ఎమ్మెల్యేల ఎర కేసులో కీలకంగా వ్యవహరించిన రోహిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా సాగుతున్న తాండూరు గులాబీ రాజకీయాలు.. ఏ మలుపు తీసుకుంటాయనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
చిక్కుల్లో పైలట్ .. ఉత్సాహంలో పట్నం
రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో సంచలనంగా మారారు. అప్పటి నుంచి వార్తల్లో హైలెట్ గా నిలిచారు. ఈ కేసు తరవాత చాలా రోజులు ప్రగతి భవన్ లోనే ఉన్నారు. కేసు కారణంగా సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. పక్షం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న రోహిత్రెడ్డి...ఎమ్మెల్సీ వర్గాన్ని బలహీన పరిచే పనిలో పడ్డారు. పైలెట్ రోహిత్ రెడ్డికి సీఎం కేసీఆర్ సపోర్ట్ ఉందనే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి క్రమంగా కేడర్ దూరం అవుతోంది. ఎమ్మెల్యే కారణంగా తన క్యాడర్ దూరం అవుతుండటాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. పాతికేళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి... తన వర్గబలం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.
పెద్ద బాస్ భరోసా ఇచ్చిండు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన బలంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాత్రం దూకుడుగా వెళ్తున్నారు. ఎమ్మెల్యేల ఎర అంశంతో తాండూరు పేరు జాతీయ స్థాయికి తీసుకువెళ్ళానని ప్రచారం చేసుకుంటున్నారు. తాండూరు అభివృద్ధికి సీఎం కేసీఆర్ ను ఒప్పించి నిధులు తెస్తున్నానని పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మళ్లీ తానే పోటీ చేస్తానని కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. తాండూరు గులాబీ తోటలో ఇప్పడు సీటు విషయమై రచ్చ రచ్చ అవుతోంది. భారతీయ రాష్ట్ర సమితి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై కేడర్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment