై ఎమ్మెల్యే ఆనంద్ తన వర్గీయులతో దాడి చేయించారనే ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి మహేందర్ రెడ్డి.. ఆనంద్ మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల వికారాబాద్ లో ఎమ్మెల్యే ఆనంద్ వ్యతిరేక వర్గం ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆనంద్ వర్గీయులు సమావేశం దగ్గరకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. ఈ పంచాయితీ కాస్తా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్దకు చేరింది. ఇరువర్గాలకు మంత్రి ఎలాంటి భరోసా ఇస్తారనేది ఇంట్రస్టింగ్ గా మారింది. పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి.. తనకు వ్యతిరేకంగా రోహిత్ రెడ్డి, ఆనంద్‌తో కలిసి జట్టు కట్టారని గుర్రుగా ఉన్నారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. పరిగిలో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న మనోహర్ రెడ్డిని తనవైపు తిప్పుకుని మహేంద్రుడు చక్రం తిప్పుతున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కునుకు లేకుండా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తన వ్యతిరేకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. -
బీఆర్ఎస్లో ట్విస్ట్: చిక్కుల్లో పైలట్.. ఉత్సాహంలో పట్నం
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలకంగా వ్యవహరించిన రోహిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా సాగుతున్న తాండూరు గులాబీ రాజకీయాలు.. ఏ మలుపు తీసుకుంటాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది. చిక్కుల్లో పైలట్ .. ఉత్సాహంలో పట్నం రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో సంచలనంగా మారారు. అప్పటి నుంచి వార్తల్లో హైలెట్ గా నిలిచారు. ఈ కేసు తరవాత చాలా రోజులు ప్రగతి భవన్ లోనే ఉన్నారు. కేసు కారణంగా సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. పక్షం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న రోహిత్‌రెడ్డి...ఎమ్మెల్సీ వర్గాన్ని బలహీన పరిచే పనిలో పడ్డారు. పైలెట్ రోహిత్ రెడ్డికి సీఎం కేసీఆర్ సపోర్ట్ ఉందనే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి క్రమంగా కేడర్ దూరం అవుతోంది. ఎమ్మెల్యే కారణంగా తన క్యాడర్ దూరం అవుతుండటాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. పాతికేళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి... తన వర్గబలం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. పెద్ద బాస్ భరోసా ఇచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన బలంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాత్రం దూకుడుగా వెళ్తున్నారు. ఎమ్మెల్యేల ఎర అంశంతో తాండూరు పేరు జాతీయ స్థాయికి తీసుకువెళ్ళానని ప్రచారం చేసుకుంటున్నారు. తాండూరు అభివృద్ధికి సీఎం కేసీఆర్ ను ఒప్పించి నిధులు తెస్తున్నానని పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మళ్లీ తానే పోటీ చేస్తానని కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. తాండూరు గులాబీ తోటలో ఇప్పడు సీటు విషయమై రచ్చ రచ్చ అవుతోంది. భారతీయ రాష్ట్ర సమితి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై కేడర్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కేటీఆర్‌ను కలిసిన రోహిత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్ రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఇదివరకే టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపిన రోహిత్‌రెడ్డి గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. దీంతో ఆయన టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోయినట్టుగా సమాచారం. ఏడాది క్రితం గులాబీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన అనంతరం కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందులో ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరారు. తాజాగా రోహిత్‌రెడ్డి చేరికతో ఆ సంఖ్య 12కు పెరిగింది. నల్లగొండ ఎంపీగా గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంఖ్య 6కు చేరనుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా పార్టీని వీడనున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌లో 5గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగలనున్నారు. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ విందు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలంతా ప్రగతిభవన్‌కు చేరుకుంటున్నారు. టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాల్సిందిగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేఖను సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది. -
తాండూరు తుది బరిలో ఎవరో!
తాండూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది ఆసక్తిగా మారింది. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైనా అభ్యర్థులను ఖరారు చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఆయా పార్టీల నుంచి బరిలో నిలిచే పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడంతో ఎవరు తుది బరిలో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీల మధ్య పొత్తుల నేపథ్యంలో తుది బరిలో ఎవరు నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా మహేందర్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. కాగా గత నెలలో మాజీ మంత్రి, స్వర్గీయ చంద్రశేఖర్ కుమారులు మల్కూడ్ నరేష్, రాకేష్ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలోకి చేరిన విషయం తెలిసిందే. దీంతో నరేష్ టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజుగౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందో ఆసక్తిగా మారింది. టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామని నరేష్, రాజుగౌడ్ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదరడంతో తాండూరు సీటు బీజేపీ, టీడీపీలో ఏ పార్టీకి దక్కుతుందనేది సందిగ్ధంగా మారింది. బీజేపీ నుంచి రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డి ఇక్కడ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పొత్తులో ఈ సీటు బీజేపీకి దక్కుతుందా లేదా టీడీపీ తీసుకుంటుందా? అనేది చర్చనీయాంశమైంది. ఇక వైఎస్సార్ సీపీ, ఎంఐఎంతోపాటు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలు తమ అభ్యర్థులను దించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.