తాండూరు: తాండూరు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి లభించింది. గురువారం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా..
పట్నం మహేందర్‌రెడ్డి నాలుగుసార్లు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పట్నం ఫ్యామిలీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. తాండూరుతో పాటు జిల్లాలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది.
మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. తమ్ముడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, సోదరుడి కుమారుడు అవినాష్‌రెడ్డి షాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు.
పైలెట్‌కు టికెట్ ఇవ్వడంతో..
కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఒక్కటి చేసింది. పైలెట్ రోహిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ మరో సారి టికెట్ ఇచ్చారు. టికెట్టు కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్‌రెడ్డిని బుజ్జగించి క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు గురువారం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రిగా రెండోసారి బాధ్యతలు తీసుకోనుండడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment