బీఆర్‌ఎస్‌లో ఇంటి పోరు.. టికెట్‌ దక్కకుంటే మరో పార్టీ నుంచి పోటీకి సై.. | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లో ఇంటి పోరు.. టికెట్‌ దక్కకుంటే మరో పార్టీ నుంచి పోటీకి సై..

Published Mon, Aug 7 2023 7:00 AM | Last Updated on Mon, Aug 7 2023 11:24 AM

- - Sakshi

వికారాబాద్‌: అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఇంటి పోరు మొదలయ్యి ఏళ్లు గడుస్తుండగా.. ఇప్పుడు తీవ్రమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమరం మరో నాలుగు నెలలుండగానే రాజకీయ వేడి మొదలయింది. జిల్లాకు చెందిన నాలుగు నియోజకవకర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఇందులో కొందరు నేతలు అధిష్టానాన్ని ఒప్పించి తామే పోటీ చేస్తామంటూ ప్రచారం చేసుకుంటుంగా.. మరి కొందరు పార్టీ ఏదయినా సరే ఎమ్మెల్యే బరిలో ఉంటామంటున్నారు. రిజర్వేషన్‌ ఉన్న నియోజకవర్గాల నేతలు పక్క నియోజకవర్గాల మీద దృష్టి సారిస్తుండగా.. ఇంకొందరు సొంత నియోజకవర్గాల్లోనే అమీతుమీ తేల్చుకుంటామని బాహాటంగానే పేర్కొంటున్నారు.

మూడేళ్ల పాటు మిన్నకుండిన నేతలు ఏడదిన్నరగా ప్రస్తుత ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటూ వారిపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా నేతలు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది.. వారికి టికెట్లు ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా తమ పేర్లను పరిశీలించాలంటూ అధికార పార్టీ ఆశావహులు అధిష్టానంతో పాటు తమకు తెలిసిన మంత్రులు, ముఖ్య నేతలచుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

పట్నం, పైలట్‌ మధ్య టైట్‌ ఫైట్‌..
తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నది మొదలు రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ నుంచైనా.. ప్రభుత్వ కార్యక్రమైనా.. ప్రైవేటు కార్యక్రమాలైనా పట్నం, పైలట్‌ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ సభ్యత్వ కర్యక్రమాలు, కమిటీలు, ప్రత్యేక సమావేశాలు ఇలా ఏ కార్యక్రమైనా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది.

ఇటీవల పట్నం మహేందర్‌రెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతుండగా ఆయన దాన్ని కొట్టిపారేస్తున్నారు. తాజాగా తాండూరు టికెట్‌ను బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ ఆశిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదరణ పెంచుకుంటున్నాడు. ఒక్క బీసీ నేతకు పార్టీ టికెట్‌ ఇవ్వకపోతుండా అనే ధోరణిలో ఆయన కూడా పోటీకి సై అంటున్నారు.

రిజర్వ్‌డ్‌లోనూ రివర్స్‌..
ఎస్సీ రిజర్వ్‌డ్‌ అయిన జిల్లా కేంద్రం వికారాబాద్‌లోనూ ఇంటిపోరు కనిపిస్తోంది.. ఇటీవల ఇక్కడ ఆశావహుల జాబితా చాతాడంత పెరిగింది. ఇటీవల జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజయ్‌ కుమార్‌ పార్టీ పెద్దలను కలిసి ప్రయత్నాలు చేస్తున్నారంటూ వినిపిస్తోంది. మరో నాయకుడు అధదికార పార్టీ కార్మిక విభాగం నేత బి.కృష్ణ ప్రస్తుత ఎమ్మెల్యే విమర్శలు పాలవుతున్నారని ప్రత్యామ్నాయంగా తన పేరు పరిశీలించాలని అధిష్టాన్ని కోరుతున్నారు.

మరో నేత వడ్ల నందు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పేర్లతో వాల్‌రైటింగ్స్‌తో చర్చకు తెరతీస్తున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నాడు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌కు ప్రత్యామ్నాయంగా ఈ సారి టికెట్‌ తనకే ఇవ్వాలని మరో డాక్టర్‌ టి.ఆనంద్‌ ప్రతయ్నాలు ప్రారంభించారు.

పరిగి, కొడంగల్‌లో లుకలుకలు..
జనరల్‌ నియోజక వర్గాలైన పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ తరపున పలువురు నేతలు ఎమ్మెల్యే టికెట్‌ రేసులో ఉన్నామంటూ చర్చకు తెరతీస్తున్నారు. కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఇటీవల వరకు టికెట్‌ కోసం యత్నించి తాజాగా కాంగ్రెస్‌ గూటికి చేరడంతో బీఆర్‌ఎస్‌కు బలం తగ్గినట్టయింది. ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి నియోజకవర్గ కేంద్రంలో బలం పుంజుకోలేక పోతున్నారు.

పరిగి నియోజకవర్గం నుంచి పలువురు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు ఎమ్మెల్యే టికెట్‌ రేసులో తాము సైతం అంటూ ప్రచారం చేసుకుంటున్నుఆరు. ఇందులో నాగేందర్‌ కొద్ది రోజులు హడావిడి చేసినా ఇప్పడు మిన్నకుండి పోయారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పదవిలో కొనసాగుతున్న నియోజకవర్గ నేత బుయ్యని మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీలో ఉండేందుకు పావులు కదుపుతున్నారు. తాను పోటీలో ఉండటం ఖాయం అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. తనకంటూ ఓ గ్రూపును తయారు చేసుకోవడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement